బోధనాసుపత్రుల్లో కోవిడ్, నాన్‌కోవిడ్‌ సేవలు

27 Jun, 2021 03:48 IST|Sakshi

ప్రత్యేక పడకలు, మార్గాల ద్వారా కోవిడ్‌ బాధితులకు వైద్యం

గర్భిణులకు ప్రత్యేక వార్డుల ఏర్పాటు.. ఆస్పత్రులకు వైద్య విద్యా డైరెక్టర్‌ ఆదేశం

సాక్షి, అమరావతి: కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో మార్చి నెల నుంచి అన్ని బోధనాసుపత్రులను కోవిడ్‌ ఆస్పత్రులుగా మార్చిన సంగతి తెలిసిందే. కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో ఈ ఆస్పత్రుల్లో ఇక నాన్‌కోవిడ్‌ సేవలనూ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఆస్పత్రులకు కరోనాతోనే కాకుండా పలు ఆరోగ్య సమస్యలతో వచ్చే వారు ఎక్కువ మంది ఉంటున్న నేపథ్యంలో ప్రతి బోధనాసుపత్రిలో కోవిడ్, నాన్‌ కోవిడ్‌ విభాగాలను ఏర్పాటు చేయాలని వైద్య విద్యా డైరెక్టర్‌ శనివారం ఆదేశాలిచ్చారు.

కోవిడ్‌తో ఆస్పత్రుల్లో చేరే వారికి ప్రత్యేక పడకలు, రూములు కేటాయించి, మిగతా వాటిని నాన్‌కోవిడ్‌కు ఉపయోగించాలని సూచించారు. కోవిడ్‌ బాధితులకు ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేసి మిగతా ప్రాంతాన్ని నాన్‌కోవిడ్‌ సేవలకు వాడుకోవాలని పేర్కొన్నారు. యాక్సిడెంట్‌ కేసులు, ఈఎన్‌టీ, గ్యాస్ట్రిక్‌ వంటి సమస్యలతో వచ్చేవారికి ఔట్‌పేషెంట్, ఇన్‌పేషెంట్‌ సేవలను పునరుద్ధరించాలని ఆదేశించారు. కరోనా థర్డ్‌ వేవ్‌ వస్తే ఆస్పత్రుల్లో మౌలిక వసతులను ఏర్పాటు చేస్తూనే, నాన్‌ కోవిడ్‌ సేవలనూ కొనసాగించాలని ఆదేశించారు. రాష్ట్రంలో బోధనాసుపత్రులకు ప్రసవాలకు వచ్చేవారి సంఖ్య ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో గర్భిణులకు ప్రత్యేక వార్డులు కేటాయించాలని ఆదేశించారు. కోవిడ్, నాన్‌కోవిడ్‌ సేవలను రెండింటినీ ఒకే ఆస్పత్రిలో ఏర్పాటు చేయడం వల్ల రోగులకు ఇబ్బందులు తొలగిపోతాయని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు