ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉంటాం 

24 Feb, 2024 03:42 IST|Sakshi

 ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉపసంఘం చర్చ  

సాక్షి, అమరావతి : ఉద్యోగులకు సంబంధించిన అంశాలను సానుకూలంగా పరిష్కరిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ హామీ ఇచ్చారు. వెలగపూడి సచివాలయంలో శుక్రవారం ఉద్యోగ సంఘాల నాయకులతో మంత్రివర్గ ఉపసంఘం సభ్యులైన బొత్స, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, మరో ప్రభుత్వ సలహాదారు(ఉద్యోగుల సంక్షేమం) చంద్రశేఖర్‌రెడ్డి సమావేశమై పలు అంశాలపై చర్చించారు. అనంతరం బొత్స మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులు ఆందోళనను విరమించుకోవాలని కోరగా.. వారు అంగీకరించారని తెలిపారు.

ఇవ్వాల్సిన సమయంలోనే పీఆర్సీని ప్రకటిస్తామన్నారు. మధ్యంతరం భృతి (ఐఆర్‌) ఇవ్వడం ప్రభుత్వ విధానం కాదని, పీఆర్సీ ఆలస్యమైతే ఐఆర్‌ ఇస్తారని, ఇవ్వాల్సిన సమయంలోనే పీఆర్సీ ఇస్తున్నప్పుడు ఐఆర్‌ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక రెండేళ్లు కోవిడ్‌ ప్రభావంతో పీఆర్సీ ఆలస్యమైందని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పారు. మార్చిలోపు ఉద్యోగులకు సంబంధించిన బకాయిలను చెల్లిస్తామన్నారు.

క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌పై వచ్చి న అభ్యర్థనను సీఎం జగన్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఉద్యోగ సంఘాల నాయకులతో జరిగిన సమావేశంలో కొత్త పీఆర్సీకి సంబంధించిన ఫిట్‌మెంట్, డీఏ, జీపీఎఫ్, ఎస్‌ఎల్‌ఎస్‌ బిల్లుల చెల్లింపు వంటి పలు అంశాలపై చర్చించారు. సమావేశంలో ప్రభుత్వ సర్విసెస్‌ శాఖ కార్యదర్శి పోలా భాస్కర్, ఏపీ ఎన్జీవో అసోసియేషన్‌ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, రెవెన్యూ సర్విసెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.  

సెర్ప్‌ ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉప సంఘం భేటీ 
అలాగే, సెర్ప్‌ ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉప సంఘం భేటీ అయింది. జాయింట్‌ స్టాప్‌ కౌన్సిల్‌ సమావేశం అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఉద్యోగ సలహాదారులు ఎన్‌.చంద్రశేఖరరెడ్డి, సీఎస్‌ జవహర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సచివాలయంలో ఫైనాన్స్‌ మినిస్టర్‌ సమావేశపు హాల్లో ఈ సమావేశం నిర్వహించారు.

గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఉద్యోగుల క్రమబద్దికరణకు సంబంధించిన క్యాడర్‌ ఫిక్సేషన్, పేపిక్సేషన్‌ అంశాన్ని చర్చించారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్‌ గౌరవ స్పెషల్‌ సీఎస్‌ బి.రాజశేఖర్, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అడిషనల్‌ సీఈవో విజయకుమారి, అడ్మిన్‌ డైరెక్టర్‌ సుశీల, సెర్ప్‌ ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు టి.ధనంజయరెడ్డి, కె.నాగరాజు, జె.శోభన్‌బాబు ఎంఎస్‌ మూర్తి, అబ్దుల్‌ రెహమాన్, ఆదయ్య, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

whatsapp channel

మరిన్ని వార్తలు