వలంటీర్లపై మరో పిటిషన్‌

2 Mar, 2024 02:22 IST|Sakshi

వారు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకుండా నిరోధించాలంటూ హైకోర్టులో పిల్‌

గతంలోనే ఈ విషయంలో టీడీపీ యత్నాలను అడ్డుకున్న హైకోర్టు

2021లో మరోసారి వలంటీర్లపై టీడీపీ నేతల పిటిషన్లు 

వలంటీర్లను ఎన్నికలకు దూరంగా ఉంచాలన్న అప్పటి ఎస్‌ఈసీ ఉత్తర్వులు

కానీ, వాటిపై స్టే విధించిన న్యాయస్థానం

వారు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు ఆధారాల్లేవన్న హైకోర్టు

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో గ్రామ, వార్డు వలంటీర్‌ వ్యవస్థను తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2019లో జారీచేసిన జీఓ–104తో పాటు తదనుగుణంగా జారీచేసిన ఉత్తర్వులను చట్ట విరుద్ధంగా, ఏకపక్షంగా, రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ హైకోర్టులో మరో పిటిషన్‌ దాఖలైంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 2.57 లక్షల మంది కార్య­కర్తలను గ్రామ, వార్డు వలంటీర్లుగా నియమించారని, దీనిని చట్ట, రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ వైఎస్సార్‌ కడప జిల్లా, రాజంపేటకు చెందిన షేక్‌ అబూబాకర్‌ సిద్ధిఖీ  ప్రజాప్ర­యోజన వ్యాజ్యాన్ని (పిల్‌) దాఖలు చేశారు.

2019 నుంచి ఇప్పటివరకు ఖజానా నుంచి వలంటీర్లపై ఖర్చుచేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించేలా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, సీఎం జగన్‌ని ఆదేశించాలని సిద్ధిఖీ తన వ్యాజ్యంలో కోర్టును కోరారు. అలాగే,  రానున్న ఎన్నికల్లో పోలింగ్‌ బూత్‌ ఏజెంట్లుగా వ్యవహరించకుండా, ఓటర్ల స్లిప్పులను పంపిణీ చేయకుండా వలంటీర్లను నిలువరించాలని కూడా కోర్టును అభ్య­ర్థించారు. అలాగే, ఎన్ని­కలు ముగిసేవరకు వలంటీర్ల ద్వారా ప్రభుత్వ పథ­కాల పంపిణీ జరగకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని సిద్ధిఖీ తన వ్యాజ్యంలో కోర్టును అభ్యర్థించారు.

ఈ వ్యాజ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి, పంచాయతీరాజ్, గ్రామీణా­భివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, పురపాలక, పట్టణా­భివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, గ్రామ, వార్డు వాలంటీర్ల శాఖ ముఖ్య కార్య­దర్శి, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమి­షనర్, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, సీఎం వైఎస్‌ జగన్, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, 9 మంది వాలంటీర్లను ఇందులో ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ పిల్‌పై సీజే నేతృత్వంలోని ధర్మాసనం వచ్చే వారం విచారణ జరిపే అవకాశాలున్నాయి.

గతంలోనే హైకోర్టు నిరాకరణ..
వాస్తవానికి.. గ్రామ వలంటీర్ల నియామకాన్ని అడ్డుకునేందుకు తెలుగుదేశం పార్టీ 2019లోనే ప్ర­య­త్నించింది. అయితే, హైకోర్టు ఆ ప్రయత్నాలను అప్పుడే అడ్డుకుని నియామకాలను నిలుపుదల చేసేందుకు నిరాకరించి అందుకు సంబంధించిన అనుబంధ పిటిషన్‌ను కొట్టేసింది.

వారి నియా­మకాన్ని అడ్డుకునేందుకు ఎలాంటి కారణం కనిపించడంలేదని స్పష్టంచేసింది. రాజస్థాన్‌ ప్రభుత్వం అమలుచేసిన గ్రామ సహాయక్‌ విధానాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు సమర్థించిన విషయాన్ని కూడా హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. సంక్షేమ పథకాలను ప్రజల ముంగిటకు చేర్చాలన్న ఉద్దేశంతోనే వలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చామన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనతో హైకోర్టు ప్రాథమికంగా ఏకీభవించింది.

ఎస్‌ఈసీ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే..
ఇక వలంటీర్లను అడ్డుకునేందుకు 2021లో కూడా టీడీపీ ప్రయత్నించింది. అందుకు అప్పటి ఎన్నికల కమిషనర్‌ సైతం సహకరించారు. అయితే, టీడీపీ నేతలు, ఎన్నికల కమిషన్‌ దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు తోసిపుచ్చింది. అప్పుడు వివాదాస్పద అధికారిగా పేరుపడ్డ నాటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌ మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా వలంటీర్లను ఎన్నికలకు దూరంగా ఉంచాలంటూ కలెక్టర్లకు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు తప్పుబట్టి నిలిపివేసింది. వారు అధికార దుర్వినియోగానికి పాల్పడి ఓటర్లను ప్రభావితం చేస్తున్నారనేందుకు ఎలాంటి ఆధారాల్లేవని హైకోర్టు స్పష్టంగా చెప్పింది.

ప్రజాశ్రేయస్సు కోసం పనిచేస్తున్న వలంటీర్లను వారి విధుల నిర్వహణకు అనుమతించాలన్నది కోర్టు అభిప్రాయమని తేల్చి­చెప్పింది. వలంటీర్ల కార్యకలాపాలను నిలువ­రించాల్సిన అవసరంలేదంది. తమ ఫోన్లలో ఉన్న లబ్ధిదారుల డేటాను వలంటీర్లు దుర్విని­యోగం చేస్తారన్న ఎన్నికల కమిషన్‌ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. డేటాను దుర్వినియోగం చేయాల­నుకుంటే అందుకు ఫోన్లే అవసరంలేదని, ఫోన్లు లేకపోయినా కూడా దుర్వినియోగం చేస్తా­రని, ఈ విష­యంలో ఎన్నికల కమిషన్‌ది అనవసర ఆందోళ­న మాత్రమేనని కొట్టిపారేసింది.

ఎస్‌ఈసీ ఉత్తర్వులపై ధర్మాసనం ఆందోళన..
ఇక హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఈ తీర్పును సవాలు చేస్తూ ఎన్నికల కమిషన్‌ ధర్మాసనం ముందు అప్పీల్‌ దాఖలు చేసింది. ఈ అప్పీల్‌పై విచారణ జరిపిన ధర్మాసనం, సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను కొద్దిగా సవరించింది. వలంటీర్లు ఎన్నికల సంద­ర్భంగా ఉన్నతాధికారుల వద్ద ఫోన్లను ఉంచాలని, అవసరమైనప్పుడు వాటిని వాడుకోవచ్చునని తెలి­పింది. అయితే, ఫోన్లు వాడకుండా వలంటీర్లపై నిషేధం విధించేందుకు ధర్మాసనం నిరాకరించింది. అలా చేయడం వలంటీర్ల విధులను అడ్డుకోవడ­మేనని తేల్చిచెప్పింది.

ఈ సందర్భంగా ధర్మాసనం పలు మౌఖిక వ్యాఖ్యలు కూడా చేసింది. వలంటీర్లు తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే నేరుగా తామే చర్యలు తీసుకుంటామని అప్పటి ఎన్నికల సంఘం చెప్పడంపై ధర్మాసనం ఆందోళన కూడా వ్యక్తం చేసింది. ఇది తమను అత్యంత ఆందోళనకు గురిచేస్తోందని.. అ­లా నేరుగా చర్యలు తీసుకునే అధికారం, పరిధి ఎన్నికల కమిషన్‌కు లేవని స్పష్టంచేసింది. అవసరా­నికి మించి వలంటీర్లపై ఆంక్షలు విధిస్తున్నారని అభిప్రాయపడింది. సింగిల్‌ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యా­నికి నిరాకరించింది. 

whatsapp channel

మరిన్ని వార్తలు