రైతు దుఃఖం చేనుకు చేవ కాదు

15 Sep, 2017 00:51 IST|Sakshi
రైతు దుఃఖం చేనుకు చేవ కాదు

విశ్లేషణ
పౌష్టికాహార లోపం, పేదరికం, ఆకలి బాధల నుంచి విముక్తం చేయడంలో ప్రజానీకానికి రక్షణ కవచంగా నిలబడటంలో వ్యవసాయానిదే అగ్రస్థానం. రైతుల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తూ, వ్యవసాయ దిగుబడుల మీద దృష్టి పెట్టడం ఆ రంగానికి ఒక శాపం వంటిది. ప్రధాని మోదీ కల నిజం కావాలంటే, ఆ లక్ష్యాలను చేరుకోవాలంటే పాత తప్పిదాల నుంచి గుణపాఠం నేర్చుకుని కొత్త విధానానికి మళ్లడం అవసరం. దీనికి ఇదే సరైన సమయం. అందువల్ల కచ్చితంగా ఫలితాలను సాధించవచ్చు.

వాషింగ్టన్‌ కేంద్రంగా పనిచేసే అంతర్జాతీయ ఆహార విధానం, పరిశోధనా సంస్థ ప్రపంచంలోని ఆకలిరాజ్యాల జాబితాను నిరుడు అక్టోబర్‌ నెలలో విడుదల చేసింది. జనాభా ప్రాతిపదికన ఏ దేశాలు ఆకలితో, పోషకాహార లోపంతో బాధపడుతున్నాయో ఆ జాబితా క్రమపద్ధతిలో చెప్పింది. ఆకలి, పోషకాహార లోపాన్ని ఎదుర్కొంటున్న 118 అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితా అది. అందులో భారతదేశం 97వ స్థానంలో ఉంది. పాకిస్తాన్‌ను మినహాయిస్తే మిగిలిన తన ఇరుగు పొరుగు దేశాలు అన్నింటితోను పోల్చి చూస్తే భారత్‌ అధ్వానమైన స్థానంలోనే ఉన్నట్టు తెలుస్తుంది.

యథా ప్రకారం ఈ జాబితా గురించి కూడా పత్రికలలోని సంపాదకీయ శీర్షికల్లో ఒకసారి ప్రస్తావన కనపడింది. ఆపై అంతా మరచిపోయారు. ప్రపంచంలో ఆకలితో అలమటిస్తున్న దేశాల సూచీని మొదటిసారి 2006లో తయారుచేసిన సంగతి చాలామందికి తెలియదు కూడా. ఆ జాబితాలో 119 దేశాలు ఉండగా, భారత్‌ 96వ స్థానంలో ఉంది. అంటే 11 సంవత్సరాల తరువాత కూడా ఆకలి, పౌష్టికాహార లోపాలకు సంబంధించిన పరిస్థితిలో ఏ మాత్రం మార్పు చోటు చేసుకోలేదన్నమాట. నిజం చెప్పాలంటే ఆకలి బాధను తీర్చడానికి భారత్‌ తీసుకున్న చర్యలు గమనిస్తే నానాటికి దిగజారినట్టు తెలుస్తుంది.

పౌష్టికాహార పర్యవేక్షణ ఏది?
జాతీయ పౌష్టికాహార పర్యవేక్షక సంస్థ నిర్వహించిన సర్వే నివేదిక మరింత నివ్వెరపోయేటట్టు చేసేదే. ఈ సర్వే భయంకరమైన ఒక వాస్తవాన్ని వెలుగులోకి తెచ్చింది. అయితే దీన్ని కూడా దేశం పట్టించుకోలేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఆహార వినియోగం నాలుగు దశాబ్దాల క్రితం వినియోగం కంటే బాగా తగ్గిపోయింది. ‘స్క్రాల్‌’ అనే వెబ్‌ న్యూస్‌ పోర్టల్‌ ఇచ్చిన నివేదిక ఈ విషయం వెల్లడిస్తున్నది. 1975–79 మధ్యకాలంతో పోల్చి చూస్తే, ప్రస్తుతం గ్రామీణ భారత ప్రజలు 550 కేలరీలు తక్కువగా తీసుకుంటున్నారు. ప్రొటీన్లు 13 గ్రాములు, ఐరన్‌ 5 మిల్లీగ్రాములు, క్యాల్షియం 250 మిల్లీగ్రాములు, ‘ఏ’ విటమిన్‌ను 500 మిల్లీగ్రాముల కంటే తక్కువగాను గ్రామీణులు వినియోగిస్తున్నారు.

పిల్లలు రోజుకు 300 మిల్లీలీటర్ల పాలు తీసుకోవాలి. కానీ సగటున కేవలం 80 మిల్లీలీటర్లే వారు తీసుకోగలుగుతున్నారు. పూర్తి వివరాలు ఇవ్వకపోయినా, ఈ నివేదిక గ్రామీణ ప్రాంతాలకు చెందిన స్త్రీ పురుషులలో 35 శాతం ఎందుకు పౌష్టికాహార లోపంతో ఉన్నారో, ఎందుకు 42 శాతం చిన్నారులు ఉండవలసిన బరువు కంటే తక్కువ బరువుతో ఉన్నారో కూడా వివరించింది. నిజానికి సబ్‌ సహారా ఆఫ్రికాతో పోల్చి చూస్తే, దక్షిణాసియా జనాభా ఎదుర్కొంటున్న ఆహార లోపం రెండు రెట్లు ఎక్కువే. అసలు భారతదేశ జనాభాలో 70 శాతం గ్రామీణ ప్రాంతాలలోనే నివసిస్తున్నారు. అంటే 85 కోట్ల మంది అక్కడే జీవనం సాగిస్తున్నారు. కాబట్టి అర్ధరాత్రి కూడా పార్లమెంట్‌ సమావేశాలను ఏర్పాటు చేసి చర్చించడానికి ఇంతకు మించిన అంశం ఉండదని నా అభిప్రాయం.

ఆకలి రహిత దేశం– ఒక వాస్తవం
వచ్చే ఐదేళ్లలో సాధించడానికి ప్రధాని నరేంద్ర మోదీ నిర్దేశించుకున్న ఆరు లక్ష్యాలలో ఆకలి నిర్మూలన, పౌష్టికాహార లోప నివారణ కూడా ఉన్నాయి. 2022 కల్లా ఈ లక్ష్యాలను సాధించాలని ఆయన ప్రకటించారు. ఇది చాలా స్ఫూర్తిదాయకమైన పరిణామమే. అయితే ఒక విషయం ఇక్కడ స్పష్టం చేయాలి. పెరుగుతున్న ఆహార లోపం సమస్యను గత ప్రధానుల వలే పరిష్కరించకుండా విడిచిపెట్టడం ఇక సరికాదు. గతంలో చూస్తే ఇందిరాగాంధీ గరీబీ హటావో నినాదం ఇచ్చారు. ఒడిశాలో ఆకలికేకలకు ప్రసిద్ధమైన కలహండి ప్రాంతాన్ని ధాన్యాగారంగా మారుస్తానని అటల్‌ బిహారీ వాజ్‌పేయి హామీ ఇచ్చారు. పౌష్టికాహార లోపమంటే జాతి సిగ్గు పడవలసిన అంశమనే దాకా మన్మోహన్‌ సింగ్‌ వెళ్లారు. కానీ దేశంలో ఆకలి, పౌష్టికాహార లోపం ఇప్పటికీ యథాతథంగానే ఉన్నాయి.

తాను ఎన్నికైన తరువాత సెంట్రల్‌ హాల్‌లో తొలిసారిగా జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నరేంద్ర మోదీ ఇచ్చిన ఉద్వేగభరితమైన ఉపన్యాసం నాకు గుర్తుంది. తన ప్రభుత్వం పేదల కోసం అంకితమవుతుందని అన్నారాయన. జన్‌ధన్‌ యోజన వంటి కార్యక్రమాలు కొన్ని పేదల కోసం రూపొందించినవే. బ్యాంకింగ్‌ వ్యవస్థకు దూరంగా ఉండిపోయిన 58 శాతం ప్రజల కోసం ఆ పేరుతో ఖాతాలు తెరిచారు. అయితే నైపుణ్య భారతి వంటి పథకాలు ఇంకా ఫలితాలను చూపించవలసి ఉంది. ఇవన్నీ ఎలా ఉన్నా, గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు పట్టణ కేంద్రాలకు చేరుకునే ధోరణి ఆందోళన కలిస్తున్నది. కాగా ప్రస్తుతం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న 52 శాతం జనాభాను వచ్చే ఐదేళ్లలో 38 శాతానికి తగ్గించాలని జాతీయ నైపుణ్యాభివృద్ధి విధాన పత్రం లక్ష్యంగా నిర్దేశించింది.

ఇలా ఉండగా 1972లో రూపు దిద్దుకున్న జాతీయ పౌష్టికాహార పర్యవేక్షక సంస్థ 2015లో కాలగర్భంలో కలి సింది. ఇందుకు కారణాలు ఏమైనా కావచ్చు. కానీ, పౌష్టికాహార లోపం హెచ్చుతగ్గులను పర్యవేక్షించేందుకు ఒక విశ్వసనీయ వ్యవస్థ లేకపోతే, ఆ లోపాన్ని నిరోధించడానికి నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకున్నామో లేదో తెలుసుకోవడం ఎప్పటికీ సాధ్యం కాదు. ఆర్థికవృద్ధి రేటును ప్రతి ఆరుమాసాలకు గణించినట్టే, పదేళ్లకు ఒక్కసారి పౌష్టికాహార లోపం మీద సర్వే చేయిం చాలి. నిజానికి ఇది కూడా అంత ఆమోద యోగ్యం కాదు.

సేద్యమే దిక్కు
ఒకటి వాస్తవం– వ్యవసాయ రంగం మీద దృష్టి పెట్టకుండా పేదరికం, ఆకలికేకలను నిర్మూలించడం సాధ్యంకాదు. పట్టణ ప్రాంత మౌలిక సదుపాయాల కల్పన మీద కంటే, వ్యవసాయ రంగం మీద పెట్టుబడులు పెడితే పేదరిక నిర్మూలనలో ఐదు రెట్లు ఎక్కువ ఉపయోగం ఉంటుందని ఇటీవల అమెరికాలో జరిగిన ఒక అధ్యయనం వెల్లడించింది. నా అవగాహన మేరకు ఈ అంశం చాలా ప్రాముఖ్యం కలిగినది. భారత ఆర్థికవేత్తలు, విధాన రూపకర్తలు, ఉద్యోగులు సిద్ధాంత పరంగా మార్కెట్‌ సంస్కరణలకు నిబద్ధులైపోయారు. ఆ పనిలో పడి వారు వ్యవసాయం మీద పెట్టవలసిన పెట్టుబడులను ఒక పద్ధతి ప్రకారం తగ్గిస్తున్నారు. అయినప్పటికీ అమెరికా అధ్యయనం విస్మరించదగినది కాదనే చెప్పాలి.

నా అభిప్రాయం ఎప్పుడూ ఒక్కటే. సమస్యకు ఎవరు కారకులో, వారే పరిష్కారాన్ని చూపిస్తారని ఎదురు చూడడం సరి కాదు. ఇందుకు మంచి ఉదాహరణ భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐసీఏఆర్‌). ఇది దేశంలోని 71 వ్యవసాయ విశ్వవిద్యాలయాలను, దాదాపు రెండువందల పరిశోధక సంస్థలను నిర్లక్ష్యం చేస్తున్నది. దీనికి నీతి ఆయోగ్‌ విధానాలు కూడా తోడవుతున్నాయి. అది వ్యవసాయ సంక్షోభాన్ని పరాకాష్టకు తీసుకువెళ్లిన విఫల ఆర్థిక విధానాలనే మళ్లీ మళ్లీ తీసుకువస్తున్నది. సమస్యలను సృష్టించినప్పుడు మనం ఎలాంటి ఆలోచనతో ఉన్నామో, తరువాత కూడా అదే ఆలోచనతో కొనసాగితే సమస్యను పరిష్కరించడం సాధ్యం కాదని అల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ అంటాడు.

ఆర్థిక సర్వే కావచ్చు, వచ్చే మూడేళ్ల కోసం తయారు చేసిన నీతి ఆయోగ్‌ విధాన, వ్యూహపత్రం కావచ్చు, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న తలంపుతో ఏర్పాటైన నిపుణుల కమిటీ నివేదిక కావచ్చు– ఇవన్నీ ముందుకు తెచ్చే వ్యూహాలు ఒక్కటే. అవి సంక్షోభాన్ని మరింత ముదరబెట్టేవే. ఇవన్నీ చేసే సూత్రీకరణలు కూడా పాతవే– దిగుబడిలో పెంపుదల, నీటిపారుదల సౌకర్యాల విస్తరణ, పంటల బీమా, ఎలక్ట్రానిక్‌ జాతీయ వ్యవసాయ మార్కెట్‌ వేదికను పటిష్టం చేయడం.

పంజాబ్‌ నుంచి గుణపాఠం నేర్వాలా?
ఇవే నిజమైతే భారతదేశానికి అన్నం గిన్నె వంటి పంజాబ్‌ రాష్ట్రం రైతుల బలవన్మరణాలకు ఎందుకు కేంద్రమైందో నాకు అర్థం కాదు. అక్కడి రైతులు రోజుకు ఇద్దరు లేదా ముగ్గురు బలవన్మరణానికి పాల్పడని రోజంటూ లేదంటే అతిశయోక్తి కాదు. పంజాబ్‌లో 98 శాతం భూభాగానికి నిశ్చయంగా నీటిపారుదల సౌకర్యం ఉంది. గోధుమ, వరి, మొక్కజొన్నలతో పాటు తృణధాన్యాల ఉత్పత్తిలో కూడా ప్రపంచంలోనే అగ్రభాగాన ఉన్న రాష్ట్రం పంజాబ్‌. ట్రాక్టర్లు, వ్యవసాయంలో ఉపయోగించే ఆధునిక యంత్రాలు, ఆఖరికి ఎరువులు పురుగు మందుల వాడకం కూడా అక్కడ చాలా ఎక్కువ. ఇన్ని ఉన్నా కూడా అక్కడ రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.

సంపద విషయంలో ఇంత ఘనత ఉన్న పంజాబ్‌లో ఈ మధ్య పౌష్టికాహార లోపాన్ని నిరోధించడానికి, ఆకలిబాధను తీర్చడానికి యువత కోసం కొన్ని కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ప్రవేశపెడుతున్నారు. కాబట్టి వ్యవసాయ సంక్షోభాన్ని అధిగమించడానికి పంజాబ్‌ను మిగతా రాష్ట్రాలు అనుసరించాలని అనుకోవడం సరి కాదు. పౌష్టికాహార లోపం, పేదరికం, ఆకలి బాధల నుంచి విముక్తం చేయడంలో ప్రజానీకానికి రక్షణ కవచంగా నిలబడడంలో వ్యవసాయానిదే అగ్రస్థానం. రైతుల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తూ, వ్యవసాయ దిగుబడుల మీద దృష్టి పెట్టడం ఆ రంగానికి ఒక శాపం వంటిది. ప్రధాని మోదీ కల నిజం కావాలంటే, ఆ లక్ష్యాలను చేరుకోవాలంటే పాత తప్పిదాల నుంచి గుణపాఠం నేర్చుకుని కొత్త విధానానికి మళ్లడం అవసరం. దీనికి ఇదే సరైన సమయం. అందువల్ల కచ్చితంగా ఫలితాలను సాధించవచ్చు. కానీ మళ్లీ సంక్షోభానికి కారణమైన ఆ పాత తప్పుడు విధానాలనే అనుసరిస్తామంటే మాత్రం అది ఎంతమాత్రం సాధ్యం కాదు.

వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు
దేవిందర్‌శర్మ
ఈ–మెయిల్‌ : hunger55@gmail.com

Read latest Vedika News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా