ఏపీ: 18-45 వయసు వారికీ ఉచితంగా వ్యాక్సిన్‌

24 Apr, 2021 03:25 IST|Sakshi

రాష్ట్రంలో నేటి నుంచి నైట్‌ కర్ఫ్యూ 

రాత్రి 10 నుంచి ఉదయం 5 వరకు.. 

ఆ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది: ముఖ్యమంత్రి జగన్‌ 

వెంటనే తగినన్ని టీకా డోసులకు ఆర్డర్‌ ఇవ్వాలని ఆదేశం

రైతుబజార్లు, మార్కెట్లను గతంలో మాదిరిగా వికేంద్రీకరించండి

టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్‌ పరీక్షలు యథాతథం 

పోటీ ప్రపంచంలో విద్యార్థులకు నష్టం కలగకూడదనే ఈ నిర్ణయం 

టీకాలు, ఇంజక్షన్లపై ఫార్మా కంపెనీ యాజమాన్యాలతో మాట్లాడిన సీఎం జగన్‌

కోవిడ్‌ నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై సీఎం జగన్‌ ఉన్నతస్థాయి సమీక్ష 

సాక్షి, అమరావతి: కోవిడ్‌ వ్యాక్సిన్‌పై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు వారందరికీ ఉచితంగా కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఆ ఖర్చు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. ఈ మేరకు అవసరమైనన్ని కోవిడ్‌ వ్యాక్సిన్‌ డోస్‌లకు ఆర్డర్‌ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. 18 – 45 ఏళ్ల మధ్య వయసు ఉన్న 2,04,70,364 మందికి టీకా ఇవ్వాల్సి ఉన్నందున ఆ మేరకు డోసులు సేకరించాలని సూచించారు. కోవిడ్‌ నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్‌పై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలివీ... 

రాత్రి పూట కర్ఫ్యూ...
రాష్ట్రంలో కోవిడ్‌ వ్యాప్తి నియంత్రణలో భాగంగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్‌ కర్ఫ్యూ అమలు చేయాలి. రెస్టారెంట్లతో సహా అన్నింటినీ మూసేయాలి. ప్రజలు ఇబ్బంది పడకుండా రైతు బజార్లు, మార్కెట్లను వికేంద్రీకరించాలి. గతంలో మాదిరిగా వార్డులలో ప్రత్యేక మొబైల్‌ రైతు బజార్లు ఏర్పాటు చేయాలి. 

యథావిథిగా టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్‌ పరీక్షలు
విద్యార్థులకు నష్టం కలగకుండా పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్‌ పరీక్షలు నిర్వహించాలి. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు జరపాలి. ఈ విషయంలో ఎక్కడా నిర్లక్ష్యం చూపవద్దు. టెన్త్, ఇంటర్, డిగ్రీ మార్కులకు చాలా ప్రాధాన్యం ఉంది. ఉద్యోగ నియామకాల్లో కంపెనీలు వీటిని పరిగణలోకి తీసుకుంటాయి. విద్యార్థులకు మంచి కాలేజీల్లో అడ్మిషన్లు దొరకాలంటే మార్కులకు ప్రాధాన్యం ఇస్తాయి. ఇతర రాష్ట్రాల విద్యార్థులతో పోటీపడి పరీక్షల్లో నెగ్గుకు రావాలన్నా, ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో సీట్లు సంపాదించాలన్నా మార్కులను పరిగణలోకి తీసుకుంటారు. బాగా చదివే విద్యార్థులకు నష్టం కలగ కూడదని, అందరితో పోటీపడి మంచి ఉద్యోగాలు సాధించాలన్న వారి ఆకాంక్షలు నీరుగారరాదనే ఈ నిర్ణయం.

ఔషధాలు బ్లాక్‌కు తరలకూడదు..
ఆక్సిజన్‌ ఉత్పత్తితో పాటు సరఫరాను హేతుబద్ధీకరించండి. కోవిడ్‌ చికిత్సలో ముఖ్యమైన రెమిడిస్‌విర్‌ ఇంజక్షన్ల కేటాయింపు, సరఫరా ఎలా ఉందన్నది సమీక్షించాలి. ఎక్కడా ఈ ఔషథం బ్లాక్‌ మార్కెట్‌ కాకుండా చూడాలి. ఏదైనా రాకెట్‌ ఉంటే పూర్తిగా అరికట్టాలి. ఇందుకోసం ఎస్‌వోపీ రూపొందించాలి. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న కోవిడ్‌ వాక్సిన్, రెమిడిస్‌వర్‌ ఇంజక్షన్లు ముందుగా ఇక్కడి అవసరాలు తీర్చాలి. లేదంటే ఇక్కడ కేసులు పెరిగితే ఆ సంస్థలను మూసివేసే పరిస్థితి వస్తుంది. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి కూడా వివరించాలి.

ఏ ఒక్క ప్రాణం పోకూడదు..
కోవిడ్‌ పరీక్షల సంఖ్య అవసరం మేరకు పెంచండి. కోవిడ్‌ బారిన పడిన ప్రెమరీ కాంటాక్ట్‌లతోపాటు ఆ పరీక్ష కోరుకున్న వారందరికీ వెంటనే చేయాలి. ఏ ఒక్క ప్రాణం పోకుండా కాపాడటం మనకు చాలా ముఖ్యం.

