ఆడేద్దాం అదిరేలా

26 Dec, 2023 04:28 IST|Sakshi

నేడు గుంటూరులో ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీలను ప్రారంభించనున్న సీఎం జగన్‌

నల్లపాడు లయోలాలో క్రీడా వేడుకలు లాంఛనంగా ప్రారంభం

రాష్ట్రవ్యాప్తంగా 15,004 గ్రామ/వార్డు సచివాలయాల స్థాయిలో పోటీలు

5.09 లక్షల స్పోర్ట్స్‌ కిట్ల పంపిణీ

47 రోజులు.. 5 దశల్లో నిర్వహణ

1.22 కోట్ల మంది క్రీడాకారులు, వీక్షకుల రిజిస్ట్రేషన్లు

ఐదు క్రీడాంశాల్లో 34.19 లక్షల మంది క్రీడాకారుల నమోదు

అత్యధికంగా క్రికెట్‌లో 13 లక్షల మంది.. యోగ, మారథాన్, టెన్నీ కాయిట్‌లో 16 లక్షల మంది నమోదు

గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను గుర్తించేందుకు ప్రత్యేక ప్రణాళిక

సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, గుంటూరు:  రాష్ట్రవ్యాప్తంగా క్రీడాకారులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. దేశంలోనే అతి పెద్ద మెగా టోర్నీ ‘ఆడుదాం ఆంధ్రా’తో క్రీడో­త్సాహం ఉప్పొంగనుంది. ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఉదయం గుంటూరు జిల్లా నల్లపాడులోని లయోలా పబ్లిక్‌ స్కూల్‌లో లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం 15,004 గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో ఎమ్మెల్యేలు, మంత్రులు, కలెక్టర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారుల సమక్షంలో ఆటల పోటీ­లు మొదలవుతాయి.

ప్రతి జిల్లాకు జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులను బ్రాండ్‌ అంబాసి­డర్‌గా నియమించి ప్రభుత్వం క్రీడాకారుల్లో స్ఫూర్తిని పెంపొందిస్తోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి గ్రామ స్థాయిలోని వలంటీర్ల వరకు ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌లో భాగస్వాములను చేసింది. 3.33 లక్షల జట్లు పోటీ పడేందుకు అనువుగా 9,478 క్రీడా మైదానాలను తీర్చిదిద్దింది. 

ప్రతి రోజు క్రీడోదయమే..
డిసెంబర్‌ 26 నుంచి ఫిబ్రవరి 10వతేదీ వరకు 47 రోజుల పాటు నిర్విరామంగా ‘ఆడుదాం ఆంధ్ర’ పోటీలను నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. తొలి దశలో జనవరి 9వతేదీ నాటికి గ్రామ/వార్డు సచివాలయాల స్థాయిలో పోటీలను పూర్తి చేయనున్నారు. షెడ్యూల్‌ ప్రకారం జనవరి 10 నుంచి 23 వరకు మండల స్థాయిలో, జనవరి 24 నుంచి 30 వరకు నియోజకవర్గ స్థాయిలో, జనవరి 31 నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు జిల్లా స్థాయిలో, ఫిబ్రవరి 6వతేదీ నుంచి 10వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి పోటీలు జరగనున్నాయి.

ప్రతి రోజు ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 7 గంటలకు వరకు పోటీలు నిర్వహించేలా షెడ్యూల్‌ ఖరారు చేశారు. పాఠశాల విద్యాశాఖ పీఈటీలు, పీడీలతో పాటు శాప్‌ కోచ్‌లు, క్రీడా సంఘాలను పోటీలు సమర్థంగా నిర్వహించేలా సమాయత్తం చేశారు. ఇప్పటికే రిఫరీలుగా 1.50 లక్షల మంది వలంటీర్లకు ప్రత్యేక శిక్షణ అందించారు. క్రీడాకారుల మొబైల్‌ ఫోన్లకు మ్యాచ్‌ల సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించనున్నారు.

1.22 కోట్ల రిజిస్ట్రేషన్లు
ఉరుకుల పరుగుల దైనందిన జీవితంలో దేహ దారుఢ్యం, శారీరక వ్యాయామం విలువను చాటిచెప్పడంతో పాటు ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్తు అందించే లక్ష్యంతో ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర క్రీడోత్సవాలను నిర్వహిస్తోంది. 15 ఏళ్లు పైబడిన పురుషులు, మహిళలను క్రీడల వైపు ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే దాదాపు 1.22 కోట్ల మంది క్రీడాకారులు, వీక్షకుల రిజిస్ట్రేషన్లతో ‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమం చరిత్ర సృష్టిస్తోంది.

