కోవిడ్‌ నియంత్రణలో ఏపీ, తమిళనాడు భేష్‌

5 Oct, 2020 03:14 IST|Sakshi

కరోనా బాధితులను గుర్తించడంలో రెండు రాష్ట్రాల వ్యూహం అద్భుతం

70 శాతం పాజిటివ్‌ వ్యక్తుల నుంచి ఇతరులకు సోకలేదు

కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం పరిశోధనలో వెల్లడి

సాక్షి, అమరావతి: కోవిడ్‌ నియంత్రణలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు కనబర్చిన ప్రతిభ భారతదేశంలో చెప్పుకోదగ్గదని.. ఈ రాష్ట్రాలు ప్రతిస్పందించిన తీరు ఆమోఘమని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధకులు వెల్లడించారు. రెండు రాష్ట్రాల్లో 10 వేల మంది కాంటాక్టు వ్యక్తుల వివరాలు సేకరించి పరిశోధన జరిపారు. ఇప్పటివరకూ జరిపిన అతిపెద్ద పరిశోధన, సర్వే ఇదేనని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. దీనిపై సమగ్ర విశ్లేషణ జరపగా.. భారతదేశం లాంటి 130 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో ఏపీ, తమిళనాడు రాష్ట్రాలు అద్భుతంగా పనిచేశాయని, నియంత్రణలో తమదైన శైలిలో పోరాటం చేశాయని పేర్కొన్నారు.

పరిశోధకులు ఏం తేల్చారంటే..: వైరస్‌ సంక్రమణ, వ్యాప్తిని ప్రజలకు తెలియజేయడంలో ఏపీ, తమిళనాడు బ్రహ్మాండంగా పనిచేశాయి. ప్రాథమిక సంరక్షణ, వైద్య బాధ్యతలు నిర్వర్తించడంలో అద్భుతంగా పనిచేశాయి. లక్షణాలున్న వారిని గుర్తించడానికి రోజువారీ 5 కిలోమీటర్ల దూరం ఇంటింటికీ వెళ్లి నమూనాలు సేకరించి మరీ వారికి వైద్యం అందించారు. లక్షలాది మంది పాజిటివ్‌ బాధితులను ముందస్తుగా గుర్తించి వ్యాధి సంక్రమణ ఎక్కువ కాకుండా చూడటంలో సఫలమయ్యారు. ప్రాథమిక కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులకు 5 నుంచి 14 రోజుల తర్వాత కూడా లక్షణాలను గుర్తించి.. వారికి వైద్య పరీక్షలు చేసి సంరక్షించారు.

వైరస్‌ సంక్రమణ ఇలా
వైరస్‌ ఒకరి నుంచి ఒకరికి సోకడంలో ఎక్కువగా ఒకే వయసు వారు ఉన్నట్టు వెల్లడైంది. చిన్నారుల్లో కూడా అదే వయసు వారికి ఎక్కువగా వ్యాప్తి అయింది. కేసుల సారూప్యత, వయసుల వారీగా తేడాలు, సంక్రమణ ఎక్కువగా ఉన్న ప్రాంతాలు వంటి వాటిని తక్కువ సమయంలో గుర్తించగలిగారు. 70 శాతం మంది పాజిటివ్‌ వ్యక్తుల నుంచి ఇతరులకు ఎలాంటి సంక్రమణ కాలేదు. 8 శాతం మంది పాజిటివ్‌ వ్యక్తులు 60 శాతం కొత్త అంటువ్యాధుల్ని కలిగి ఉన్నారు.

మృతుల్లో పురుషులే ఎక్కువ
రెండు రాష్ట్రాల్లో మృతుల్లో మహిళల కంటే పురుషులు 62 శాతం ఎక్కువగా ఉన్నారు. మరణించిన వారిలో 63 శాతం మందికి ఏదో ఒక అనారోగ్యం ఉందని తేలింది. మొత్తం మృతుల్లో 45 శాతం మంది మధుమేహ వ్యాధిగ్రస్తులున్నారు. 36 శాతం మందిలో రెండు లేదా అంతకు మించిన జబ్బులున్నాయి. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో వైరస్‌ సోకి మృతి చెందిన వారి కంటే జూలైలో మృతి చెందిన వారు 26 శాతం తక్కువ. మృతుల్లో 85 సంవత్సరాల వయసు వారు 16.6 శాతం ఉన్నారు. భారత్‌లో లాక్‌డౌన్‌ వల్ల ఒకరి నుంచి మరొకరికి సంక్రమణ వేగం బాగా తగ్గింది

టెస్టింగ్‌.. ట్రేసింగ్‌ వ్యూహంతోనే..
మన రాష్ట్రంలో టెస్టింగ్, ట్రేసింగ్‌ వ్యూహాన్ని అనుసరించాం. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎక్కువ టెస్టులు చేయండని మొదటి నుంచీ చెబుతూ వచ్చారు. అవే ఆదేశాలు పాటిస్తున్నాం. ఇప్పటికీ 70 వేలకు తగ్గకుండా పరీక్షలు చేస్తున్నాం. కేసులు ఎక్కువ నమోదు కావచ్చు గానీ.. మరణాల్ని నియంత్రించగలిగాం. రోజువారీ మరణాల సంఖ్యను 90 నుంచి 40కి తగ్గించగలిగాం.  ఏపీ వ్యూహాలే ఇప్పుడు చాలా రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి. మనకున్న వైద్యులు, వైద్య సిబ్బంది బాగా పని చేశారు. ఆస్పత్రుల్లో మౌలిక వసతులు పెంచుకోవడం మంచి ఫలితాలిచ్చింది.
– డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ, వైద్య, ఆరోగ్య శాఖ  

మరిన్ని వార్తలు