దేవదాయ శాఖలో 70 ఇంజనీరింగ్‌ పోస్టులకు నోటిఫికేషన్‌

26 Dec, 2023 04:47 IST|Sakshi

35 ఏఈఈ (సివిల్‌), 5 ఏఈఈ (ఎలక్ట్రికల్‌), 30 టెక్నికల్‌ అసిస్టెంట్‌ (సివిల్‌) పోస్టుల భర్తీ

కాంట్రాక్టు పద్ధతిలో నియామకం.. 30 వరకు దరఖాస్తుల స్వీకరణ 

రాత పరీక్ష ద్వారా ఎంపిక 

ఎంపిక బాధ్యతలు ఇంజనీరింగ్‌ స్టాఫ్‌ కాలేజీ ఆఫ్‌ ఇండియాకు 

ప్రస్తుతం దేవదాయ శాఖలో పెద్ద ఎత్తున పనులు 

రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఆలయాల పునరుద్ధరణ, కొత్తవి నిర్మాణం 

పలు ఆలయాల వద్ద అభివృద్ధి పనులు.. కొత్తగా ఇంజనీరింగ్‌ సిబ్బంది నియామకం

సాక్షి, అమరావతి: దేవదాయ శాఖలో 70 ఇంజనీరింగ్‌ పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలైంది. 35 ఏఈఈ (సివిల్‌), 5 ఏఈఈ (ఎలక్ట్రికల్‌), మరో 30 టెక్నికల్‌ అసిస్టెంట్‌ (సివిల్‌) పోస్టు­లు కాంట్రాక్టు విధానంలో భర్తీకి దేవదాయ శాఖ ఇప్పటికే నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నెల 30 వరకు అభ్యర్థుల నుంచి దర­ఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నియామక ప్రక్రి­య మొత్తాన్ని ప్రభుత్వం ప్రముఖ సంస్థ ‘ఇంజనీరింగ్‌ స్టాఫ్‌ కాలేజి ఆఫ్‌ ఇండియా’కు అప్పగించింది.

ఏఈ­ఈ పోస్టులకు సంబంధిత కేటగిరిలో బీఈ, బీటెక్‌ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. టెక్నికల్‌ అసిస్టెంట్ల పోస్టులకు ఇంజనీరింగ్‌ డిప్లొ­మా పాసైన వారు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ కేటగిరి రిజర్వేషన్లను అమలు చేయడంతో పాటు రాత పరీక్ష ద్వారా ఈ పోస్టులు భర్తీ చేస్తారు. రాత పరీక్ష వంద మార్కులకు ఉంటుంది.

80 మార్కులకు సంబంధిత ఇంజనీరింగ్‌ అంశాలపైన, పది మార్కులకు ఇంగ్లిష్‌ ప్రావీణ్యం, మరో పది మార్కులకు జనరల్‌ నాలెడ్జితో కూడిన మర్టీపుల్‌ ఛాయిస్‌ విధానంలో ప్రశ్నలు ఉంటాయని దేవదాయ శాఖ ఆ నోటిఫికేషన్‌లో పేర్కొంది. దేవదా­య శాఖ పరిధిలో గతంలో ఎప్పుడూ లేని విధంగా కొత్త ఆలయాల నిర్మాణంతో పాటు పురా­తన ఆలయాల పునరి్నర్మాణం పనులు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. కామన్‌ గుడ్‌ ఫండ్‌ (సీజీఎఫ్‌) పథకం ద్వారా ప్రభుత్వం ఈ పను­లు చేపడుతోంది. రూ. 450 కోట్లకు పైగా పను­లకు అనుమతులు తెలిపింది.

అందులో రూ. 250 కోట్లకు పైగా పనులు జరుగుతున్నాయి. వీటి­కి తోడు విజయవాడ దుర్గగుడి, శ్రీశైలం, కాణిపాకం తదితర ఆల­యాల్లో దాదాపు రూ. 350 కోట్ల విలువైన అభివృద్ధి పనులు సాగుతున్నాయి. మరోపక్క టీటీడీ శ్రీవాణి ట్రస్టు ద్వారా దేవదాయ శాఖ ఆధ్వర్యంలోనే రాష్ట్రమంతటా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మ­త్స్యకార కాలనీల్లో రూ. 300 కోట్ల ఖర్చు­తో 3 వేల ఆలయాల నిర్మాణం జరుగుతోంది. మ­రో రూ. 50 కోట్ల టీటీడీ ఆర్థిక సహాయంతో  రాష్ట్రమంతటా 120కి పైగా కొత్త ఆలయాల నిర్మాణం సాగుతోంది.

మరోవైపు దేవదాయ శాఖ పరిధిలోని ప్రముఖ ఆలయాలన్నింటికీ వచ్చే 35 ఏళ్ల దాకా పెరిగే ఒత్తిడిని దృష్టిలో పెట్టుకొని ఆలయాల వారీగా కొత్త మాస్టర్‌ ప్లాన్లను రూపొందించింది. వాటికి అనుగుణంగా ఆ ఆలయాల్లో అభివృద్ధి పను­లు చేప­డుతున్నారు.  అత్యవసరంగా కాంట్రాక్టు వి­ధా­నంలో ఇంజనీరింగ్‌ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపడుతున్నట్టు దేవదాయ శాఖ పేర్కొంది.

పూర్తి పారదర్శకంగా భర్తీ ప్రక్రియ 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో ప్రస్తుతం దేవదాయ శాఖ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో ఆలయాల నిర్మాణం జరుగుతోంది. ఈ పనులు వేగంగా పూర్తి చేసేందుకు కొత్తగా ఇంజనీరింగ్‌ సిబ్బందిని నియమిస్తున్నాం. నియామక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా, ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా ఉండేందుకు ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ ‘ఇంజనీరింగ్‌ స్టాఫ్‌ కాలేజీ ఆఫ్‌ ఇండియా’కు అప్పగించాం.  – కొట్టు సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి (దేవదాయ శాఖ)

>
మరిన్ని వార్తలు