AP Cabinet Meeting: కర్ఫ్యూతో కట్టడి

5 May, 2021 02:40 IST|Sakshi

కరోనా నియంత్రణకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు

ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు 144 సెక్షన్‌తో సడలింపు

12 తరువాత దుకాణాలన్నీ మూసి వేయాలి.. బస్సులు కూడా తిరగవు

అత్యవసరాలకే అనుమతి.. కరోనా పరీక్షలు ముమ్మరం.. ఫలితాలు 24 గంటల్లోనే 

కోవిడ్‌ ఆస్పత్రులలో ఇంజక్షన్లు, ఆక్సిజన్‌కు కొరత లేకుండా ప్రత్యేక చర్యలు 

గ్రామీణ ఆరోగ్యం బలోపేతం.. కొత్తగా 2,464 పోస్టులు మంజూరు

కొత్తగా 176 పీహెచ్‌సీలు ఏర్పాటు

ఈ ఏడాది 7వ తరగతికి సీబీఎస్‌ఈ.. దశల వారీగా పైతరగతులకు విస్తరణ

రాష్ట్రంలో బీసీలకు విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పదేళ్ల పాటు పొడిగింపు

ఉద్యోగాల భర్తీలో ఐదేళ్ల సడలింపు కూడా.. 2031 వరకు వర్తింపు

అర్చకులు, ఇమామ్‌లు, పాస్టర్ల గౌరవ వేతనాలు పెంపు

అసైన్డ్‌ భూములు సేకరిస్తే ఎస్సీ, ఎస్టీలకు 10 శాతం అదనంగా పరిహారం

సహకార డెయిరీల పునరుద్ధరణకు చర్యలు.. 

ఎస్‌బీఐ క్యాప్‌ సూచనల మేరకు కడప స్టీల్‌ ప్లాంట్‌ పనులు ‘ఎస్సార్‌ స్టీల్స్‌’కు..

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా మహమ్మారి కట్టడికి పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం నిర్ణయించింది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు బుధవారం నుంచి రెండు వారాలపాటు కట్టుదిట్టంగా కర్ఫ్యూ అమలును ఆమోదించింది. కోవిడ్‌ ఆసుపత్రుల్లో పూర్తిస్థాయిలో పడకలు, ఇంజెక్షన్లు, మందులు, తగినన్ని ఆక్సిజన్‌ నిల్వలు ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తీర్మానించింది. కరోనా పరీక్షలు నిర్వహించిన 24 గంటల్లోగా ఫలితాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని  నిర్ణయించింది. గ్రామీణ వైద్య వ్యవస్థను బలోపేతం చేసే ప్రణాళికను ఆమోదించింది. రాష్ట్రంలో విద్యా ప్రమాణాల పెంపే లక్ష్యంగా విద్యా రంగంలో సంస్కరణలను మంత్రివర్గం ఆమోదించింది.

ఏడో తరగతి నుంచి సీబీఎస్‌ఈ విద్యా విధానంలో బోధనకు సీబీఎస్‌ఈ బోర్డుతో ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించింది. పేద విద్యార్థులకు ప్రయోజనం కలిగించేందుకు ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల్లో 35 శాతం సీట్లు కన్వీనర్‌ కోటా కింద భర్తీ చేయాలని నిర్ణయించింది. కరోనా విపత్కర పరిస్థితులతో ప్రభుత్వ ఆదాయం తగ్గుతున్నప్పటికీ సంక్షేమ పథకాల అమలులో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని మంత్రివర్గం ధృఢ సంకల్పం వ్యక్తం చేసింది. ఎన్ని ఇబ్బందులున్నప్పటికీ వైఎస్సార్‌ రైతు భరోసా, వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా క్లెయిమ్‌ల కింద రైతులకు చెల్లింపులు, వైఎస్సార్‌ మత్స్యకార భరోసా ద్వారా మత్స్యకారులకు ఈ నెలలోనే ఆర్థిక సాయం అందించేందుకు ఆమోద ముద్ర వేసింది.

సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేస్తూ హంద్రీ–నీవా, పోలవరం,  ఏలేరు–తాండవ కాల్వల లింక్‌ ప్రాజెక్టులో విస్తరణ పనులను ఆమోదిస్తూ పలు పనులకు నిధులు కేటాయించింది. ఎస్సీ, ఎస్టీల నుంచి సేకరించే అసైన్డ్‌ భూములకు రైత్వారీ పట్టా భూముల కంటే 10 శాతం అధిక పరిహారం చెల్లించాలని మంత్రివర్గం తీర్మానించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని మంగళవారం వెలగపూడిలోని సచివాలయంలో నిర్వహించారు. ఈ వివరాలను సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) విలేకరులకు వెల్లడించారు. ఆ వివరాలు ఇవీ...
మంగళవారం సచివాలయంలో జరిగిన కేబినెట్‌ సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

నేటి నుంచి కర్ఫ్యూ
రాష్ట్రంలో కోవిడ్‌ మహమ్మారి నియంత్రణ, నివారణపై మంత్రివర్గం సవివరంగా చర్చించింది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా బుధవారం నుంచి రెండు వారాలపాటు రాష్ట్రంలో కర్ఫ్యూ అమలును మంత్రివర్గం ఆమోదించింది. ప్రజలు ఇబ్బంది పడకుండా రోజూ ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 144 సెక్షన్‌ అమలు చేస్తూ సడలింపులు ఇస్తారు. ఆ సమయంలో ఐదుగురికి మించి గుమిగూడకూడదు. మధ్యాహ్నం 12 గంటల తరువాత అన్ని దుకాణాలు మూసి వేయాలి. అత్యవసరాలకు మాత్రమే మినహాయింపు ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటల తరువాత ప్రజా రవాణా (ఆర్టీసీ బస్సులు), ప్రైవేట్‌ బస్సులను కూడా అనుమతించరు.

అంతరాష్ట్ర సర్వీసులను కూడా నిలిపివేస్తారు. మరోవైపు కోవిడ్‌ పరీక్షలు మరింత ముమ్మరంగా చేపట్టి ఫలితాన్ని 24 గంటల్లోనే వెల్లడించేలా చర్యలు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. కోవిడ్‌ ఆస్పత్రులలో ఇంజక్షన్లు, ఆక్సిజన్‌కు కొరత లేకుండా ఒడిశా, తమిళనాడు, కర్ణాటక నుంచి ఆక్సిజన్‌ సరఫరాకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు. ఆక్సిజన్‌ సరఫరా కోసం సింగపూర్‌ నుంచి ప్రత్యేకంగా 25 వాహనాలను తెప్పించాలని మంత్రివర్గం నిర్ణయించింది. కేంద్రం నుంచి కోవిడ్‌ వాక్సిన్ల సరఫరా తగినంత లేనందున 45 ఏళ్లు దాటిన వారికే మొదట టీకాలు వేయాలని మంత్రివర్గం తీర్మానించింది. అనంతరం 18 – 45 ఏళ్ల వారికి ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్రానికి మరిన్ని వ్యాక్సిన్లు కేటాయించాలని కోరుతూ కేంద్రానికి లేఖ కూడా రాయనున్నారు.

గ్రామీణ ఆరోగ్య వ్యవస్థ బలోపేతం
గ్రామీణ ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్రంలో కొత్తగా 176 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.  ఇందుకోసం రూ.511.79 కోట్లు వ్యయం కానుందని అంచనా. కొత్తగా 2,464 పోస్టులను మంజూరు చేశారు. ప్రతి మండలంలో రెండు పీహెచ్‌సీలు లేదా ఒక పీహెచ్‌సీ, ఒక సీహెచ్‌సీ (కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌) ఉండాలని, ప్రతి ఏజెన్సీ మండలానికి మూడు పీహెచ్‌సీలు ఉండాలని మంత్రివర్గం తీర్మానించింది. ప్రతి పీహెచ్‌సీకి ఒక 104 వాహనాన్ని సమకూరుస్తారు. వీటన్నింటితో ప్రతి మండలంలో నలుగురు డాక్టర్లు, 104 వాహనంలో మరో ఇద్దరు వైద్యుల చొప్పున మొత్తం ఆరుగురు డాక్టర్లు అందుబాటులో ఉంటారు. ఈ నిర్ణయంతో ఫ్యామిలీ డాక్టర్‌ విధానం అందుబాటులోకి వస్తుంది. మారుమూల గ్రామంలో కూడా మంచి వైద్యం అందించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

సీబీఎస్‌ఈ బోర్డుతో ఒప్పందం
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియంలో విద్యాబోధనతోపాటు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు సీబీఎస్‌ఈ బోర్డుతో ప్రభుత్వం ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకోనుంది. రాష్ట్రంలో 44,639 ప్రభుత్వ పాఠశాలలను దశలవారీగా అనుసంధానించే ప్రక్రియతోపాటు ఇంగ్లీష్‌ మీడియంలోనే విద్యాబోధన కొనసాగుతుంది. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులతోపాటు విద్యా సంస్థల అధికారులు సీబీఎస్‌ఈ సిలబస్, ఆ పరీక్షల నిర్వహణ తీరును అలవర్చుకునేలా తగిన అవగాహన కల్పిస్తారు.

2021–22 విద్యా సంవత్సరంలో ఏడో తరగతి విద్యార్థులు తొలిసారి సీబీఎస్‌ఈ సిలబస్‌తో పరీక్షలు రాయనుండగా, 2024 – 25లో పదో తరగతి విద్యార్థులు సీబీఎస్‌ఈ సిలబస్‌తో తొలిసారి పరీక్షలు రాస్తారు. ఒకవైపు విద్యా ప్రమాణాల పెంపు మరోవైపు నాడు–నేడు పనులతో పాఠశాలల రూపురేఖలు సమూలంగా మారడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా 6.12 లక్షల మంది విద్యార్థులు చేరగా వారిలో 4 లక్షల మందికిపైగా విద్యార్థులు ప్రైవేటు విద్యా సంస్థల నుంచి వచ్చినవారు కావడం విశేషం. 

‘సాల్ట్‌’ కు ప్రపంచ బ్యాంక్‌ రుణం
‘సపోర్టింగ్‌ ఆంధ్రాస్‌ లెర్నింగ్‌ ట్రాన్సఫర్మేషన్‌’ (సాల్ట్‌)కు మంత్రివర్గం పరిపాలనాపరమైన అనుమతి ఇచ్చింది. ఈ ప్రాజెక్టు కోసం ప్రపంచ బ్యాంక్‌ నుంచి 250 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.1,860 కోట్లు) రుణం సేకరిస్తున్నారు. ఆ నిధులతో ‘నాడు–నేడు’ కింద ప్రభుత్వ పాఠశాలల్లో పనులు పూర్తి చేస్తారు. ఉపాధ్యాయుల్లో వృత్తిపరమైన నైపుణ్యాలు పెంచడం, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టడం లాంటి వాటి కోసం కూడా ఆ నిధులను వినియోగిస్తారు.

ఎయిడెడ్‌ విద్యా సంస్థల టేకోవర్‌
ప్రభుత్వానికి అప్పగించడానికి సిద్ధంగా ఉన్న ఎయిడెడ్‌ విద్యా సంస్థలను ప్రభుత్వం టేకోవర్‌ చేస్తుంది. ఏమాత్రం ఆర్థిక భారం పడకుండా ఆ ప్రక్రియను పూర్తి చేస్తారు. అందుకు అనుగుణంగా ఏపీ విద్యా చట్టం–1982లో సవరణలను మంత్రివర్గం ఆమోదించింది. ఎయిడెడ్‌ విద్యా సంస్థలను టేకోవర్‌ చేయడం వల్ల ఎవరికీ నష్టం కలగదని ప్రభుత్వం స్పష్టం చేసింది. 

ప్రైవేటు వర్సిటీల్లో 35 శాతం సీట్లు కన్వీనర్‌ కోటాలో
‘ఏపీ ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్టం–2016’ సవరణను మంత్రివర్గం ఆమోదించింది. ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో 35 శాతానికి మించకుండా సీట్లలో ప్రభుత్వం కోటా ఉంటుంది. ఆ కోటాలో సీట్లు కేటాయించిన విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు స్కాలర్‌షిప్‌ కూడా ఇస్తారు. ప్రైవేటు విద్యా సంస్థలలో 35 శాతం ప్రభుత్వ కోటా వల్ల విద్యార్థులకు మరింత మెరుగైన విద్యావకాశాలు అందుబాటులోకి వస్తాయి. తద్వారా నైపుణ్యాలు అభివృద్ధి చెందడంతో పాటు ఉద్యోగ అవకా«శాలు కూడా మెరుగవుతాయి. ఇక బ్రౌన్‌ఫీల్డ్‌ ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటు వల్ల ప్రపంచ స్థాయి విద్య అందుబాటులోకి వస్తుంది. ఉన్నత విద్యా రంగం మరింత బలోపేతం అవుతుంది.

కొత్తగా రెండు వెటర్నరీ పాలిటెక్నిక్‌ కాలేజీలు
శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం వెన్నెలవలస, చిత్తూరు జిల్లా సదూం మండల కేంద్రంలో వెటర్నరీ పాలిటెక్నిక్‌ కళాశాలల ఏర్పాటును మంత్రివర్గం ఆమోదించింది. తిరుపతిలోని ఎస్వీ వెటర్నరీ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా వీటిని నెలకొల్పుతారు. వెన్నెలవలసలో 30 ఎకరాల్లో నెలకొల్పే కళాశాలకు రూ.9.55 కోట్లు, సదూంలో కళాశాలకు రూ.9.55 కోట్ల బడ్జెట్‌ కేటాయించారు. 

ప్రొద్దుటూరు ఇంజనీరింగ్‌ కాలేజీకి రూ.66 కోట్లు
యోగి వేమన విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ప్రొద్దుటూరులో ఉన్న వైఎస్సార్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో మొదటి దశలో రూ.66 కోట్ల అభివృద్ధి పనులకు ఆమోదం లభించింది. ఇందులో రెండు టీచింగ్‌ పోస్టులు, ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో ఆరు నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీ చేయాలని నిర్ణయించారు. వేంపల్లిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు కోసం రూ.20 కోట్లు మంజూరు చేశారు. 

బీసీలకు మరో పదేళ్లపాటు రిజర్వేషన్లు
రాష్ట్రంలో బీసీలకు( ఏ,బీ,సీ,డీ, ఈ కేటగిరీలు) విద్యా సంస్థలు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను మరో పదేళ్లు పొడిగిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఉద్యోగాల భర్తీలో బీసీలకు గరిష్ట వయోపరిమితిలో ఐదేళ్లు సడలింపును కూడా అమలు చేయనున్నారు. ఈమేరకు ఈ ఏడాది జూన్‌ 1 నుంచి 2031 మే 31 వరకు వర్తింపజేస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. 

డెయిరీల పునరుద్ధరణకు చర్యలు
ఏపీడీడీసీఎఫ్‌కు జవసత్వాలు
ఆంధ్రప్రదేశ్‌ పాడి అభివృద్ధి సహకార సమాఖ్య (ఏపీడీడీసీఎఫ్‌)కు జవసత్వాలు కల్పిస్తూ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. మూతబడిన లేదా నిస్తేజంలో ఉన్న డెయిరీలు తిరిగి పనిచేసేలా చర్యలు చేపడతారు. అందుకోసం అమూల్‌ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆ మేరకు ఇప్పటికే నాలుగు జిల్లాలలో అమూల్‌ సంస్థ పాల సేకరణ మొదలు పెట్టింది. వచ్చే ఏడాది మార్చి నాటికి అన్ని జిల్లాలలో పాల సేకరణ చేపడుతుంది. ఉపయోగంలో లేని డెయిరీలను అమూల్‌కు లీజ్‌కు ఇస్తారు.

‘ప్రకాశం’ పాల సంఘానికి రూ.69 కోట్ల రుణం..
ప్రకాశం జిల్లా పాల ఉత్పత్తిదారుల సంఘానికి ఏపీడీడీసీఎఫ్‌ ద్వారా రూ.69 కోట్ల రుణాన్ని మంజూరు చేసేందుకు మంత్రివర్గం అనుమతిచ్చింది. తద్వారా పాడి మహిళా రైతులకు చేయూత కల్పిస్తారు. వరసగా నష్టాలబాట పట్టిన ఈ సంఘం ఉత్పాదక సామర్థ్యంలో 10 శాతం కూడా పని చేయలేకపోతోంది. సంఘాన్ని పునరుజ్జీవింప చేయడం కోసం ఈ రుణాన్ని సమకూరుస్తున్నారు. దీంతో సంఘం బాకీలన్నీ తీర్చడంతో పాటు డెయిరీ ప్లాంట్‌కు అవసరమైన మరమ్మతులు చేస్తారు. 

అర్చకులు, ఇమామ్‌లు, ఫాస్టర్ల వేతనాల పెంపు
దైవ చింతన, పరమత సహనం, మత సామరస్యం వెల్లివిరిసేలా అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ అర్చకులు, ఇమామ్‌లు, మౌజమ్‌లు, పాస్టర్లకు ఇచ్చే గౌరవ వేతనాలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

► ఏ కేటగిరీ ఆలయాల్లో అర్చకుల వేతనాన్ని రూ.10 వేల నుంచి రూ.15,625కు, బీ కేటగిరీ ఆలయాల్లో అర్చకులకు రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచారు. 
► ఇమామ్‌లకు గౌరవ వేతనాన్ని రూ.5 వేల నుంచి రూ.10 వేలకు, మౌజమ్‌లకు రూ.3 వేల నుంచి రూ.5 వేలకు పెంచారు. 
► పాస్టర్లకు రూ.5 వేలు గౌరవ వేతనంగా చెల్లిస్తారు.

ఓర్వకల్లు విమానాశ్రయానికి ఉయ్యాలవాడ పేరు..
కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయానికి తొలి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టేందుకు మంత్రివర్గం ఆమోదించింది. ఈమేరకు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయం, కర్నూలు’ అని మార్పు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 

ఎస్సీ, ఎస్టీల అసైన్డ్‌ భూములకు 10 శాతం ఎక్కువ పరిహారం
ప్రభుత్వం ఎక్కడైనా భూసేకరణలో భాగంగా ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన అసైన్డ్‌ భూమిని సేకరించాల్సి వస్తే రైత్వారీ పట్టాకిచ్చే భూమి విలువ కంటే 10 శాతం అదనంగా ఎస్సీ, ఎస్టీ అసైన్డ్‌ రైతులకు చెల్లించేలా మంత్రివర్గం తీర్మానించింది. ఎన్నికల హమీ అమలులో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

పారిశ్రామికీకరణకు ప్రోత్సాహం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట ఇండస్ట్రియల్‌ పార్క్‌లో ‘గ్రీన్‌లామ్‌ సౌత్‌ ఇండియా లిమిటెడ్‌’కు 66.49 ఎకరాలు భూమి కేటాయింపునకు మంత్రివర్గం ఆమోదించింది. ఎకరం రూ.67,01,830 చొప్పున కేటాయిస్తారు. ఆ సంస్థ మొత్తం రూ.595 కోట్లు పెట్టుబడి పెడుతుంది. దాంతో ప్రత్యక్షంగా 400 మందికి, పరోక్షంగా మరో 450 ఉపాధి లభించనుంది.
– బెస్టెక్‌ ఫుట్‌వేర్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఆడిడాస్‌)కు ఫ్రీ హోల్డ్‌ రైట్స్‌పై మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఆ సంస్థ పులివెందుల వద్ద రూ.70 కోట్లు, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం ఇనగలూరు వద్ద మరో రూ.700 కోట్లు పెట్టుబడి పెడుతుంది.  తద్వారా పులివెందులలో 2 వేల మందికి, ఇనగలూరు వద్ద 10 వేల మందికి ఉపాధి లభిస్తుంది. 

‘ఎస్సార్‌’ స్టీల్‌కు కెఎస్‌ఎఫ్‌
ఎస్‌బీఐ క్యాప్స్‌ సిఫార్సుల మేరకు కడప స్టీల్‌ ఫ్యాక్టరీ పనులను ఎస్సార్‌ స్టీల్స్‌కు అప్పగించాలని మంత్రివర్గం నిర్ణయించింది. 
అంతకు ముందు ఆ బాధ్యతలు అప్పగించిన లిబర్టీ కంపెనీ నష్టాలపాలు కావడంతో కడప స్టీల్‌ ఫ్యాక్టరీ పనులను ఎస్సార్‌ స్టీల్స్‌కు అప్పగించాలని నిర్ణయించారు. 

కృష్ణపట్నం నోడ్‌లో సదుపాయాలు:
చెన్నై– బెంగళూరు, హైదరాబాద్‌– బెంగళూరు ఇండస్ట్రియల్‌ కారిడార్ల  (సీబీఐసీ)లో భాగంగా ఉన్న కృష్ణపట్నం నోడ్‌లో రూ.1,448 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పనకు పరిపాలనా అనుమతులు మంజూరు చేశారు. సీబీఐసీలో కృష్ణపట్నం నోడ్‌ కీలకం కానుంది. అక్కడ మొత్తం రూ.2,139.44 కోట్ల పెట్టుబడిని అంచనా వేస్తుండగా, 2040 నాటికి 10 లక్షల ఉద్యోగావకాశాలు వస్తాయి. 

ఏపీ ఎలక్ట్రానిక్స్‌ పాలసీ
ఎలక్ట్రానిక్స్‌ మ్యాన్యుఫ్యాక్చరింగ్‌ ఇండస్ట్రీ అభివృద్ధిలో భాగంగా ఏíపీ ఎలక్ట్రానిక్స్‌ పాలసీ 2021–24ని మంత్రివర్గం ఆమోదించింది. ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల ఉత్పత్తి, పరిశోధన, అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. దీంతో ఎలక్ట్రానిక్‌  ఉత్పత్తి రంగం రాష్ట్రంలో శర వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం ఈ రంగం విలువ 104 బిలియన్‌ డాలర్లు కాగా 2025 నాటికి 400 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని అంచనా.  
– ప్రపంచస్థాయి గ్రీన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రానిక్స్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌ (వైఎస్సార్‌ ఈఎంసీ)ని వైఎస్సార్‌ కడప జిల్లా కొప్పర్తి వద్ద అభివృద్ధి చేస్తున్నారు. ఎలక్ట్రానిక్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌లో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల ప్రత్యక్షంగా 39 వేల మందికి ఉపాధి లభించనుంది. 

విశాఖ పర్యాటక రంగానికి పెద్దపీట
పర్యాటక రంగ అభివృద్దిలో భాగంగా విశాఖపట్నం కైలాసగిరి నుంచి భోగాపురం విమానాశ్రయం వరకూ మధ్య ఉన్న ప్రాంతం అభివృద్ధి  ప్రణాళికను మంత్రివర్గం ఆమోదించింది. ఈ మార్గంలో 19 కిలోమీటర్ల మేర ఆరు నుంచి ఎనిమిది వరసల రహదారి నిర్మిస్తారు. కైలాసగిరి వద్ద ఐదు ఎకరాల్లో స్కై టవర్‌ నిర్మిస్తారు. బంగ్లాదేశ్‌ నౌక ఎంవీ మా ను ప్రభుత్వమే తీసుకుని ఫ్లోటింగ్‌ రెస్టారెంట్‌తోపాటు అక్వేరియం టన్నెల్‌ ఏర్పాటు చేస్తుంది. కైలాసగిరి నుంచి భోగాపురం వరకూ 11 బీచ్‌లను అభివృద్ది చేస్తారు. దీంతోపాటు వివిధ రకాల 12 ప్రాజెక్ట్‌లను టూరిజం ద్వారా అభివృద్ది చేసే ప్రణాళికను ఆమోదించారు.  

సాగునీటి పనులకు ఆమోదం
హంద్రీ–నీవా...
హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌) విస్తరణకు మంత్రివర్గం ఆమోదించింది. ప్రాజెక్టు మొదటి దశ పనుల్లో భాగంగా ప్రధాన కాలువ విస్తరణ మరియు లైనింగ్‌ పనులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. తద్వారా కాలువలో నీటి విడుదల సామర్థ్యం 6,300 క్యూసెక్కులకు పెంచుతారు. అదనపు పంప్‌హౌజ్‌లను నిర్మిస్తారు. మొత్తం రూ.6,182 కోట్లు అంచనా వ్యయంతో ఈ పనులు చేపడతారు. ప్రాజెక్టు రెండో దశ పనులకు సంబంధించి సవరించిన అంచనాలకు పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి. ఆ మేరకు రూ.9,318.14 కోట్లు సవరించిన అంచనాలకు మంత్రివర్గం ఆమోదించింది. 

పోలవరం ప్రాజెక్టు:
పోలవరం ప్రాజెక్టులో డెడ్‌ స్టోరేజీ స్థాయిలో (32 మీ) కూడా నీటిని తోడే ప్రాజెక్టుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఆ మేరకు ప్రాజెక్టు కుడివైపున పంప్‌హౌస్, ఎలక్ట్రిక్‌ సబ్‌ స్టేషన్‌తో పాటు, ఇతర నిర్మాణాలు చేపడతారు. అందుకు రూ.912 కోట్లు  అంచనా వ్యయంతో పనులకు ఆమోదించారు.  

కాల్వల లింక్‌:
ఏలేరు తాండవ కాల్వల లింక్‌ ప్రాజెక్టుకు పరిపాలనాపరమైన అనుమతినిచ్చారు. రూ.470.05 కోట్ల వ్యయం అంచనా వ్యయంతో చేపట్టే ఈ పనులతో కొత్తగా 5,600 ఎకరాలకు సాగునీరు అందిస్తారు. మొత్తం 51,465 ఎకరాల ఆయకట్టు స్థిరీకరిస్తారు. 

పల్నాడు ప్రాజెక్టుకు రూ.2,746కోట్ల రుణం 
వైఎస్సార్‌ పల్నాడు కరవు నివారణ ప్రాజెక్టులో భాగంగా ఎలక్ట్రో మెకానిక్‌ పనులు, ట్రాన్స్‌మిషన్‌ పనులతో పాటు, ఇతర సివిల్‌ పనుల కోసం రూ.2,746 కోట్ల రుణం సేకరణకు మంత్రి మండలి అనుమతినిచ్చింది. 

పశుగ్రాసానికి కొరత లేకుండా..
పశుగ్రాస కొరతను తీర్చడమే లక్ష్యంగా పశుగ్రాస భద్రతా పాలసీ 2021–2026ను మంత్రివర్గం ఆమోదించింది. టెక్నాలజీని ఉపయోగించుకుని ఫాడర్‌ మరియు ఫీడ్‌ ఉత్పత్తి పెంచనున్నారు. ఇతర రాష్ట్రాలలో అమలవుతున్న పాలసీని పరిశీలించిన మీదట మరింత ప్రయోజనకరంగా రూపొందించిన కొత్త పాలసీని మంత్రివర్గం ఆమోదించింది. ఈ పాలసీ కింద రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఏపీ స్టేట్‌ సీడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్, నేషనల్‌ సీడ్‌ కార్పొరేషన్‌లతో ఒప్పందం చేసుకుని రైతుల భూముల్లోనే సర్టిఫైడ్‌ విత్తనాలు పండిస్తుంది. పశుసంవర్ధక శాఖ భూముల్లో కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తారు. గుర్తింపు పొందిన ఏజెన్సీల ద్వారా బ్రీడర్‌ సీడ్‌ లేదా ఫౌండేషన్‌ సీడ్‌ లేదా సోర్స్‌ సీడ్‌ను రైతులకు ఇచ్చి వారి పర్యవేక్షణలో సర్టిఫైడ్‌ సీడ్‌ను పండిస్తారు. నేరుగా రైతులే కాంట్రాక్ట్‌ ఫార్మింగ్‌పై ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడంతో పాటు 75 శాతం సబ్సిడీతో ప్రైవేట్‌ ఏజెన్సీల నుంచి సర్టిఫైడ్‌ విత్తనాలను కొనుగోలు చేసి ఆర్‌బీకేల ద్వారా రైతులకు అందిస్తారు. 

మార్కెట్‌ యార్డుకు భూమి:
చిత్తూరు జిల్లా ఎస్‌ఆర్‌ పురం మండలం కొటార్లపల్లిలో 4.52 ఎకరాల భూమిని వ్యవసాయ మార్కెట్‌ యార్డు నిర్మాణం కోసం కేటాయిస్తూ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది.

ఈ నెలలో అందించే సాయం ఇలా....
13న వైఎస్సార్‌ రైతు భరోసా
రైతులకు పెట్టుబడి సాయంగా  ‘వైఎస్సార్‌ రైతు భరోసా’ పథకం ద్వారా ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి రైతుల ఖాతాల్లో ఈ నెల 13న నగదు జమ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఒక్కో రైతు ఖాతాలో రూ.7,500 చొప్పున జమ చేస్తారు. ఈ పథకంతో ఆర్‌ఓఎఫ్‌ఆర్, వాస్తవ సాగుదారులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలు రైతులకు కూడా లబ్ధి కలుగుతుంది. 2019–20లో ఈ పథకం ద్వారా 46,69,375 మందికి రూ.6,173 కోట్ల మేర ప్రయోజనం కలిగింది. 2020–21లో 51,59,045 మంది రైతులకు రూ.6,928 కోట్ల మేర సాయం అందింది.

23న వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా క్లెయిమ్‌ల చెల్లింపు
2020 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకంలో క్లెయిమ్‌ల చెల్లింపునకు మంత్రివర్గం ఆమోదించింది. ఈ నెల 25న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారు. 35.75 లక్షల హెక్టార్ల భూమిలో పంట నష్టపోయిన రైతులకు ఈ ఏడాది ఖరీఫ్‌లోనే ఉపయోగపడే విధంగా ఏమాత్రం జాప్యం లేకుండా ప్రభుత్వం చెల్లించనుంది. పూర్తి పారదర్శకత కోసం రైతు భరోసా కేంద్రాలలో లబ్ధిదారుల జాబితాలు ప్రదర్శిస్తారు. దీని ద్వారా 2019కి సంబంధించి 16.77 లక్షల మంది రైతులకు రూ.15,275 కోట్లు ఇచ్చారు. 

18న వైఎస్సార్‌ మత్స్యకార భరోసా
చేపల వేట నిషేధ సమయంలో ఆదుకునేందుకు ‘వైఎస్సార్‌ మత్స్యకార భరోసా’ పథకం కింద ఒక్కో మత్స్యకార కుటుంబం ఖాతాల్లో రూ.10 వేలు చొప్పున ఈ నెల 18న జమ చేయాలని నిర్ణయించారు. ఈ పథకం కింద 2019లో 1.02 లక్షల మంది మత్స్యకారులకు రూ.102.48 కోట్ల లబ్ధి చేకూరగా 2020లో దాదాపు 1.09 లక్షల మందికి రూ.109.23 కోట్ల మేర ప్రయోజనం కలిగింది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు