మరో 4 లక్షల రెమ్‌డెసివిర్‌కు ఆర్డర్‌

21 Apr, 2021 04:02 IST|Sakshi

ఇప్పటికే 3.13 లక్షల ఇంజక్షన్ల కొనుగోలు 

రూ.80 కోట్లకు పైగా వ్యయం చేసిన సర్కార్‌ 

రోజుకు 4 వేల నుంచి 5 వేల ఇంజక్షన్లు వినియోగం 

కొత్తగా ఆర్డర్‌ ఇచ్చిన వాటికి రూ.62 కోట్ల వ్యయం 

తాజా రేట్ల ప్రకారం.. ఒక్కో ఇంజక్షన్‌ ధర రూ.1,568

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్ల వినియోగం భారీగా పెరిగింది. కోవిడ్‌ వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వీటిని రోజుకు 4 వేల నుంచి 5 వేల మందికి వాడుతున్నారు. ఈ నేపథ్యంలో మరో 4 లక్షల రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లను ప్రభుత్వం ఆర్డర్‌ చేసింది. పేద ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎక్కువ సంఖ్యలో వీటిని కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే 3.13 లక్షల ఇంజక్షన్ల కొనుగోలుకు సుమారు రూ.80 కోట్లు వ్యయం చేసింది. కొత్తగా ఆర్డర్‌ ఇచ్చినవాటికి రూ.62 కోట్లు వ్యయం కానుంది. కోవిడ్‌ నియంత్రణలో అత్యధికంగా రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లకే వ్యయమవుతున్నట్టు అధికారులు చెబుతున్నారు.  

ప్రతి ఇంజక్షన్‌కూ లెక్క చెప్పాల్సిందే.. 
రెమ్‌డెసివిర్‌కు భారీగా డిమాండ్‌ ఉండటంతో ప్రతి ఇంజక్షన్‌నూ అత్యంత జాగ్రత్తగా వాడుతున్నారు. ప్రభుత్వాస్పత్రులకు ఇచ్చిన ప్రతి ఇంజక్షన్‌కూ లెక్కచెప్పాలని ఆదేశాలిచ్చారు. ఖాళీ అయిన రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ బాటిల్, ఈ ఇంజక్షన్‌ ఏ పెషెంట్‌కు ఇచ్చారో వారి వివరాలు, ఇవన్నీ ఆయా జిల్లాల పరిధిలో సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌కు ఇవ్వాల్సి ఉంటుంది. ఖాళీ అయిన ఇంజక్షన్లకు లెక్క చెబితేనే కొత్తగా ఇచ్చే ఏర్పాట్లు చేశారు. దీనిపై నిత్యం ఏపీఎంఎస్‌ఐడీసీ (రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ) పర్యవేక్షణ చేస్తోంది. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు