‘కరోనా’  ఫికర్‌ లేదు..

28 Jan, 2020 01:49 IST|Sakshi

వుహాన్‌లో 8 డిగ్రీలు.. రాష్ట్రంలో 35 డిగ్రీలు

అధిక ఉష్ణోగ్రత వల్ల ఇక్కడ కరోనా వ్యాప్తి అసాధ్యం

ఆందోళన అవసరం లేదంటున్న రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ

అయినా ముందస్తుగా నోడల్‌ కేంద్రాలుగా 3 ఆస్పత్రులు

నగరానికి కేంద్ర బృందం.. నేడు ‘నోడల్‌’లో పర్యటన

చైనా నుంచి వచ్చిన అనుమానితుల్లో ఇద్దరికి నెగిటివ్‌

కేంద్రం నుంచి చైనా వెళ్లొచ్చిన వారి జాబితా తెప్పించుకుంటున్న రాష్ట్ర యంత్రాంగం  

సాక్షి, హైదరాబాద్‌ : చైనాలోని వుహాన్‌ నగరంలో ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు 8 డిగ్రీలు.. రాత్రి ఉష్ణోగ్రతలు రెండు, మూడు డిగ్రీల వరకు పడిపోతున్నాయి. అక్కడ అత్యంత శీతల వాతావర ణం నెలకొని ఉంది. అదే తెలంగాణలో ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు 30 నుంచి 35 డిగ్రీల మధ్య ఉండగా, రాత్రి ఉష్ణోగ్రతలు 15–20 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఇంతటి అధిక ఉష్ణోగ్రతల మధ్య కరోనా వైరస్‌ తెలంగాణలో వ్యాప్తి చెందే అవకాశాలు తక్కువని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. చల్లటి వాతావరణంలోనే కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతుందని, అందుకే వుహాన్‌ నగరంలో అధికంగా విస్తరిస్తోందని అంటున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో కరోనా వైరస్‌ సోకే ప్రమాదాలు తక్కువంటున్నారు అధికారులు. ఈసారి రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ వైరస్‌ విస్తరించకపోవడానికి ప్రధాన కారణం చలి తీవ్రత తక్కువగా ఉండటమేనంటున్నారు.  

వారికి కరోనా లేదు.. 
ఇటీవలే చైనా నుంచి వచ్చిన ముగ్గురు వ్యక్తులు, నగరంలోని ఓ మహిళ అకస్మాత్తుగా అనారోగ్యం బారిన పడటంతో వ్యాధినిర్ధారణ పరీక్షల కోసం వారు 2 రోజుల క్రితం ఫీవర్‌ ఆస్పత్రిలో చేరారు. వీరిలోని ఓ బాధితుడి నుంచే నగరంలోనే ఉంటున్న సదరు మహిళ(అతడి భార్య)కు సోకినట్లు తెలిసింది. దీంతో ఆస్పత్రి వైద్యులు వారిని ప్రత్యేక వార్డుకు తరలించి చికిత్సలు అందిస్తున్నారు. బాధితుల నుంచి రెండు నమూనాలు సేకరించారు. స్వైన్‌ఫ్లూ నిర్ధారణ పరీక్షల కోసం ఒక శాంపిల్‌ను నారాయణగూడ ఐపీఎంకు పంపగా, కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం మరో శాంపిల్‌ను పుణే వైరాలజీ ల్యాబ్‌కు పంపారు. ఈ నలుగురిలో ఇద్దరి రక్త నమూనాలను పుణేలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ ల్యాబ్‌లో పరీక్షించగా.. అవి నెగిటివ్‌ రావడంతో వైద్య ఆరోగ్య శాఖ ఊపిరి పీల్చుకుంది. చైనా నుంచి అనుమానిత కరోనా లక్షణాలున్న వారి ద్వారా వైరస్‌ వ్యాప్తి చెందకుండా అప్రమత్తమైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. 

రాష్ట్రానికి కేంద్ర వైద్య బృందం.. 
కరోనా వైరస్‌ లక్షణాల గుర్తింపు, ప్రత్యేక వార్డుల రూపకల్పన, నమూనాల సేకరణ, చికిత్సలు వంటి అంశాల్లో వైద్యులకు శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఎయిమ్స్‌ వైద్య బృందాన్ని రాష్ట్రానికి పంపింది. నలుగురు వైద్యులతో కూడిన వైద్య బృందం సోమవారం సాయంత్రం హైదరాబాద్‌ చేరుకుంది. మంగళవారం ఉదయం నల్లకుంటలోని ఫీవర్‌ ఆస్పత్రి సహా గాంధీ నోడల్‌ కేంద్రాలను బృందం సందర్శించనుంది. ప్రత్యేక వార్డులు, చికిత్సలకు సంబంధించి వైద్యులకు పలు సూచనలు, సలహాలు అందజేయనుంది. మరోవైపు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ప్రీతి సూడాన్‌ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కరోనాపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో వివరాలు సేకరించారు. అనంతరం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి సంబంధిత ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇటీవల చైనా వెళ్లొచ్చిన వారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఆ వివరాల జాబితాను కేంద్రం నుంచి తెప్పించుకుంటున్నారు. తద్వారా వారిని గుర్తించాలని రాష్ట్ర యంత్రాంగం భావిస్తోంది. ఈ మేరకు వివరాలను సేకరించేందుకు కొన్ని బృందాలను ఏర్పాటు చేసినట్లు సమాచారం. 

3 నోడల్‌ ఆస్పత్రులు.. 
కరోనా వైరస్‌పై తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న వైద్య, ఆరోగ్య శాఖ.. తాజాగా హైదరాబాద్‌లోని గాంధీ, ఫీవర్, ఛాతీ ఆస్పత్రులను నోడల్‌ ఆస్పత్రులుగా ఏర్పాటు చేసింది. గాంధీలో 40 పడకలు, ఫీవర్‌ ఆస్పత్రిలో 40, ఛాతీ ఆస్పత్రిలో 20 పడకలతో ప్రత్యేక ఐసోలేషన్‌ వార్డులను అధికారులు ఏర్పాటు చేశారు. అలాగే గాంధీ ఆస్పత్రిలో క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌తోపాటు ఐసీయూను ఏర్పాటు చేశారు. ఈ ఐసోలేషన్‌ వార్డుల్లో పనిచేసే వైద్య సిబ్బందికి ఇప్పటికే ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఆస్పత్రుల్లో ఏర్పాటు చేయాల్సిన చెక్‌ లిస్టును ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించగా, కేంద్రం ఆ వివరాలను రాష్ట్రానికి పంపింది. ప్రస్తుతం నోడల్‌ ఆస్పత్రులుగా ఎంపిక చేసిన ఆ మూడింటిలో అన్ని రకాల వసతులు చెక్‌ లిస్ట్‌ ప్రకారం ఉన్నాయా లేదా కేంద్ర బృందం మంగళవారం పర్యటనలో పరిశీలించనుంది. 

వ్యాధి నిర్ధారణ ఎంతో క్లిష్టం.. 
గ్రేటర్‌ వాసుల కంటిమీద కునుకులేకుండా చేసిన హెచ్‌1ఎన్‌1 స్వైన్‌ఫ్లూ వైరస్‌ లక్షణాల మాదిరే తాజాగా చైనాలో వెలుగుచూసిన కరోనా వైరస్‌ లక్షణాలు ఉండటంతో వైద్యులకు వ్యాధి నిర్ధారణ, చికిత్స సవాల్‌గా మారింది. సాధారణ ప్లూతో బాధపడుతున్న వారు కూడా ఆందోళనతో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారు. 

బిడ్డల ఆరోగ్యంపై తల్లిదండ్రుల్లో ఆందోళన.. 
చైనాలో ఎంబీబీఎస్, ఇతర కోర్సుల కోసం హైదరాబాద్‌ సహా తెలంగాణ జిల్లాల నుంచి అనేక మంది వెళ్తుంటారు. వీరిలో అధికశాతం ప్రస్తుతం కరోనా వైరస్‌ వెలుగుచూసిన వుహాన్‌ పరిసర ప్రాంతాల్లోని కాలేజీల్లోనే చదువుతుంటారు. ఇప్పటికే అక్కడ వేలాది మంది కరోనా బారిన పడటం, సుమారు 60 మంది మృత్యువాత పడటంతో అక్కడున్న తమ బిడ్డల ఆరోగ్య పరిస్థితిపై గ్రేటర్‌ వాసుల్లో ఆందోళన మొదలైంది. చైనా నుంచి స్వదేశానికి వచ్చిన విద్యార్థులకు ఎయిర్‌పోర్టుల్లోనే స్క్రీనింగ్‌ చేసి, ఎలాంటి వైరస్‌ లేదని నిర్ధారించుకున్న తర్వాత స్వస్థలాలకు పంపుతున్నారు. బాధితులు తీరా ఇంటికి చేరుకున్న రెండు, మూడు రోజుల తర్వాత జ్వరం, దగ్గు, జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతుండటంతో భయంతో చికిత్సల కోసం ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. ఇదే సమస్యతో ఓ ఎంబీబీఎస్‌ విద్యార్థిని 3 రోజుల క్రితం ఫీవర్‌ ఆస్పత్రిలో చేరడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. 

లక్షణాలుంటే సమాచారం ఇవ్వాలి.. 
చైనా దేశం నుంచి వచ్చిన వారిలో ఎవరికైనా కరోనా వైరస్‌ లక్షణాలుంటే వెంటనే హైదరాబాద్‌లోని ప్రజారోగ్య కార్యాలయానికి సమాచారం ఇవ్వాల్సిందిగా అన్ని జిల్లాల వైద్యాధికారులకు ఆదేశాలు అందాయి. అలాగే చైనా నుంచి వచ్చి ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎవరైనా చికిత్స పొందుతున్నట్లయితే యాజమాన్యాలు వెంటనే ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాల్సిందిగా సోమవారం వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇదిలావుంటే ఈ వైరస్‌ నియంత్రణకు ఎలాంటి మందులు, వ్యాక్సిన్లు లేవని ఆ శాఖ స్పష్టం చేసింది. సాధారణ జ్వరం, జలుబుకు వాడే మందులు, జాగ్రత్తలు మాత్రమే ఉన్నాయని తెలిపింది. స్వైన్‌ఫ్లూకు తీసుకునే జాగ్రత్తలే తీసుకోవాలని కోరింది. 

కేంద్రం పంపించిన చెక్‌లిస్ట్‌ ఇదే.. 
– కరోనా వైరస్‌ సోకిన వ్యక్తికి అవసరమైన క్రిటికల్‌ కేర్, ఇంటెన్సివ్‌ కేర్, శ్వాసకోశ సంబంధమైన చికిత్సలు అందించే స్పెషలిస్టులు ఉన్నారా?  
– వైరస్‌ సోకిన వ్యక్తికి చికిత్స చేసేందుకు అంకితభావమున్న డాక్టర్లు, నర్సులు, సిబ్బంది ఉన్నారా లేదా? 
– సర్జికల్‌ గ్లోవ్స్, రబ్బర్‌ గ్లోవ్స్, సర్జికల్‌ మాస్క్‌లు అందుబాటులో ఉన్నాయా?  
– ముఖ్యమైన ఫోన్‌ నంబర్లు అందుబాటులో ఉన్నాయా?  
– అవసరమైన సమయంలో నిర్ణయం తీసుకునేలా ఆస్పత్రి కమిటీ ఉందా? 
– ఆస్పత్రిలో ఏదైనా విపత్తు తలెత్తితే దాన్ని నియంత్రించే పరిస్థితి ఉందా? 
– ఆస్పత్రిలో మొత్తం ఎన్ని పడకలు ఉన్నాయి? 
– ఆస్పత్రికి వచ్చే సాధారణ రోగులకు దూరంగా కరోనా వైరస్‌ అనుమానిత లక్షణాలున్న వారికి చికిత్స చేసేందుకు ప్రత్యేక గదులున్నాయా? 
– ఆ ప్రత్యేక గదులకు గాలి వెలుతురు పూర్తిస్థాయిలో ఉందా? 
– ఇన్‌ఫెక్షన్‌ నియంత్రణ, నివారణకు కమిటీలు ఉన్నాయా? ఇన్‌ఫెక్షన్‌ రాకుండా వైద్య పరమైన చర్యలన్నీ తీసుకున్నారా? ఇన్‌ఫెక్షన్‌ ప్రొటోకాల్స్‌ పాటిస్తున్నారా లేదా? 
– కరోనా వైరస్‌ అనుమానిత వ్యక్తులకు వైద్యం చేసేందుకు ఐసీయూ పడకలు ఉన్నాయా? లేదా? 
– ఆక్సిజన్‌ సరఫరా ఏ విధంగా చేస్తారు? సిలెండర్ల ద్వారానా లేకుంటే సెంట్రల్‌ సప్లయ్‌ సిస్టం ద్వారానా?   

మరిన్ని వార్తలు