ఉద్దానంలో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టండి

2 Feb, 2022 04:34 IST|Sakshi

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశం

బెడ్లు, డయాలసిస్‌ యూనిట్లు ఏర్పాటు చేయండి

కిడ్నీ బాధితులకు తగిన వైద్య సాయం చేయండి

చెరువులు కలుషితం కాకుండా చర్యలు చేపట్టండి  

సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ జబ్బుల బారిన పడుతున్న ప్రజలను ఆదుకునే విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఉద్దానం ప్రాంతంలో ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలను తీర్చేలా సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి  నిర్మించి, తగినన్ని బెడ్లు, డయాలసిస్‌ యూనిట్లు ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. కిడ్నీ జబ్బు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉచితంగా మందులు ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం తీర్పు వెలువరించింది. కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న ఉద్దానం ప్రజలకు ఉచితంగా వైద్య సాయం, మందులు అందించాలని, ఆ ప్రాంతంలో 500 పడకల ఆసుపత్రిని నిర్మించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ హైకోర్టు న్యాయవాది కరుకోల సింహాచలం, ఓ రిటైర్డ్‌ ఉపాధ్యాయులు వేర్వేరుగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు.

ఈ వ్యాజ్యాలపై సీజే ధర్మాసనం విచారణ జరిపి తీర్పునిచ్చింది. ‘ఉద్దానం ప్రాంతంలో జీడిపçప్పు పరిశ్రమలు, ఇటుక బట్టీల నుంచి కలుషిత పదార్థాలు, వ్యర్థాలు చెరువుల్లోకి వదలకుండా ప్రభుత్వం, స్థానిక సంస్థలు వాటి అధికారాలను ఉపయోగించాలి. ఉద్దానం ప్రాంతంలో ఆసుపత్రుల స్థాయిని పెంచాలి. తగిన సంఖ్యలో అంబులెన్స్‌లు ఏర్పాటు చేయాలి. బాధితుడి ఆరోగ్యం సాధారణ స్థితికి వచ్చేంత వరకు చికిత్స అందించేందుకు ఆరోగ్య కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలి. బాధితుల ఆర్థిక  పరిస్థితితో సంబంధం లేకుండా ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లో వైద్యం అందించాలి.

అత్యవసర కేసుల్లో వైద్య సాయాన్ని నిరాకరించడానికి వీల్లేదు. బాధితులు ఆసుపత్రుల్లో చేరే విషయంలో వైద్యాధికారులు రెండు వారాలకొకసారి సమీక్ష సమావేశాలు పెట్టి, తగిన మార్గదర్శకాలు జారీ చేయాలి. కిడ్నీ బాధిత కుటుంబాల్లోని పిల్లలు ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో ఎలాంటి వివక్షను ఎదుర్కోకుండా చర్యలు తీసుకోవాలి. తద్వారా వారి చదువులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలి. ఉద్దానం, ఇతర గ్రామాల్లో ఆహారం కలుషితం కాకుండా తనిఖీలు చేసేందుకు ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లను నియమించాలి’ అని ధర్మాసనం ఆదేశించింది.

పర్యవేక్షణకు భాగస్వామిగా న్యాయ సేవాధికార సంస్థ
రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే చర్యలను పర్యవేక్షించేందుకు న్యాయ సేవాధికార సంస్థను భాగస్వామిని చేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. సలహా కమిటీ, అవగాహన కమిటీ, పర్యవేక్షణ కమిటీ, న్యాయ సాయం కమిటీలను ఏర్పాటు చేసింది. ఇందులో పలువురికి స్థానం కల్పించింది. ఈ కమిటీలన్నీ నెల, రెండు నెలలకొకసారి సమావేశం కావాలని ఆదేశించింది. కిడ్నీ వ్యాధి నిర్మూలనకు తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థకు సమర్పించాలని ఆ కమిటీలను హైకోర్టు ఆదేశించింది. తగిన చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం నుంచి నిధులు తీసుకోవాలని న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శిని ఆదేశించింది. 

మరిన్ని వార్తలు