ఆ మూడు వేరియంట్‌ల వల్లే..

26 Apr, 2021 02:16 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

జన్యు ఉత్పరివర్తనం చెందిన వైరస్‌లతో మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌లో కరోనా తీవ్రం

ఐజీఐబీ పరిశీలనలో వెల్లడి

సాక్షి, అమరావతి: దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా పెరగడానికి, కరోనా రికవరీ రేటు తగ్గడానికి వైరస్‌లో వచ్చిన జన్యు ఉత్పరివర్తనాలు కారణమని తేలింది. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జినోమిక్స్‌ అండ్‌ ఇంటిగ్రేటివ్‌ బయాలజీ (ఐజీఐబీ) పరిశీనలలో ఇది స్పష్టమైంది. పుణెలోని జాతీయ వైరాలజీ ల్యాబొరేటరీ పరిశీలనలో కూడా ఇది బయటపడింది. మూడు వెరైటీలు, వాటి ఉత్పరివర్తనాలే దేశంలో కరోనా వ్యాప్తికి అసలు కారణమని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. యూకే (బ్రిటన్‌) వెరైటీ సార్స్‌ కోవిడ్‌2 (బి.1.1.7), బ్రెజిల్‌ వెరైటీ సార్స్‌ కోవిడ్‌2 (బి.1.1.28), దక్షిణాఫ్రికా వెరైటీ బి.1.351.. ఈ మూడు వేరియంట్లే తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నట్టు గుర్తించారు.

మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌లో తీవ్రత ఎక్కువగా
మహారాష్ట్రలో ప్రస్తుతం తీవ్రంగా విరుచుకుపడుతున్న వైరస్‌ను రెండు ఉత్పరివర్తనాలు చెందిన బి.1.617గా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇ484క్యూ, ఎల్‌452ఆర్‌గా ఉత్పరివర్తనం చెంది ఊపిరితిత్తుల కణాలకు వైరస్‌ బలంగా అతుక్కుపోతున్నట్టు కనుగొన్నారు. దీనివల్ల ఒకసారి కరోనాకు గురై కోలుకున్న వారిపైన కూడా తిరిగి వైరస్‌ దాడి చేస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పశ్చిమబెంగాల్‌లో బి.1.678 వేరియంట్‌ తీవ్రంగా ఉంది. ఈ వైరస్‌ ఉత్పరివర్తనంలో స్పైక్స్‌ (కొమ్ముల్లో) అమైనో ఆమ్లాలు తొలగిపోవడంతో ఎప్పటికప్పుడు రూపు మార్చుకుని ఒకరి నుంచి మరొకరికి గాలి ద్వారా కూడా వ్యాపించే స్థాయికి చేరినట్టు గుర్తించారు. ఇది అత్యంత జాగ్రత్త వహించాల్సిన సమయమని, చికిత్సకంటే వైరస్‌ వ్యాప్తిని అరికట్టడమే ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు.

మొదటి వేవ్‌కంటే దూకుడుగా ఉంది
మొదటి వేవ్‌లో వచ్చిన వైరస్‌ కంటే ఇప్పుడు వ్యాప్తి చెందినది బలంగా ఉంది. తొందరగా దాడి చేస్తున్నట్టు గుర్తించారు. దీనికి ముఖ్య కారణం వైరస్‌ ఎప్పటికప్పుడు ఉత్పరివర్తనం చెందడమే. చికిత్సకు కూడా అంతుచిక్కకుండా రూపు మార్చుకుంటోంది. గాలిద్వారా వ్యాపిస్తోంది కాబట్టి మాస్కు విధిగా వాడటం మినహా మరో దారి లేదు.  
 – డా.జి.ప్రవీణ్‌కుమార్, మైక్రోబయాలజిస్ట్, ఔషధ నియంత్రణశాఖ ల్యాబొరేటరీ 

మరిన్ని వార్తలు