ఎక్కువ వసూలు చేస్తే కఠిన చర్యలు
కోవిడ్‌ చికిత్స కోసం ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్‌ ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోండి. అవసరమైతే దాడులు జరపాలి. ఇందుకోసం ఒక సీనియర్‌ అధికారిని నియమించండి.

104 ప్రతి కాల్‌కు స్పందించాలి..
104 కాల్‌ సెంటర్‌ మరింత సమర్థంగా పని చేయాలి. ప్రతి కాల్‌కు స్పందించాలి. మనం నిర్దేశించుకున్నట్లు ఫోన్‌ చేసిన 3 గంటల్లోనే బెడ్‌ కేటాయించాలి. ఆ నెంబర్‌కు ఫోన్‌ చేస్తే తమకు సాయం చేస్తారన్న నమ్మకాన్ని ప్రజల్లో కలిగించాలి. 104 కాల్‌ సెంటర్‌ను జిల్లాలో ఒక జేసీకి కేటాయించండి. ఆ అధికారి అవసరం మేరకు కాల్‌ సెంటర్‌లో కూర్చుని పర్యవేక్షించాలి. అవసరమైనన్ని కోవిడ్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేసి తగిన సదుపాయాలు కల్పించాలి.

ఫార్మా కంపెనీలతో మాట్లాడిన సీఎం జగన్‌
సమీక్షకు ముందు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో భారత్‌ బయోటెక్‌ ఎండీ కృష్ణా ఎల్లాతో పాటు హెటెరో డ్రగ్స్‌ ఎండీ బి.పార్థసారథిరెడ్డితో మాట్లాడారు. రాష్ట్ర అవసరాలు తీర్చే విధంగా మరిన్ని కోవిడ్‌ వాక్సిన్‌ డోసులతో పాటు రెమిడిసివిర్‌ ఇంజక్షన్లు సరఫరా చేయాలని వారిని కోరారు. 

మరిన్ని ఆక్సిజన్‌ రవాణా వాహనాలు
రాష్ట్రంలో ఆక్సిజన్‌ రవాణా కోసం కేవలం 64 వాహనాలు మాత్రమే ఉన్నాయని, ప్రస్తుత డిమాండ్‌ను తట్టుకునేందుకు కనీసం 100 నుంచి 120 వాహనాలు అవసరమని సమావేశంలో అధికారులు తెలిపారు. అన్ని ఆస్పత్రులలో ఆక్సిజన్‌ పడకలు నిండితే 515 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ అవసరం ఉంటుందని, ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులలో రోజుకు సగటున 284 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ వినియోగిస్తున్నట్లు చెప్పారు. విశాఖ ఆర్‌ఐఎన్‌ఎల్‌లో రోజుకు 100 మెట్రిక్‌ టన్నులు ఉత్పత్తి చేసి రాష్ట్రానికే ఇవ్వడంతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి సరఫరా పెంచాలని కేంద్రాన్ని కోరినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 208 కోవిడ్‌ ఆస్పత్రులలో మొత్తం 21,581 బెడ్లు ఉండగా 11,789 బెడ్లు నిండాయని, గత 24 గంటల్లో 2,506 మంది ఆస్పత్రుల్లో చేరారని వివరించారు.

ఉచిత టీకాకు రూ.1,600 కోట్ల వ్యయం: మంత్రి ఆళ్ల నాని
కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్రంలో 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు వారికి ఉచితంగా కోవిడ్‌ వాక్సిన్‌ ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్‌ నిర్ణయం తీసుకున్నారని ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.1,600 కోట్లు ఖర్చు చేయనుందని చెప్పారు. సీఎం సమీక్ష అనంతరం మంత్రి నాని మీడియాతో మాట్లాడారు. శనివారం రాత్రి నుంచి నైట్‌ కర్ఫ్యూ అమల్లోకి రానుందని తెలిపారు.

సీటీ స్కాన్‌ పేరుతో కొన్ని ఆస్పత్రులు దోపిడీకి పాల్పడటాన్ని ముఖ్యమంత్రి తీవ్రంగా పరిగణించినట్లు వెల్లడించారు. ఇందుకు రూ.2,500 ధరగా నిర్ణయించామని,  ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల కంటే ఎక్కువ వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారని తెలిపారు. ఇప్పటికే కొన్ని ఆస్పత్రులపై చర్యలు తీసుకున్నామని, ఇది నిరంతరం కొనసాగుతుందన్నారు. విపత్కర పరిస్థితుల్లో దోపిడీకి పాల్పడవద్దని ఆస్పత్రులకు విజ్ఞప్తి చేశారు.  కళ్యాణ మండపాలను కోవిడ్‌ కేర్‌ సెంటర్లుగా మార్చాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. 

– సీఎం సమీక్షలో మంత్రులు బొత్స సత్యనారాయణ, కె.కన్నబాబు, మేకతోటి సుచరిత, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, కోవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ స్పెషల్‌ ఆఫీసర్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, ఉన్నత విద్యా శాఖ స్పెషల్‌ సీఎస్‌ సతీష్‌చంద్ర, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు