ప్రికాషన్‌ డోసు గడువు తగ్గింపు 

10 Jul, 2022 02:55 IST|Sakshi

ఇకపై రెండో డోసు వేసుకున్న 6 నెలలకే ‘ప్రికాషన్‌’ తీసుకోవచ్చు

గతంలో 9 నెలలు దాటితేనే ప్రికాషన్‌ డోసుకు అర్హత

మార్గదర్శకాలు జారీ చేసిన ఆరోగ్య శాఖ  

సాక్షి, అమరావతి: కరోనా టీకా ప్రికాషన్‌ డోసు కాల వ్యవధిని 9 నెలల నుంచి 6 నెలలకు తగ్గించినట్టు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ జె.నివాస్‌ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇటీవల కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ గడువును తగ్గిస్తూ ఆదేశాలు ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కొత్త నిబంధనల మేరకు సవరించిన మార్గదర్శకాలను జిల్లా కలెక్టర్లకు జారీ చేశామని చెప్పారు.

ఇకపై 18 ఏళ్లు పైబడిన వారందరూ రెండో డోసు టీకా తీసుకున్న 6 నెలలు లేదా 26 వారాల తర్వాత ప్రికాషన్‌ డోసు టీకా వేసుకోవచ్చన్నారు. 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు ప్రభుత్వమే ఉచితంగా ప్రికాషన్‌ డోసు వేస్తోందని తెలిపారు. 18–59 ఏళ్ల వయసున్న వారు ప్రైవేట్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో ప్రికాషన్‌ డోసు తీసుకోవాలని సూచించారు. సవరించిన టీకా నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించేలా జిల్లాల కలెక్టర్లు, డీఎంహెచ్‌వోలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అర్హులైన వారంతా ప్రికాషన్‌ డోసు తీసుకునేలా చూడాలని సూచించారు.   

మరిన్ని వార్తలు