అటవీ భూముల ఆక్రమణలను గుర్తించాలి

18 Feb, 2022 04:43 IST|Sakshi
మంత్రి వర్గ ఉప సంఘం సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన కృష్ణదాస్, బొత్స సత్యనారాయణ, చెరుకువాడ శ్రీరంగనాథరాజు

శాస్త్రీయ పద్ధతుల్లో వేగంగా భూముల రీ సర్వే 

ఈ ఏడాది చివరికి 11,501 గ్రామాల్లో పూర్తి లక్ష్యం 

జగనన్న శాశ్వత భూహక్కు–భూ రక్షపై కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీ

సాక్షి, అమరావతి: భూ వివాదాలకు తెర దించుతూ శాస్త్రీయ పద్ధతుల్లో చేపట్టిన సమగ్ర భూ సర్వేను వేగవంతం చేయాలని జగనన్న శాశ్వత భూహక్కు–భూరక్ష పథకంపై ఏర్పాటైన  కేబినెట్‌ సబ్‌ కమిటీ అధికారులకు సూచించింది. ప్రభుత్వ భూములు, అటవీ భూముల్లో ఆక్రమణలను గుర్తించేందుకు అవసరమైతే రెవెన్యూ, అటవీశాఖల సంయుక్త ఆధ్వర్యంలో సర్వే చేయాలని స్పష్టం చేశారు. తొలుత అటవీ భూముల సరిహద్దులను నిర్దిష్టంగా గుర్తించాలన్నారు. సబ్‌ కమిటీ గురువారం పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కార్యాలయంలో సమావేశమై పలు సూచనలు చేసింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్, మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం,  సీసీఎల్‌ఎ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ (మున్సిపల్‌) శ్రీలక్ష్మి, ప్రిన్సిపల్‌ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, సర్వే అండ్‌ సెటిల్‌ మెంట్‌ కమిషనర్‌ సిదార్ధ్‌ జైన్, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్, డైరెక్టర్‌ ఎం.ఎం.నాయక్, డీఎంజీ వెంకటరెడ్డి, డీటీసీపీ డైరెక్టర్‌ రాముడు తదితరులు పాల్గొన్నారు.  

కాపాడకుంటే పర్యావరణ సమస్యలు.. 
దేశంలో తొలిసారిగా అత్యంత శాస్త్రీయ విధానాన్ని అనుసరిస్తూ తొలిదశలో 51 గ్రామాల్లో సమగ్ర భూ సర్వే పూర్తి కాగా ఈ ఏడాది చివరి నాటికి 11,501 గ్రామాల్లో పూర్తి చేసే లక్ష్యంతో కృషి చేయాలని కేబినెట్‌ సబ్‌ కమిటీ సూచించిది. అటవీశాఖ భూములు పెద్ద ఎత్తున అన్యాక్రాంతం, నకిలీ ధ్రువపత్రాలతో ఆక్రమించుకున్నట్లు ఆరోపణలున్నాయన్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకున్న సందర్భాల్లో న్యాయస్థానాల్లో కేసులు దాఖలు చేస్తున్నారని చెప్పారు. అటవీ భూములను కాపాడుకోకుంటే పర్యావరణ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. వీటిని నివారించేందుకు శాస్త్రీయంగా ఆక్రమణలను గుర్తించాలన్నారు.  

సర్వే పనులు ఇలా.. 
రాష్ట్ర ప్రభుత్వం రూ.1,000 కోట్ల వ్యయంతో 4,500 సర్వే బృందాలతో పథకాన్ని అమలు చేస్తున్నట్లు సబ్‌ కమిటీ పేర్కొంది. ఇప్పటికే 37 గ్రామాల్లో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్‌ సేవలు ప్రారంభమైనట్లు తెలిపింది. 70 కార్స్‌ బేస్‌ స్టేషన్లు, 2 వేల రోవర్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సమగ్ర భూసర్వే జరుగుతోందన్నారు. 2023 జూన్‌ నాటికి దశలవారీగా రీసర్వే పూర్తి కావాలన్న లక్ష్యం మేరకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఇప్పటివరకు 1,287 గ్రౌండ్‌ ట్రూతింగ్‌ లో భాగంగా 1,287 ఆవాస ప్రాంతాల్లో డ్రోన్‌ సర్వే పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. 606 గ్రామాల్లో తొలివిడత మ్యాపింగ్, 515 హ్యాబిటేషన్లలో గ్రౌండ్‌ ట్రూతింగ్‌ ప్రక్రియ పూర్తి చేశామన్నారు. 161 గ్రామాల్లో గ్రౌండ్‌ ట్రూతింగ్‌ వాలిడేషన్‌ ముగిసింది. అన్ని శాఖల సమన్వయంతో రీసర్వేను లక్ష్యం మేరకు పూర్తి చేసేలా చర్యలు చేపట్టామన్నారు.   

మరిన్ని వార్తలు