ఇందులో 34.19 లక్షల మంది క్రీడాకారులు పోటీపడనున్నారు. వీరిలో పది లక్షల మందికిపైగా మహిళలు రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం విశేషం. కాంపిటీటివ్‌ విభాగంలోని ఐదు ప్రధాన క్రీడాంశాల్లో క్రికెట్‌లో అత్యధికంగా 13 లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారు. నాన్‌ కాంపిటీటివ్‌ విభాగంలోని మారథాన్, యోగ, టెన్నీ కాయిట్‌లో 16 లక్షల మంది (కాంపిటీటివ్‌ విభాగంలో ఉన్నవారితో కలిపి) ఆసక్తి చూపించారు.   

5.09 లక్షల కిట్ల పంపిణీ
గ్రామీణ స్థాయిలో క్రీడా ప్రతిభను ప్రోత్సహించే లక్ష్యంతో రూ.119.19 కోట్ల బడ్జెట్‌తో ఆడుదాం ఆంధ్ర పోటీలను నిర్వహిస్తున్నారు. సుమారు రూ.12.21 కోట్ల మేర నగదు బహుమతులు ప్రదానం చేయనున్నారు. దాదాపు రూ.42 కోట్లతో క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, ఖోఖో, కబడ్డీ క్రీడాకారులకు అవసరమైన 5.09 లక్షల స్పోర్ట్స్‌ కిట్లను ప్రతి సచివాలయానికి సరఫరా చేశారు. ప్రొఫెషనల్‌ టోర్నీ తరహాలో మండల స్థాయిలో 17.10 లక్షల టీ షర్టులు, టోపీలతో కూడిన కిట్లను 
ఇస్తున్నారు.

ప్రొఫెషనల్స్‌ గుర్తింపు..
నియోజకవర్గ స్థాయిలో ఐదు రకాల క్రీడాంశాల్లో ప్రొఫెషనల్స్‌ను గుర్తించేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశారు. క్రికెట్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే), ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్, బ్యాడ్మింటన్‌లో సింధు, శ్రీకాంత్‌ బృందాలు, వాలీబాల్‌లో ప్రైమ్‌ వాలీబాల్, కబడ్డీలో ప్రోకబడ్డీ ఆర్గనైజర్లు, ఖోఖోలో రాష్ట్ర క్రీడా సంఘ ప్రతినిధులు టాలెంట్‌ హంట్‌ చేయనున్నాయి. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో ప్రతిభగల క్రీడాకారులను గుర్తించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అనంతరం వారికి వివిధ స్థాయిలో అంతర్జాతీయ శిక్షణ అందించడం, ఐపీఎల్‌ లాంటి ప్రతిష్టాత్మకం ఈవెంట్‌లో అవకాశం కల్పించే దృక్పథంతో పోటీలను నిర్వహిస్తోంది.

ఏర్పాట్లను పరిశీలించిన యంత్రాంగం
క్రీడోత్సవాలను ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి జగన్‌ నేడు గుంటూరు జిల్లా నల్లపాడు వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త, శాసన మండలి సభ్యుడు తలశిల రఘురామ్, శాసన మండలి విప్‌ లేళ్ల అప్పిరెడ్డి, యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కతిక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ సి.ప్రద్యుమ్న, కలెక్టర్‌ ఎం.వేణుగోపాలరెడ్డి, సంయుక్త కలెక్టర్‌ జి.రాజకుమారి, తెనాలి సబ్‌–కలెక్టర్‌ ప్రకార్‌ జైన్, నగరపాలక సంస్థ కమిషనర్‌ కీర్తి చేకూరి తదితరులు సోమవారం ఏర్పాట్లను పరిశీలించారు. ఆటలు పోటీల నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్‌ చర్చించారు. 

క్రీడాకారుల ఉజ్వల భవిత కోసం..
గ్రామీణ ప్రాంత క్రీడాకారుల ఉజ్వల భవిత కోసమే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇంతటి మహా క్రీడాయజ్ఞాన్ని తలపెట్టారు. ఇది క్రీడా చరిత్రలో అతిపెద్ద మైలురాయి. ఒకే ఈవెంట్‌లో 34 లక్షల మంది క్రీడాకారులు పోటీపడటం ఎప్పుడూ జరగలేదు. ‘ఆడుదాం ఆంధ్ర’ను మొక్కుబడిగా కాకుండా ప్రొఫెషనల్స్‌ గుర్తించి అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా నిర్వహిస్తున్నాం. జగనన్న ఏదైనా చెబితే కచ్చితంగా చేస్తారు. దేశానికి పతకాలు అందించే క్రీడా కార్ఖానాగా ఏపీని మారుస్తారు. 21 మంది రాష్ట్రస్థాయి బ్రాండ్‌ అంబాసిడర్‌లు, 345 మంది జిల్లా స్థాయి క్రీడాకారులు ‘ఆడుదాం ఆంధ్ర’ ద్వారా క్రీడాకారులకు స్ఫూర్తినిస్తున్నారు.
– ఆర్కే రోజా, పర్యాటక, సాంస్కృతిక యువజన శాఖ మంత్రి

>
మరిన్ని వార్తలు