కరోనా కేసుల్లో 'డెల్టా'వే ఎక్కువ

15 Jun, 2021 03:50 IST|Sakshi

20 శాతం కేసులు వాటి నుంచే.. 

గ్లోబల్‌ మ్యూటెంట్‌గా పేరున్న బి.1.6.17.1 కేసులు కూడా ఎక్కువే..

యూకే వేరియంట్‌ బి.1.1.7ది కూడా ప్రభావవంతమైన పాత్రే

రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి మొత్తం 875 శాంపిళ్ల సేకరణ

శాంపిళ్లను పరిశీలించి తేల్చిన సీసీఎంబీ, ఎన్‌ఐవై

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తిలో ఎక్కువగా డబుల్‌ మ్యూటెంట్లదే కీలకపాత్ర అని తాజా అధ్యయనంలో తేలింది. మొదటి వేవ్‌లో వచ్చిన వేరియంట్‌ల కంటే సెకండ్‌ వేవ్‌లో కొత్తగా వచ్చినవి బాగా వ్యాప్తి చెందినట్టు స్పష్టమైంది. రాష్ట్రంలో జిల్లాలవారీగా జూన్‌ 10 వరకు వచ్చిన శాంపిళ్లను జీనోమిక్‌ సీక్వెన్సింగ్‌ పరిశీలన కోసం సీసీఎంబీ (సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ), ఎన్‌ఐవీ (నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ) ల్యాబ్‌లకు పంపారు. ఇందులో ఏ మ్యూటెంట్‌లు ఎంతగా పనిచేశాయో తేలింది. ప్రధానంగా సెకండ్‌ వేవ్‌లో మే నెలకు సంబంధించి డబుల్‌ మ్యూటెంట్‌ల పాత్ర బాగా ఉన్నట్టు స్పష్టమైంది. అలాగే తాజాగా చెప్పుకుంటున్న డెల్టా వేరియంట్‌ కూడా మన రాష్ట్రంలో తీవ్ర ప్రభావమే చూపింది.

బ్రెజిల్‌ వేరియంట్‌ నామమాత్రమే..
ఆయా జిల్లాలో పాజిటివ్‌ కేసుల శాతాన్ని బట్టి.. ఎక్కువగా చిత్తూరు జిల్లా నుంచి 268 శాంపిళ్లు.. తూర్పుగోదావరి జిల్లా నుంచి 115 శాంపిళ్లు సేకరించారు. ప్రభావం అంతగా లేని గుంటూరు జిల్లా నుంచి అత్యల్పంగా 5 నమూనాలు మాత్రమే తీసుకున్నారు. ఇలా అన్ని జిల్లాల నుంచి సేకరించిన 875 శాంపిళ్లకుగానూ 280 పాజిటివ్‌ కేసుల్లో అత్యంత ప్రమాదకారిగా చెప్పుకుంటున్న డెల్టా వేరియంట్‌ (బి.1.6.17.2) ప్రభావమే కనిపించింది. రాష్ట్రవ్యాప్తంగా 20 శాతం కరోనా కేసులు డెల్టావేనని సీసీఎంబీ, ఎన్‌ఐవై పరిశీలనలో తేలింది. మరో గ్లోబల్‌ మ్యుటెంట్‌గా గుర్తింపు పొందిన బి.1.6.17.1 వేరియంట్‌ సోకినవారు 154 మంది ఉన్నారు. యూకే వేరియంట్‌ 5 శాతం మందిలో సోకింది. పాజిటివ్‌ కేసుల్లో ఈ మూడు వేరియంట్‌లది 31 శాతం కాగా.. మిగతా రకాల వేరియంట్‌లు అన్నీ కలిపి 363 మందిలో సోకాయి. దీన్ని బట్టి చూస్తే కరోనా వ్యాప్తిలో డెల్టా వేరియంట్‌ కీలకపాత్ర పోషించినట్టు వైద్య నిపుణులు చెబుతున్నారు. బ్రెజిల్‌ వేరియంట్‌ ప్రభావం నామమాత్రంగా మాత్రమే ఉన్నట్టు తేలింది.

మరిన్ని వార్తలు