కోవిడ్‌పై ఆందోళనలు వద్దు

1 Aug, 2020 04:01 IST|Sakshi

అత్యధిక కేసులు ఇళ్లలోనే నయమవుతున్నాయి 

ఆస్పత్రుల్లో వైద్య సదుపాయాలు, బెడ్లు అందుబాటులో ఉన్నాయి

రాష్ట్ర ఆరోగ్య శాఖ స్పష్టీకరణ

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నమోదవుతున్న కోవిడ్‌–19 పాజిటివ్‌ కేసులపై ప్రజలు భయాందోళన చెందవలసిన అవసరం లేదని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఎటువంటి పరిస్థితి అయినా ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆ శాఖ ప్రకటించింది. వైరస్‌పై ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను దూరం చేయాలని, వ్యాధి సోకి ఆస్పత్రులకు వచ్చే వారికి అరగంటలోనే బెడ్లు కేటాయించాలన్న సీఎం జగన్‌ ఆదేశాల మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సర్వం సిద్ధమైంది. కరోనా సోకిన వారికి ఎక్కడా, ఏ లోటు లేకుండా వైద్యం అందించేలా అన్ని ఏర్పాట్లు చేసింది.  

ఇళ్లలోనే 85 శాతం కేసులు 
► రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్‌ కేసుల్లో 85 శాతం మందికి ఇళ్లలోనే నయమవుతుంది. మిగిలిన 15 శాతం ఆస్పత్రుల్లో చేరినా, వారిలో కేవలం 4 శాతం రోగులు మాత్రమే అత్యవసర వైద్య సేవల విభాగం (ఐసీయూ)లో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రుల్లో చేరిన వారిలో 11 శాతం మంది సాధారణ చికిత్సతో డిశ్చార్జ్‌ అవుతున్నారు. 
► రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆస్పత్రులలో 36,778 బెడ్లు అందుబాటులో ఉండగా, వాటిలో గురువారం నాటికి కేవలం 45.48 శాతం అంటే.. 14,450 బెడ్లు మాత్రమే ఆక్యుపెన్సీలో ఉన్నాయి.  

ఆక్సిజన్‌ పైప్‌లైన్లు
► కోవిడ్‌ చికిత్సలో కీలకమైన ఆక్సిజన్‌ సరఫరాకు అవసరమైన పైప్‌లైన్ల ఏర్పాటుపైనా వైద్య ఆరోగ్య శాఖ దృష్టి పెట్టింది. రాష్ట్రంలో కోవిడ్‌ వ్యాప్తికి ముందు అన్ని ప్రభుత్వ ఆస్పత్రులలో 3,286 ఆక్సిజన్‌ పైప్‌లైన్లు అందుబాటులో ఉండగా, ఆ తర్వాత నుంచి ప్రభుత్వం వాటి సంఖ్యను గణనీయంగా పెంచుతోంది.  ఈ ఏడాది జూన్‌ 3వ తేదీ నాటికి 11,364 కొత్త ఆక్సిజన్‌ పైప్‌లైన్లు మంజూరు చేయగా, వాటిలో 10,425 పైప్‌లైన్లను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత జూలై 29న మరో 7,187 ఆక్సిజన్‌ పైప్‌లైన్లను మంజూరు చేశారు. ఆ విధంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రులలో 17,827, ప్రైవేటు ఆస్పత్రులలో 11,084 పైప్‌లైన్లు ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 28,911 ఆక్సిజన్‌ పైప్‌లైన్లు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 

బెడ్ల సమాచారం: (30వ తేదీ గురువారం నాటికి) 
కోవిడ్‌ చికిత్స కోసం గుర్తించిన ఆస్పత్రులు – 138 
అందుబాటులో ఉన్న బెడ్లు – 36,778 
ఆస్పత్రుల్లో ఉన్న రోగుల సంఖ్య 14,450 
బెడ్ల వినియోగం– 45.48 శాతం 

మరిన్ని వార్తలు