ఏపీలో రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు

17 Mar, 2024 10:33 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఏపీలో రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. 30వ తేదీ వరకు టెన్త్‌ పరీక్షలు కొనసాగనున్నాయి. ఏడు సబ్జెక్ట్‌లకు టెన్త్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి 12.45 వరకు పరీక్షలు జరపనున్నారు.

రేపు ఫస్డ్ లాంగ్వేజ్ పేపర్-1, 19న సెకండ్ లాంగ్వేజ్‌, 20న ఇంగ్లీష్, 22న లెక్కలు, 23న ఫిజికల్ సైన్స్, 26 న బయాలజీ, 27న సోషల్ స్టడీస్.. 28,30 తేదీలో వొకేషనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. లీకేజీ ఆరోపణలు రాకుండా విద్యా శాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఇన్విజలేటర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు, ఇతర అధికారులు సైతం పరీక్షా కేంద్రాలకు సెల్ ఫోన్లు తీసుకురాకుండా నిషేధించారు. సమస్యాత్మకమైన 130 పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. టెన్త్ పరీక్షలకు 7, 25,620 మంది విద్యార్ధులు హాజరుకానున్నారు.

ఇందులో రెగ్యులర్ విద్యార్ధులు 6,23,092.. గత ఏడాది ఫెయిలై రీ ఎన్‌రోల్ అయిన విద్యార్ధులు 1,02,528. రాష్ట్ర వ్యాప్తంగా 3473 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 8.45 గంటల నుంచి పరీక్షా కేంద్రాల లోపలికి విద్యార్ధులకు అనుమతి ఉంటుంది. టెక్నాలజీ సాయంతో లీకేజ్‌కి చెక్ పెట్టేవిధంగా.. ప్రతీ ప్రశ్నా పత్రానికి ప్రత్యేకంగా యూనిక్ కోడ్ నంబర్ కేటాయించారు. యూనిక్ కోడ్ ద్వారా ఏ సెంటర్ నుంచి ఎవరు పేపర్ లీక్ చేశారో తెలుసుకునే అవకాశం ఉంటుంది. హాల్ టిక్కెట్లు చూపితే పదవ తరగతి విద్యార్ధులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేసే సౌకర్యం కల్పించారు.

రాష్ట్ర స్ధాయిలో 0866-2974540 నంబర్‌తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రతీ జిల్లాలో కలెక్టర్లు, డిఇఓల పర్యవేక్షణలో జిల్లా స్ధాయి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. పదో తరగతి పరీక్షల పర్యవేక్షణకు ప్రతీ జిల్లాకి ఒక పరిశీలకుడిని నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా 156 ఫ్లైయింగ్ స్క్వాడ్ లు, 682 సిట్టింగ్ స్క్వాడ్‌లు ఏర్పాటు చేశారు.

పదవ తరగతి పరీక్షల నిర్వహణకి 3473 చీఫ్ సూపరింటెండెంట్లు, 3473 మంది డిపార్ట్‌మెంటల్ అధికారులు, 35119 మంది ఇన్విజలేటర్లను నియమించారు. వేసవి తీవ్రత నేపథ్యంలో పతీక్షా కేంద్రాల వద్ద తాగు నీరు, టెంట్లు ఏర్పాట్లు చేశారు. 31 నుంచి టెన్త్ స్పాట్ వాల్యూయేషన్ జరపనున్నారు.

Election 2024

మరిన్ని వార్తలు