కరోనా బాధితుల కోసం 216 అంబులెన్సులు

26 Jul, 2020 02:57 IST|Sakshi

మిగతా 515 వాహనాలు అత్యవసర సేవల్లోనే..

త్వరలోనే మరో 100 వాహనాలు కోవిడ్‌ సేవల్లోకి..

పాత 104 వాహనాలకు మరమ్మతులు చేయించి 

వినియోగంలోకి.. నిరంతరాయ సేవల్లో 731 వాహనాలు

75 వేల మందికి పైగా కరోనా బాధితులకు 108 సేవలు

సాక్షి, అమరావతి: కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో బాధితులకు 108 అంబులెన్సులే పెద్ద దిక్కు అయ్యాయి. ఓ వైపు ఎమర్జెన్సీ సేవలను కొనసాగిస్తూనే.. మరోవైపు కోవిడ్‌ బాధితుల కోసం పనిచేస్తున్నాయి. రమారమి 216 అంబులెన్సులు రాష్ట్రంలో కోవిడ్‌ సేవలకు వినియోగిస్తున్నారు. కోవిడ్‌ లక్షణాలున్న వారిని, పాజిటివ్‌ నిర్ధారణ అయిన వారిని ఆస్పత్రులకు చేర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. మొత్తం 731 వాహనాలుండగా.. 216 అంబులెన్సులు ప్రత్యేకించి కోవిడ్‌ సేవలకు వినియోగిస్తున్నారు. అవసరాన్ని బట్టి ఎప్పటికప్పుడు కలెక్టర్లు ఆ జిల్లాలో ఉన్న అంబున్సులను కోవిడ్‌ సేవలకు సర్దుబాటు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది మార్చి 4వ తేదీ నుంచి ఇప్పటివరకూ 75 వేల మందికి పైగా కరోనా బాధితులను ఆస్పత్రులకు, క్వారంటైన్‌ కేంద్రాలకు 108 అంబులెన్సుల ద్వారానే చేర్చారు. అవసరమైతే మరికొన్ని అంబులెన్సులను కోవిడ్‌కు వాడుకుంటామని అధికార వర్గాలు చెబుతున్నాయి.

ఈ అంబులెన్సులు కోవిడ్‌కే..
– ప్రస్తుతం పనిచేస్తున్న 216 అంబులెన్సులు కేవలం కోవిడ్‌ సేవలకు మాత్రమే పనిచేస్తాయి.
– పాజిటివ్‌ రోగులను నుంచి ఇతరులకు సోకే అవకాశం ఉంది కాబట్టి ఈ వాహనాలు ఈ సేవలకే పరిమితం చేశారు.
– మిగతా 515 వాహనాలను ఎమర్జెన్సీ సేవలకు వినియోగిస్తున్నారు. పాజిటివ్‌ కేసులు ముందే నిర్ణయించినవి కాబట్టి చిరునామాను బట్టి అంబులెన్సులు వెళతాయి
– మిగతా సేవలకు మాత్రమే 108కు కాల్‌ చేస్తే వస్తాయి. త్వరలోనే మరో 100 పాత 104 వాహనాలను కోవిడ్‌ కోసమే అందుబాటులోకి తేనున్నారు
– కోవిడ్‌తో మృతిచెందిన వారి కోసం మహాప్రస్థానం వాహనాలను వినియోగిస్తున్నారు.

ప్రైవేటు అంబులెన్సులను నియంత్రించేందుకే..
కరోనా సమయంలో ప్రైవేటు అంబులెన్సు యజమానులు ఇష్టారాజ్యంగా చార్జీలు వసూలు చేస్తున్నారు. అందువల్లే 200కు పైగా అంబులెన్సులను కోవిడ్‌ సేవలకే వినియోగిస్తున్నాం.
– రాజశేఖర్‌రెడ్డి, అదనపు సీఈఓ, ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌

ఏ ఒక్క బాధితుడూ ఇబ్బంది పడకుండా..
ఏ ఒక్క బాధితుడూ 108 రాలేదనే ఇబ్బంది పడకుండా పకడ్బందీగా నిర్వహణ చేస్తున్నాం. ప్రతి కాల్‌నూ స్వీకరించి సకాలంలో వాహనం వెళ్లేలా చూస్తున్నాం. మొత్తం 731 వాహనాలు రన్నింగ్‌లో ఉన్నాయి.
– స్వరూప్, చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్, 108 నిర్వహణా సంస్థ

అవసరాన్ని బట్టి వాహనాలు 
కోవిడ్‌తో మృతి చెందినా లేదా కోవిడ్‌ లక్షణాలతో మృతి చెందినా అలాంటి మృతదేహాలను తీసుకెళ్లడానికి మహాప్రస్థానం వాహనాలను పంపిస్తున్నాం. ప్రస్తుతం 53 వాహనాలు పనిచేస్తున్నాయి.
–డాక్టర్‌ శశికాంత్, సీఈఓ, మహాప్రస్థానం 

మరిన్ని వార్తలు