Fact Check: రైతుబజార్లపై ‘కుళ్లు’ కథ 

26 Dec, 2023 05:20 IST|Sakshi

రాష్ట్రంలో రైతుబజార్లు బాగున్నా.. చెత్త రాతలు రాసిన ఈనాడు

టీడీపీ ఐదేళ్లలో ఏర్పాటు చేసింది 11 రైతు బజార్లే 

ఈ నాలుగున్నరేళ్లలో రూ.40 కోట్లతో కొత్తగా 54 రైతుబజార్లు 

4.50 కోట్లతో ఆధునికీకరణ 

ప్రతీ రైతుబజార్లో ఆర్వో ప్లాంట్లు, మరుగుదొడ్లు, విద్యుత్‌ సౌకర్యం 

ఏటా పెరుగుతున్న రైతులు.. వినియోగదారుల సంఖ్య 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని కూరగాయ రైతులు, వినియోగదారులకు నష్టం కలిగించేలా ఈనాడు రామోజీరావు మరో అభూతకల్పనల కథను అచ్చేశారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పన, వినియోగదారులకు నాణ్యమైన తాజా కూరగాయలు, ఇతర నిత్యావసరాలను మార్కెట్‌ ధరలకంటే తక్కువకు అందించేందుకు ఏర్పాటు చేసిన రైతు బజార్ల లక్ష్యాన్ని దెబ్బతీసేలా ‘రైతు బజార్లలోనూ బాదుడే బాదుడు..’ అంటూ ఓ చెత్త కథనాన్ని అల్లారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం నాలుగున్నరేళ్లుగా రైతుబజార్లను బలోపేతం చేసింది. వాటిని ఆధునీకరించింది. కొత్త రైతు బజార్లనూ నిర్మించింది.

పైగా చంద్రబాబు హయాంలోలాగా దళారీలు లేకుండా, కేవలం రైతులే కూరగాయలు అమ్మేలా, వినియోగదారులకు తక్కువ ధరకు లభించేలా చర్యలు తీసుకుంది. పైగా, రైతుబజార్లు ఆర్థిక అవసరాల కోసం మార్కెట్‌ కమిటీల మీద ఆధారపడకుండా, ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేలా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రైతు బజార్ల వ్యవస్థలో ఇలాంటి మార్పులను రామోజీ ఎప్పుడూ చూసి ఉండరు. చంద్రబాబు హయాంలో ఈ వ్యవస్థ ఎంత దైన్యస్థితికి చేరిందో అందరికీ తెలిసిందే. ఒక్క రైతుబజారూ బాగుపడలేదు. బాబు హయాంలో రైతుబజార్లు దళారీల అడ్డాగా మారిపోయాయి.

దళారులు వినియోగదారులను నిత్యం దోపిడీ చేసేవారు. కనీస వసతులు లేక రైతులు, వినియోగదారుల అవస్థలు వర్ణనాతీతం. నేడు ఈ అవలక్షణాలన్నింటి నుంచి బయటపడి, వినియోగదారులకు మంచి సేవలందిస్తున్నాయన్నదే రామోజీ బాధ. ఈరోజు ఆధునికంగా రూపుదిద్దుకున్న రైతు బజార్లపై చెత్త రాతలు రాసి ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మళ్లీ రైతుబజార్లకు రైతులు రాకూడదని, దళారీలు, వ్యాపారులే వీటిలో వ్యాపారం చేసుకోవాలని, వినియోగదారులను దోపిడీ చేయాలన్నదే రామోజీ లక్ష్యం. అందుకే ఈ అడ్డగోలు కథనం. ఈ కథనంలో వాస్తవాలేమిటో చూద్దాం.. 

బాబు హయాంలో రైతుబజార్ల దీనావస్థ 
చంద్రబాబు అధికారం చేపట్టే నాటికి రాష్ట్రంలో 87 రైతుబజార్లుండేవి. పెరుగుతున్న జనాభాకనుగుణంగా కొత్త రైతుబజార్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. కొత్త వాటి ప్రతిపాదనలను చంద్రబాబు ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. బాబు ఐదేళ్లలో మొక్కుబడిగా మార్కెట్‌యార్డు స్థలాల్లో 11 రైతుబజార్లను ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. టీడీపీ హయాంలో ఉన్న రైతు­బజార్లలో మూడొంతులు శిథిలావస్థకు చేరుకోవడంతో వినియోగదారులు, రైతులు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ నిత్యం అవస్థలు పడేవారు. అయినా ఆ ప్రభుత్వం కన్నెత్తి చూడలేదు. రైతుబజార్లను ఆధునీకరించాలన్న ఆలోచనే చేయలేదు 

కొత్తగా 54 రైతుబజార్లు కన్పించడం లేదా? 
వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుబజార్ల విస్తరణ, ఆధునీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. 2019 నుంచి 2023 వరకు రూ.40 కోట్లతో 54 రైతుబజార్లు కొత్తగా ఏర్పాటు చేసింది. వీటిలో ఇప్పటికే 22 రైతుబజార్ల నిర్మాణాలు పూర్తికాగా, 17 వినియోగంలోకి వచ్చాయి. మరో 5 ఫిబ్ర­వరికల్లా అందుబాటులోకి రానున్నాయి. మిగిలిన 32 రైతుబజార్ల నిర్మాణం వివిధ దశల్లో ఉన్నాయి. టెండర్‌ దశలో 11 ఉండగా, బేస్‌మెంట్‌ లెవల్‌లో 8, రూఫ్‌ లెవల్‌లో 8, రూఫ్‌లెవల్‌ విత్‌ సీలింగ్‌ దశలో మరో ఐదు ఉన్నాయి. వీటిని కూడా ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ముగిసేలోగానే అందుబాటులోకి తేవాలన్న సంకల్పంతో ముందుకెళ్తున్నారు. 

ఏటా పెరుగుతున్న రైతులు, వినియోగదారులు 
ఈ ప్రభుత్వం వచ్చాక నిర్మించిన రైతుబజార్లతో కలిపి రాష్ట్రంలో 115 రైతుబజార్లున్నాయి. వీటి ద్వారా 10 వేల మంది రైతులు ప్రత్యక్షంగా, మరో 15 వేల మంది పరోక్షంగా జీవనోపాధి పొందుతున్నారు. రోజూ 150 నుంచి 200 టన్నుల కూరగాయలను గిట్టుబాటు ధరకు విక్రయిస్తున్నారు. సగటున రోజుకు 6 లక్షల మంది వినియోగదారులు వీటిని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఒక్కో రైతు బజార్‌లో రోజూ రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు వ్యాపారం జరుగుతోంది. బహిరంగ మార్కెట్లతో పోల్చుకుంటే 10 నుంచి 15 శాతం తక్కువ ధరలకే తాజా కూరగాయలు, నిత్యావసరాలు అందుబాటులో ఉండడంతో రైతుబజార్లకు ప్రజాదరణ రోజురోజుకు పెరుగుతోంది. 

ప్రతి రైతుబజారులో అత్యాధునిక సౌకర్యాలు 
ప్రస్తుతం ఉన్న రైతుబజార్ల ఆధునికీకరణకు గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం జగన్‌ ప్రభుత్వం పెద్ద పీట వేసింది. ‘నాడు–నేడు’ కార్యక్రమం ద్వారా రూ. 4.50 కోట్లతో ప్రతి రైతుబజారులో శిథిలమైన షెడ్ల పునరుద్ధరణ, రక్షిత తాగునీరు అందించే ఆర్వో ప్లాంట్లు, రన్నింగ్‌ వాటర్‌ సదుపాయంతో మరుగుదొడ్లు, సోలార్‌ రూఫ్‌ ప్యానల్స్, డిజిటల్‌ డిస్‌ప్లే బోర్డులు వంటి అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇలా విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, వైఎస్సార్‌ జిల్లాల్లో శిథిలమైన రైతుబజార్లన్నీ ఆధునీకరిస్తున్నారు. 

ధరలు పెరిగినా, తగ్గినా మార్కెట్‌లో జోక్యం 
సీఎం యాప్‌ ద్వారా రోజూ బహిరంగ మార్కెట్‌లో ధరల హెచ్చుతగ్గులను సమీక్షిస్తూ ధరలు పతనమై­నా, పెరిగినా మార్కెట్‌లో జోక్యం చేసుకుంటూ రై­తు­­లు, వినియోగదారులకు మేలు జరిగేలా జగన్‌ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ధరలు పెరిగిన ప్రతిసారీ రైతులు, వ్యాపారుల నుంచి మార్కెటింగ్‌ శాఖ ద్వారా వస్తువులు కొని, వినియోగదారులకు తక్కు­వ ధరలకు అందుబాటులోకి తెచ్చింది.

రైతు­లకు ఏమాత్రం నష్టం రాకుండా గిట్టుబాటు ధరకే కొం­టోంది. టమాటా, ఉల్లిపాయలతోపాటు బత్తా­యి, పైనాపిల్‌ వంటి ఉద్యాన ఉత్పత్తులను సైతం మద్దతు ధరకు కొని, రైతుబజార్లలో సబ్సిడీ రేట్లకే వి­క్రయించింది. ఇలా రూ.64.04 కోట్ల విలువైన 9,025 టన్నుల ఉల్లి, 1.28 కోట్ల విలువైన 1,425 టన్నుల టమాటా, రూ.5 కోట్ల విలువైన 4,109 ట­న్నుల బత్తాయి, రూ.కోటికి పైగా విలువైన పైనాపిల్‌ను రైతుబజార్లలో సబ్సిడీ ధరకే అందించింది. 

75 రైతుబజార్లు స్వయం సమృద్ధి 
ఇప్పటివరకు రైతుబజార్లు నిర్వహణ, సిబ్బంది జీతభత్యాల కోసం పూర్తిగా మార్కెటింగ్‌ కమిటీలపై ఆధారపడేవి. కేంద్రం మార్కెట్‌ సెస్‌ను రద్దు చేయడంతో, రైతుబజార్ల నిర్వహణ, జీతభత్యాలకు ఇబ్బంది లేకుండా ప్రతి రైతుబజారు స్వయం సమృద్ధి సాధించాలన్న సంకల్పంతో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది.

రైతుబజార్ల స్టాల్స్‌ అద్దెలను సవరించడం, పార్కింగ్, సేంద్రీయ ఉత్పత్తులు, ఫిష్‌ ఆంధ్ర స్టాల్స్‌ ఏర్పాటు, ప్రకటన బోర్డుల ద్వారా ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకొంది. దీంతో 75 రైతుబజార్లు ఆర్ధిక పరిపుష్టి సాధించాయి. ఇప్పుడివి ఆర్థిక అవసరాల కోసం మార్కెట్‌ కమిటీలపై ఆధార పడాల్సిన అవసరం లేదు. 

కోవిడ్‌ సమయంలో కూడా 
కోవిడ్‌ సమయంలో రైతులు నష్టపోకూడదని, వినియోగదారులు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో ఒక రైతుబజార్‌ను 3, 4 భాగాలుగా విభ­జించి, ప్రజలకు మరింత చేరువలో ఏర్పాటు చేసింది. మొబైల్‌ రైతుబజార్లను సైతం నెలకొల్పింది. వీటి వల్ల కూరగాయలు అందుబాటులో ఉండటంతో­పాటు రైతులు, వినియోగదారులను వైరస్‌ వ్యాప్తి నుంచి కాపాడింది.

విజయవాడ అజిత్‌సింగ్‌ నగర్‌ రైతుబజారులో కూరగాయల వ్యర్థాలను ఎరువుగా మార్చే యంత్రం ఇంకా వినియోగంలోకే రాలేదు. అయినా ఈనాడు పనిగట్టుకొని అది మూలన పడిందని రాసింది. దాదాపు అన్ని రైతుబజార్లలో మరుగుదొడ్లు నిక్షేపంగా పనిచేస్తున్నాయి. నిర్మాణం పూర్తయిన బాపట్ల, ఆరిలోవ రైతుబజార్లను ప్రారంభానికి సిద్ధం చేస్తున్నారు. అయినా కళ్లుండీ కబోదిలా ఈనాడు అడ్డగోలుగా కథనం అచ్చేసింది.  

>
మరిన్ని వార్తలు