చేగూరులో మళ్లీ కలకలం..

14 Apr, 2020 11:20 IST|Sakshi
మృతురాలి కుటుంబ సభ్యులను హైదరాబాద్‌కు తరలిస్తున్న వైద్యబృందం

కరోనాతో ఇప్పటికే మహిళ మృతి

తాజాగా మృతురాలి భర్తకు కరోనా పాజిటివ్‌

ఆరుగురిని హైదరాబాద్‌కు తరలించిన వైద్యబృందం

నందిగామ: చేగూరులో మళ్లీ కలకలం రేగింది. గ్రామానికి చెందిన ఓ మహిళ కరోనాతో ఈ నెల 3న మృతిచెందిన విషయం విదితమే. సోమవారం ఆమె భర్తకు సైతం కరోనా పాజిటివ్‌ రావడంతో గ్రామస్తులు భయందోళన చెందుతున్నారు.  గత వారం మహిళ మృతి చెందిన అనంతరం ఆమెకు కరోనా పాజిటివ్‌æ అని రిపోర్టులు రావడంతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీంతో అధికార యంత్రంగం తక్షణమే స్పందించి మృతురాలి కుటుంబసభ్యులను, ఆమె ఇంట్లో అద్దెకున్న బిహార్‌ రాష్ట్రానికి చెందిన నలుగురు యువకులతో పాటు అమె అంత్యక్రియల్లో అతిసమీపం నుంచి పాల్గొన్న వారిని గుర్తించి రాజేంద్రనగర్‌లోని క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు. బిహార్‌ రాష్ట్రానికి చెందిన ఒక యువకుడికి పాజిటివ్‌ రావడంతో అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

మృతురాలి భర్త మినహా మిగతా వారందరికి నెగిటివ్‌ రిపోర్టు వచ్చింది. అయినప్పటికి అధికారులు గ్రామాన్ని హాట్‌ స్పాట్‌ గ్రామంగా గుర్తించి గ్రామానికి ఇతరులేవరూ రాకపోకలు కొనసాగించకూడదని చెక్‌పోస్టును ఏర్పాటు చేశారు. మృతురాలి భర్తకు సైతం కరోనా పాజిటివ్‌ అని తేలడంతో మళ్లీ గ్రామంలో భయాందోళన నెలకొంది. దీంతో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ చందునాయక్‌ ఆధ్వర్యంలో వైద్యులు సోమవారం గ్రామానికి చేరుకొని మృతురాలి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు, వారి ఇంట్లో అద్దెకున్న ముగ్గురు బిహార్‌ రాష్ట్రానికి చెందిన యువకులు మొత్తం ఆరు మందిని హైదరాబాదుకు తరలించారు. వారిని మరోసారి పరీక్షించనున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్‌ చందునాయక్‌ మాట్లాడుతూ.. ఇంట్లో నుంచి ఎట్టి పరిస్థితిల్లో బయటకు రాకూడదని అన్నారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. కరోనా వైరస్‌ను తేలికగా తీసుకోకూడదని అన్నారు.

మరిన్ని వార్తలు