కోవిడ్‌ పేషంట్లకు వేల బెడ్లు అందుబాటులో..

4 Sep, 2020 13:48 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. కోవిడ్‌ ఆస్పత్రుల్లో 37,441 బెడ్లు ఉన్నాయని అధికారులు ఈ సందర్భంగా సీఎంకు తెలిపారు. ఇవ్వాళ్టికి సాధారణ బెడ్లు 2,462, ఆక్సిజన్‌ సపోర్టుతో ఉన్న బెడ్లు 11,177, ఐసీయూ బెడ్లు 2,651 ఇంకా ఖాళీగా అందుబాటులో ఉన్నాయని సీఎంకు వివరించారు. కొన్ని పత్రికలు కావాలనే విషపూరిత రాతలు రాస్తున్నాయని సమీక్షలో చర్చించారు. కోవిడ్‌ ఆస్పత్రుల్లో తాత్కాలిక నియామకాలపై అధికారులు ముఖ్యమంత్రికి వివరాలు అందించారు.

మొత్తం 30,887 పోస్టులకు గానూ 21,673 పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయగా.. రెగ్యులర్‌ రిక్రూట్‌మెంట్‌లో 9,971 పోస్టులకుగాను 4,676 పోస్టుల నియామకం పూర్తయిందని పేర్కొన్నారు. ఇందులో 5,295 పోస్టుల భర్తీకి ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. మరో 10 రోజుల్లో వీటి భర్తీ పూర్తవుతుందని అధికారులు తెలిపారు. కోవిడ్‌ కోసం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిరోజూ రూ. 10.18 కోట్లు చేస్తోందని వెల్లడించారు. వైరస్‌ నిర్ధారణ పరీక్షల కోసం రూ. 4.3 కోట్లు, ఆహారం కోసం రూ.1.31 కోట్లు, మందులు కోసం రూ. 4.57 కోట్లు ఖర్చవుతోందని తెలిపారు. కాగా, తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షా కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, వైద్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్‌రెడ్డి పాల్గొన్నారు.
(చదవండి: సోషల్‌ మీడియాలో చూసినా.. సత్వర పరిష్కారం)

ఆరోగ్య శ్రీ సేవల్లో వారే కీలకం
ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగార్చేలా ఆస్పత్రులు వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలు జారీ చేశారు. సేవలు అందరికీ అందుబాటులో ఉండాలంటే ప్రతి ఆరోగ్యశ్రీ ఆస్పత్రిలో హెల్ప్‌ డెస్క్‌లను పెట్టాలని అధికారులకు సూచించారు. ఆరోగ్య మిత్రలతో హెల్ప్‌ డెస్క్‌లను ఏర్పాటు చేయాలని చెప్పారు. ఎక్కడ తప్పులు జరిగినా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎంపానల్‌ అయిన ప్రతి ఆస్పత్రిలోనూ హెల్ప్‌ డెస్క్‌ కచ్చితంగా ఏర్పాటు చేయాలని, రిఫరల్‌ విధానం చాలా సమర్థవంతంగా ఉండాలని సీఎం స్పష్టం చేశారు. కోవిడ్‌ ఆస్పత్రుపై ఎలాంటి సమీక్ష చేస్తున్నామో అన్ని ఆరోగ్యశ్రీ ఆస్పత్రులు, ఎంపానల్డ్‌ ఆస్పత్రులపై సమీక్ష చేయాలని అన్నారు.

రోగులకు వైద్యం సరిగ్గా అందలేదంటే వారిని సరైన ఆస్పత్రికి పంపించే బాధ్యత ఆరోగ్యమిత్రలదేనని సీఎం స్పష్టం చేశారు. పతిరోజూ అధికారులు కాల్‌ సెంటర్లకు మాక్‌ కాల్‌ చేసి పనితీరును పరిశీలించాలని చెప్పారు. ప్రతి మాక్‌ కాల్‌పై వస్తున్న రెస్పాన్స్‌ను కూడా రికార్డు చేయాలని చెప్పారు. ఆహారం, శానిటేషన్, డాక్టర్లు, మౌలిక సదుపాయాలు.. ఈనాలుగు పారామీటర్స్‌ మీద ప్రశ్నలు వేసి.. రోగులనుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవాలని సూచించారు. వీటిద్వారా ఆస్పత్రులకు రేటింగ్‌ ఇవ్వాలని సీఎం చెప్పారు. కొత్త వైద్య కళాశాలల నిర్మాణం కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొత్తగా తీసుకొస్తున్న కాలేజీలు ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేస్తాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 
(చదవండి: అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్‌)

మరిన్ని వార్తలు