పశుపోషకులకు కొండంత భరోసా

19 Feb, 2024 04:33 IST|Sakshi

నాణ్యమైన పశువుల దాణా సరఫరా లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు 

పశుపోషణ ఖర్చు తగ్గించి లాభాల దిశగా పాడి రంగం 

పకడ్బందీగా ఏపీ పశు దాణా చట్టం–2020 అమలు 

దీని పరిధిలోకి దాణా తయారీ, అమ్మకం, సరఫరా 

నిర్దేశిత ధరలకే కల్తీ లేని     నాణ్యమైన దాణా 

1,680 మందికి లైసెన్సులు జారీ 

రాష్ట్రవ్యాప్తంగా నాసిరకం తయారీదారులపై ఉక్కుపాదం

సాక్షి, అమరావతి: నాణ్యమైన దాణాను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా పశుపోషకులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. పశు పోషణ ఖర్చును భారీగా తగ్గించి.. పాడిరంగాన్ని లాభాల బాట పట్టించడమే లక్ష్యంగా ఏపీ పశు దాణా చట్టం –2020 తీసుకొచ్చింది. దీని పరిధిలోకి దాణా తయారీ, సరఫరా, అమ్మకం కార్యకలాపాలన్నింటినీ తెచ్చింది.

అంతేకాకుండా పాడి పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్లపెంపకందార్లకు నాణ్యతా ప్రమాణాలు కలిగిన.. కల్తీలేని దాణా, ఖనిజ లవణ మిశ్రమాన్ని నిర్దేశించిన ధరలకు అందించేలా చర్యలు చేపట్టింది.

ఇప్పటికే 1,680 మంది తయారీదారులు, డిస్ట్రిబ్యూటర్లు, స్టాకిస్ట్‌లకు ఈ చట్టం కింద లైసెన్స్‌లు జారీ చేసింది. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తూ నాసిరకం దాణా తయారీ, విక్రయదారులపై ఉక్కుపాదం మోపుతోంది. లైసెన్సుల జారీ, శాంపిల్స్‌ తనిఖీల ద్వారా ఇప్పటివరకు రూ.5.25 కోట్లు వసూలు చేసింది. 

పశువుల ఆహార అవసరాలకే 70 శాతం ఖర్చు 
రాష్ట్రంలో 46 లక్షల ఆవులు, 62.19 లక్షల గేదెలు, 1.76 లక్షల గొర్రెలు, 55 లక్షల మేకలు, 10.78 లక్షల పౌల్ట్రీ సంపద ఉంది. మూగజీవాలకు ఏటా 65 లక్షల మెట్రిక్‌ టన్నుల పశుగ్రాసం అవసరం కాగా ఏటా సగటున 70.92 లక్షల మెట్రిక్‌ టన్నులు ఉత్పత్తి అవుతోందని అంచనా. పశుపోషణ కోసం చేసే ఖర్చులో 70 శాతం వాటి ఆహార అవసరాల కోసమే ఉంటోంది. గతంలో నాణ్యత విషయంలో దాణా తయారీదారులు గోప్యత పాటించడం పశుపోషకులకు ఆశనిపాతంగా ఉండేది.

దాణాలో.. తేమ, ముడి మాంసకృత్తులు, ముడి కొవ్వు పదార్థాలు, ముడి పీచు పదార్థాలు, ఖనిజ లవణాలు, విటమిన్లు ఉంటాయి. ఇలా తయారైన దాణాను అధిక మోతాదులో వినియోగిస్తే తప్ప ఆశించిన స్థాయిలో ఉత్పాదన వచ్చేది కాదు. ముడి మాంసకృత్తులను పెంచడానికి కొంతమంది తయారీదారులు చట్టవిరుద్ధమైన పనులు చేసేవారు.

దీంతో పెట్టుబడి భారం పెరగడంతోపాటు నాణ్యమైన పాల ఉత్పత్తి రాక పశుపోషకులు ఆర్థికంగా నష్టపోయేవారు. మరోవైపు ఆరోగ్యవంతమైన పశువులు సైతం దీర్ఘకాలిక రోగాల బారిన పడేవి. ఈ పరిస్థితికి చెక్‌ పెట్టేందుకే ప్రభుత్వం ఏపీ పశు దాణా చట్టం తెచ్చింది. ఈ చట్టం 2021 సెప్టెంబర్‌ 1 నుంచి అమల్లోకి వచ్చింది.  

చట్టం అమలుకు ప్రత్యేక కమిటీలు 
పశు దాణా చట్టం అమలు కోసం ప్రత్యేకంగా పశుదాణా నాణ్యత, నియంత్రణ కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ‘కంట్రోలింగ్‌ అథారిటీ, కలెక్టర్, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారుల నేతృత్వంలో జిల్లా స్థాయి లైసెన్సింగ్‌ అథారిటీలను నియమించింది. పశుదాణా నాణ్యతను తనిఖీ చేసేందుకు స్థానిక పశువైద్యులకు యానిమల్‌ ఫీడ్‌ ఇన్‌స్పెక్టర్లుగా బాధ్యతలు అప్పగించింది. వీరు క్షేత్ర స్థాయి తనిఖీల్లో సేకరించిన శాంపిల్స్‌కు ప్రభుత్వం గుర్తించిన ప్రయోగశాలల్లో నాణ్యతా పరీక్షలు చేస్తున్నారు.

తయారీదారులు, డిస్ట్రిబ్యూటర్లు, రిటైల్‌ షాపులను అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు ఏపీ యానిమల్‌ ఫీడ్‌ యాక్ట్‌ ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ పేరిట ప్రత్యేకంగా ప్రభుత్వం సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసింది. దీని ద్వారా ఇప్పటివరకు 1,680 మంది దాణా తయారీదారులు, అమ్మకందార్లకు లైసెన్సులు ఇచ్చింది. ఈ చట్టం అమల్లోకి వచ్చాక గతంతో పోలిస్తే నాసిరకం దాణా తయారీ, సరఫరా, అమ్మకాలు తగ్గుముఖం పట్టాయని పశుపోషకులు చెబుతున్నారు. 

నాణ్యత లేని దాణా తయారుచేస్తే క్రిమినల్‌ కేసులు..
పశు దాణా చట్టం అమల్లోకి వచ్చాక అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతున్నాం. నాణ్యత లేని దాణా తయారీదారులు, నిరీ్ణత ప్రమాణాలు పాటించనివారు, తప్పుడు ప్రకటనలు ఇచ్చే కంపెనీలపై ఈ చట్టం కింద క్రిమినల్‌ కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. చట్టాన్ని ఉల్లంఘించినట్టు తేలితే కనీసం ఏడేళ్లు జైలుశిక్ష, తగిన జరిమానా పడుతుంది.  – డాక్టర్‌ అమరేంద్రకుమార్‌ డైరెక్టర్, పశుసంవర్ధక శాఖ

whatsapp channel

మరిన్ని వార్తలు