పంట రుణమేదీ ?

30 May, 2016 01:48 IST|Sakshi

ఇంకా ఖరారు కాని ప్రణాళిక
ఖరీఫ్ సాగుకు రైతుల సమాయత్తం
{పభుత్వ సాయం కోసం ఎదురుచూపులు

 

హన్మకొండ: రోహిణి కార్తె ప్రవేశంతో రైతులు ఖరీఫ్ సాగుకు సిద్ధమయ్యారు. వర్షం పడితే విత్తనాలు వేసేందుకు సమాయత్తమయ్యారు. విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు పెట్టుబడుల కోసం  ఎదురుచూస్తున్నారు. అయితే జిల్లాలో ఇంకా ఖరీఫ్ పంట రుణ ప్రణాళిక సిద్ధం కాలేదు. జిల్లాలో దాదాపు ఏడు లక్షల మంది రైతులు వివిధ పంటలను సాగు చేస్తున్నారు. ఖరీఫ్‌లో 5,02,819 హెక్టార్లలో పంటలు సాగు చేస్తారని అంచనా వేసిన వ్యవసాయ శాఖ.. ఈ మేరకు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంది. జూన్ 1 నుంచి ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానుండగా అధికార యంత్రాంగం, లీడ్ బ్యాంకు ఇప్పటికీ ఖరీఫ్ పంట రుణ ప్రణాళిక రూపొందించలేదు. ఏయే బ్యాంకులు ఎంత మంది రైతులకు, ఎంత విస్తీర్ణం మేరకు రుణాలిస్తాయో ఇప్పటి వరకు  ప్రకటించలేదు. వర్షాలు సకాలంలో పడితే విత్తనాలు వేసేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు.


విత్తనాలు, ఎరువులు సమకూర్చుకోవడానికి, దుక్కులు దున్నడానికి డబ్బులు అవసరం కావడంతో ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. అరుుతే బ్యాంకుల రుణాలు ఇవ్వడానికి ముందుకు రాకపోవడంతో వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఏడాదికి 25 శాతం చొప్పున ప్రభుత్వం ఇప్పటి వరకు రెండు విడతల్లో  50 శాతం రుణ మాఫీ చేసింది. ఖరీఫ్ నాటికి మరో 25 శాతం రుణమాఫీ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

 
కరువు మండలాలు 11..

జిల్లాలోని 11 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. అరుుతే వాస్తవానికి జిల్లా అంతటా కరువు నెలకొంది. గతేడాది ఖరీఫ్, రబీ సీజన్లలో పంటలు పండక రైతులు తీవ్రంగా నష్టపోయూరు. ఈ ఏడాదైనా వ్యవసాయానికి ఆర్థిక చేయూతనందించాల్సిన ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం చోద్యం చూస్తోందని రైతు సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం రుణ ప్రణాళిక ప్రకటించాలని, రైతులకు సకాలంలో ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఖరీఫ్‌లో వరి 1.66 లక్షల హెక్టార్లు, జొన్న 168 హెక్టార్లు, మొక్కజొన్న 55 వేలు, పెసర 23 వేలు, మినుములు 1000 హెక్టార్లు, కందులు 12 వేలు, పత్తి 2.10 లక్షల హెక్టార్లు, మిర్చి 12 వేలు, పసుపు 15 వేల హెక్టార్లు సాగు చేస్తారని జిల్లా వ్యవసాయ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. అయితే పత్తి సాగును సగానికి తగ్గించి, ఇతర పంటలు సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పిస్తోంది. దీంతో ఖరీఫ్ పంట అంచనా ప్రణాళికలో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు