104 Medical Helpline: 104కు భారీ స్పందన

29 Apr, 2021 03:29 IST|Sakshi

12 రోజుల్లో రికార్డు స్థాయిలో 52,325 మంది ఫోన్‌

వారందరి సమస్యలు తీర్చిన వైద్య సిబ్బంది

కోవిడ్‌ టెస్టుల నుంచి చికిత్స, వ్యాక్సినేషన్‌ వరకు సమాధానాలు

కాల్‌ సెంటర్‌లో మూడు షిఫ్టుల్లో 21 మంది డాక్టర్లు

టెలీ కన్సల్టేషన్‌ లింకులో మరో 2,243 మంది వైద్యులు  

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కోవిడ్‌కు సంబంధించి సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యలకు ఒక్క ఫోన్‌ పలకరింపుతో పరిష్కారం చూపుతున్న 104 కాల్‌ సెంటర్‌ ఇప్పుడు సంజీవనిలా అయింది. ఫోన్‌ చేయగానే బాధితుడికి ఏం కావాలో అడిగి పరిష్కరిస్తున్నారు. కోవిడ్‌ టెస్టులు ఎక్కడ చేస్తున్నారు? కోవిడ్‌ చికిత్సకు అనుమతులు ఉన్న ఆస్పత్రులు ఎక్కడున్నాయి? ఏ ఆస్పత్రుల్లో పడకలున్నాయి? ఎక్కడ ఆక్సిజన్‌ లభ్యత ఉంది? వ్యాక్సిన్‌ సెంటర్లు ఎక్కడ ఉన్నాయి? ఇలాంటి సమాచారం కోసం ఎక్కువ మంది 104కు ఫోన్‌ చేస్తున్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి 27వ తేదీ రాత్రి వరకూ 52,325 ఫోన్‌కాల్స్‌ వచ్చాయి.

మూడు షిఫ్టుల్లో కాల్‌సెంటర్‌
ప్రస్తుతం గన్నవరంలో ఏర్పాటు చేసిన 104 కాల్‌ సెంటర్‌ 3 షిఫ్టుల్లో 300 మందికి పైగా ఎగ్జిక్యూటివ్‌లతో పనిచేస్తోంది. 21 మంది డాక్టర్లు ఇక్కడ పనిచేస్తున్నారు. వీళ్లు కాకుండా 2,243 మంది వైద్యులు టెలీ కన్సల్టెంట్‌లుగా 104 కాల్‌సెంటర్‌కు అనుసంధానమయి ఉన్నారు. కాల్‌సెంటర్‌లో పనిచేస్తున్న వైద్యులు బిజీగా ఉంటే వెంటనే ఆ కాల్స్‌ను కన్సల్టెంట్‌ డాక్టర్‌కు డైవర్ట్‌ చేస్తారు. దీనివల్ల ఏ బాధితుడికీ ఇబ్బంది లేకుండా వెంటనే సమాధానం లభిస్తోంది. రోజుకు సగటున 7వేలకు పైగా కాల్స్‌ వస్తున్నాయి. 104 కాల్‌ సెంటర్‌ ద్వారా గడిచిన 12 రోజుల్లో 6,732 మందికి పడకలు లభించాయి.

కోవిడ్‌ సమస్యలన్నిటికీ ఇక్కడే పరిష్కారం..
రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్‌ సమస్యతో ఎవరు ఫోన్‌ చేసినా 104 కాల్‌ సెంటర్‌ నుంచి పరిష్కారం అయ్యేలా చేస్తున్నాం. ఎక్కడా సమాచారం రాదు అనుకున్నది కూడా 104కు చేస్తే లభిస్తుంది అనేలా చేశాం. సీఎం జగన్‌ ఆదేశాల మేరకు టెలీ కన్సల్టేషన్‌ డాక్టర్లను భారీగా పెంచాం. ప్రధానంగా పడకల కేటాయింపుపై దృష్టి సారించాం.
– బాబు ఎ, 104 కాల్‌ సెంటర్‌ పర్యవేక్షణాధికారి
   

మరిన్ని వార్తలు