రియల్‌ హీరోస్‌.. 

3 Aug, 2020 09:52 IST|Sakshi
రక్తదానం చేసిన కోవిడ్‌ విజేతలను అభినందిస్తున్న ఎస్పీ బి.సత్యయేసు బాబు (ఫైల్‌)

సేవచేయాలనే సంకల్పం ఉన్నవారికి హద్దులు అంటూ ఏవీ ఉండవు.ఎక్కడినుంచైనా ఎక్కడికైనా వారు ఆపన్న హస్తాన్ని అందిస్తారు. సమాజసేవ కోసం మేము సైతం అనే వారు ఎందరో ఉన్నారు. కరోనా బారిన పడి కోలుకున్న ఎందరో.. మాకెందుకులే అనే భావనను వీడి కరోనా బారిన పడిన వారి కోసం తమ రక్తాన్ని దానం చేస్తున్నారు. ఇందులో మొదటి వరుసలో నిలుస్తున్నారు పోలీసులు. కోవిడ్‌ వైరస్‌ వ్యాప్తి చెందకుండా జిల్లా పోలీసులు ప్రముఖ పాత్ర పోషించారు. లాక్‌డౌన్‌లో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రేయింబవుళ్లు రెడ్‌జోన్‌ ప్రాంతాల్లో పని చేశారు. ఈ క్రమంలో 300 మందికిపైకి కోవిడ్‌ బారిన పడ్డారు. అందులో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కోవిడ్‌ బారి నుంచి కోలుకున్న అనంతరం ఎస్పీ సత్యయేసుబాబు స్ఫూర్తిదాయక మాటలతో ప్రభావితమైన 17 మంది సిబ్బంది ప్లాస్మా దానం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణే కాదు.. ప్రజల ప్రాణాలను కాపాడడం కూడా తమ కర్తవ్యంగా భావించిన పోలీసు సిబ్బంది సేవలపై ప్రత్యేక కథనం.  

అనంతపురం క్రైం: ప్లాస్మా అనేది ఇది మానవ రక్తంలోని ఒక అత్యంత అవసరమైన పదార్థం. రక్తంలో దాదాపు 55 శాతం దాకా ఇది ఉంటుంది. నీరు, లవణాలు, ఎంజైములు, రోగనిరోధక కణాలు, ఇతర ప్రోటీన్లను కలిగి ఉంటుంది. 92% నీటితో కూడి ఉంటుంది, ఇది మానవ శరీరానికి అవసరమైన కణాలు, వివిధ కీలక పదార్థాలను సరఫరా చేసే ఒక కండెక్టర్‌ లాంటిది. శరీరంలో రక్తాన్ని గడ్డకట్టించడం సహా వ్యాధులను సమర్థవంతంగా ఎదుర్కొనే గుణం ప్లాస్మాకుంది. శరీరంలోని వివిధ ఇతర క్లిష్టమైన విధులను ఇది నిర్వర్తిస్తూ ఉంటుంది.  

ప్లాస్మా థెరఫీతో మెరుగైన ఫలితాలు 
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి వ్యాక్సిన్‌ కనుగొనడం ఆలస్యమవుతున్న ప్రస్తుత తరుణంలో ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ప్లాస్మా థెరఫీ వైపు వైద్య నిపుణులు దృష్టి సారించారు.    కరోనా వచ్చి కోలుకున్న వ్యక్తుల రక్తం నుంచి సేకరించిన ప్లాస్మాను కరోనా తీవ్రంగా ఉన్న రోగులకు ఇవ్వడం వల్ల వారి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడడమే ఇందుకు కారణం. అపోహల కారణంగా రక్తదానం చేసేందుకు ముందుకు రాని ఈ పరిస్థితుల్లో రక్తం నుంచి వేరు చేసిన ప్లాస్మా దొరకడం కష్టంగా మారింది. ఇలాంటి తరుణంలో ఎస్పీ సత్యయేసుబాబు సూచనలతో పోలీస్‌ సిబ్బంది తమ రక్తాన్ని దానం చేసేందుకు ఉత్సాహంగా ముందుకు వచ్చారు. వీరంతా కరోనా బారిన పడి కోలుకున్నవారే కావడం గమనార్హం. రక్తదానం చేసిన వారిలో ఆర్‌ఎస్‌ఐ, ఇద్దరు ఏఎస్‌ఐలు, 11 మంది కానిస్టేబుళ్లు, ఇద్దరు హోంగార్డులు, ఒక అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగి ఉన్నారు. 

ఈ అవకాశం అందరికీ రాదు  
ఇప్పటి వరకు జిల్లాలో 300 మంది పోలీసులు కోవిడ్‌ బారిన పడ్డారు. ఇందులో ముగ్గురు చనిపోయారు. కానీ ఎవరూ ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. కోవిడ్‌ నుంచి కోలుకున్న వారు రెట్టింపు ఆత్మవిశ్వాసంతో విధుల్లోకి చేరారు. అంతేకాకుండా కోవిడ్‌ రోగుల ప్రాణాలు కాపాడేందుకు అవసరమైన ప్లాస్మా కోసం తమ రక్తాన్ని దానం చేశారు. ముఖ్యంగా 50 ఏళ్లు పైబడిన వారు కూడా ఉత్సాహంగా ముందుకు వచ్చారు. ప్లాస్మా దానం చేసిన వారందరికీ నా తరపున, డీజీపీ సార్‌ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇప్పటి వరకూ కోవిడ్‌ బారి నుంచి బయటపడిన వారందరూ వీరిని స్ఫూర్తిగా తీసుకోవాలి. ప్లాస్మా డొనేట్‌ చేసే అవకాశం అందరికీ రాదు. అటువంటి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి.  ప్లాస్మా ఇవ్వడం ద్వారా ఎటువంటి నష్టమూ ఉండదు.                    – బి.సత్యయేసుబాబు, ఎస్పీ 

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు