ఏపీలో కొత్త స్ట్రెయిన్ ఆనవాళ్లు లేవు

24 Dec, 2020 14:57 IST|Sakshi

సాక్షి, అమరావతి: కరోనా సెకండ్‌ వేవ్‌ హెచ్చరికలతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. బ్రిటన్‌లో కరోనా కొత్త రకం వైరస్‌ విజృంభణ నేపథ్యంలో విమాన ప్రయాణికుల రాకపోకలపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయాల్లోనే ఆర్‌టీపీఆర్‌ పరీక్షలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. (చదవండి: నెలరోజుల్లో బ్రిటన్‌ ‌టూ తెలంగాణ 3వేల మంది..)

ప్రజలు భయాందోళన చెందొద్దు
వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని గురువారం మీడియాతో మాట్లాడుతూ... ఏపీలో ప్రభుత్వం నిర్వహించిన పరీక్షల్లో కరోనా కొత్త స్ట్రెయిన్ ఆనవాళ్లు లభ్యం కాలేదని చెప్పారు. యూకే నుంచి రాజమండ్రి వచ్చిన మహిళకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని, ఆమె కుమారుడికి పరీక్షలు జరపగా నెగెటివ్‌ వచ్చినట్లు తెలిపారు. ఆమె ఫస్ట్‌ క్లాస్‌ బోగీలో వచ్చినందున మిగిలిన వారితో కాంటాక్టయ్యే సందర్భాలు తక్కువేనని స్పష్టం చేశారు. ఆమెకు మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. మహిళ నమూనాలు సేకరించి పుణె ల్యాబ్‌కు పంపామని, ఫలితాలు రావాల్సి ఉందని తెలిపారు. కరోనా కొత్త స్ట్రెయిన్ విషయంలో ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నందున ప్రజలెవరూ భయాందోళనకు గురి కావొద్దని సూచించారు. పొరుగు రాష్ట్రాల్లోని ఎయిర్‌పోర్టుల్లో హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. (చదవండి: కర్ఫ్యూతో మళ్లీ రోడ్డున పడతాం!)

మరిన్ని వార్తలు