వేరియంట్లు కావవి..స్కేరియంట్లు

13 May, 2021 04:18 IST|Sakshi

వైరస్‌ రూపాంతరాలపై అనవసర రాద్ధాంతం 

ఎన్‌–440కే ప్రచారం ఈ కోవలోదే

తేటతెల్లం చేస్తున్న పరిశోధనలు 

భయాలొద్దంటున్న వైద్య నిపుణులు 

సాక్షి, అమరావతి: కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ తర్వాత ప్రతి ఇంటా వినిపిస్తున్న మాట ‘వేరియంట్‌’. శాస్త్రీయంగా దీని గురించి ప్రజలకు తెలియకపోయినా.. వారిని తీవ్రంగా భయపెడుతోంది. అందుకే దీన్ని అమెరికన్‌ శాస్త్రవేత్తలు ‘స్కేరియంట్స్‌’ (భయపెట్టేవి)గా కొట్టిపారేస్తున్నారు. భారతీయ వైద్య నిపుణులు సైతం వేరియంట్స్‌ గురించి అతిగా ఆలోచించొద్దని సూచిస్తున్నారు. ప్రధాన వైరస్‌ రూపాంతరం వల్ల మారే వివిధ ఆకృతులన్నీ విభిన్న ప్రభావాలు చూపిస్తాయనే ఆందోళనకు శాస్త్రీయత లేదని చెబుతున్నారు. ఉదాహరణకు కర్నూలు కేంద్రంగా పుట్టిందని ప్రచారం చేస్తున్న ‘ఎన్‌–440కే’ వేరియంట్‌ ప్రమాదకరమైనదని చెప్పడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాల్లేవు. దీనిపై పరిశోధనలు చేసేలోపే ఆ వేరియంట్‌ మాయమైంది. చాలా వేరియంట్స్‌ ఇలాగే ఉంటాయని వెల్లూరుకు చెందిన క్రిస్టియన్‌ వైద్య కళాశాల క్లినికల్‌ వైరాలజీ ప్రొఫెసర్‌ టి.జాకబ్‌జాన్‌ తెలిపారు.  

ఒకే వైరస్‌.. రూపాలే వేరు 
ఏ వైరస్‌ అయినా విస్తరించే కొద్దీ రకరకాలుగా ఉత్పరివర్తనం చెందుతుంది. ప్రతి పరిణామాన్ని గుర్తించి.. దానికి ఓ కోడ్‌ ఇవ్వడం జన్యు శాస్త్ర పరిశీలనలో భాగమంటున్నారు నిపుణులు. నిజానికి కరోనాకు సంబంధించి ఇంతవరకూ విస్తృతంగా ల్యాబొరేటరీ పరిశోధనలు పూర్తి చేసుకున్నవి మూడే. యూకేలో 2020 సెప్టెంబర్‌లో బ్రెజిల్‌ వేరియంట్‌ పి–1 గుర్తించారు. అక్టోబర్‌లో దక్షిణాఫ్రికా, డిసెంబర్‌లో బ్రెజిల్‌ వేరియంట్స్‌పై శాస్త్రీయ పరిశోధనలు జరిగాయి. వీటినుంచి పుట్టుకొచ్చిన వేరియంట్స్‌కు అనేక రకాలుగా కోడింగ్‌ ఇచ్చారు. వేరియంట్స్‌ ఎన్నయినా మూలం ఒకటే. యూకే వేరియంట్స్‌ శాఖోపశాఖలే వేరియంట్స్‌గా భారత్‌ను వణికిస్తోందని వైద్యులంటున్నారు. మూలం ఒకటే కాబట్టి, వేరియంట్‌ ఏదైనా వ్యాక్సిన్‌ అన్నింటినీ అడ్డుకుంటుందని భారత వైద్యమండలి స్పష్టం చేస్తోంది. ఏ వేషం వేసినా డీఎన్‌ఏ ద్వారా వ్యక్తిని గుర్తించి మందు ఇచ్చినట్టే కరోనాకు చెక్‌ పెట్టేందుకు వైద్య పరిశోధనలు సరిపోతాయని తెలిపారు. ఈ దిశగానే ఇప్పటికే అనేక మందులు అందుబాటులోకి వస్తున్నాయని వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ కూడా స్పష్టం చేస్తోంది.

ఆందోళన అనవసరం 
జన్యు మార్పిడి వల్ల పుట్టుకొచ్చే రూపాంతరాల గురించి ప్రజలు అతిగా ఆలోచించకపోవడమే మంచిది. ప్రధాన వైరస్‌ను గుర్తించి వైద్యం చేస్తున్నప్పుడు, కట్టడికి వ్యాక్సిన్‌పై విస్తృత పరిశోధనలతో ముందుకెళ్తున్నప్పుడు ఏ శాస్త్రీయతా లేని వేరియంట్స్‌ గురించి ఆందోళన అనవసరం.  
    – ముఖర్జీ, హృద్రోగ నిపుణులు 

అనవసర భయమే 
వేరియంట్స్‌ అంటే అసలు వైరస్‌ బిడ్డలే. కాకపోతే వీటి వేషం మారుతుందంతే. వైరస్‌ మ్యుటేషన్‌ చెంది, స్పైక్స్‌ బయటకు కన్పిస్తాయి. ఈ స్పైక్స్‌ ప్రొటీన్సే. అమినో ఆమ్లాన్నే ప్రొటీన్‌ అంటారు. ఏది ఉండకూడదు.. ఏది ఉండాలనేది జెనెటిక్‌ కోడ్‌ నిర్దేశిస్తుంది. కోడ్‌ మారితే అమినో ఆమ్లం మారుతుంది. ఫలితంగా ప్రోటీన్‌ ఆకృతి మారుతుంది. వైరస్‌ రకరకాల ఆకృతి తీసుకుంటుంది. ఇది ఏ రూపంలో ఉన్నా గుర్తించే ల్యా»ొరేటరీలు అభివృద్ధి చెబుతున్నాయి. కాబట్టి ఇదంతా అనవసర భయమే. 
    – ప్రవీణ్‌కుమార్, మైక్రో బయాలజిస్ట్, విజయవాడ   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు