యుద్ధప్రాతిపదికన ఆక్సిజన్‌ పునరుద్ధరణ 

27 Apr, 2021 04:42 IST|Sakshi
విశాఖ నుంచి వచ్చిన ఆక్సిజన్‌ ట్యాంకర్‌ నుంచి ఆక్సిజన్‌ నింపుతున్న సిబ్బంది

విజయనగరం జిల్లా కేంద్రాస్పత్రిలో ఆక్సిజన్‌ సరఫరాకు అంతరాయం

పైప్‌లైన్‌ లీకవడంతో 17 మందిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించిన అధికారులు 

పరిస్థితిని సమీక్షించిన ఉప ముఖ్యమంత్రులు పుష్పశ్రీవాణి, ఆళ్ల నాని 

సాక్షి ప్రతినిధి, విజయనగరం/విజయనగరం ఫోర్ట్‌: విజయనగరం జిల్లా కేంద్రాస్పత్రిలో పైప్‌లైన్‌ లీకై కోవిడ్‌ రోగులకు ఆక్సిజన్‌ సరఫరాలో ఏర్పడిన అంతరాయాన్ని అధికారులు యుద్ధప్రాతిపదికన సరిచేశారు. 17 మంది కోవిడ్‌ రోగులను హుటాహుటిన ప్రైవేటు ఆస్పత్రికి తరలించి వెంటనే చికిత్స అందేలా చేయడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. తమకు ఆక్సిజన్‌ అందడం లేదని కోవిడ్‌ రోగులు అక్కడి సిబ్బందికి చెప్పడంతో వారు ఉన్నతాధికారులకు తెలియజేశారు. దీంతో వెంటనే జిల్లా కలెక్టర్‌ ఎం.హరిజవహర్‌లాల్, జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.మహేశ్‌కుమార్, కోవిడ్‌ ప్రత్యేకాధికారి సత్యనారాయణ కేంద్రాస్పత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.  

అప్పటికప్పుడే మరమ్మతులు 
ఆస్పత్రిలో 2 వేల కిలోలీటర్ల సామర్థ్యం గల ఆక్సిజన్‌ ట్యాంక్‌ ఉంది. దీని పైప్‌లైన్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఆక్సిజన్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో అధికార యంత్రాంగం యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు చేయించి సరఫరాను పునరుద్ధరించింది. విశాఖ నుంచి ఆక్సిజన్‌ ట్యాంకర్‌ తెప్పించి ట్యాంక్‌ను నిండా నింపారు. ప్రస్తుతం ఆక్సిజన్‌ సరఫరా పూర్తి స్థాయిలో జరుగుతోంది. ఘటన జరిగిన సమయంలో కేంద్రాస్పత్రిలో 290 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. కాగా, కోవిడ్‌ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ లీకై ఐదుగురు మరణించారని, కాసేపటికి 11 మంది మృతి చెందారని పలు చానళ్లు అత్యుత్సాహం చూపాయి.

ప్రైవేటు ఆస్పత్రికి తరలించాం 
విషయం తెలియగానే వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని దృష్టికి తీసుకువెళ్లాం. అవసరమైతే రోగులను విశాఖ తరలించాల్సిందిగా ఆయన సూచించారు. ఐసీయూలో ఉన్న వారిని విజయనగరంలోనే ప్రైవేటు ఆస్పత్రికి తరలించాం.            
–పుష్పశ్రీవాణి, ఉప ముఖ్యమంత్రి 

సకాలంలో చర్యలు తీసుకున్నాం 
తెల్లవారుజామున 3.30 గంటలకు ఆక్సిజన్‌ సరఫరాలో సమస్య ఏర్పడిందని ఫోన్‌ రాగానే ఆస్పత్రికి చేరుకున్నాం. ప్రైవేటు ఆస్పత్రుల నుంచి బల్క్‌గా ఆక్సిజన్‌ సిలిండర్లు తెప్పించి అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి ఆక్సిజన్‌ అందించాం. ఆక్సిజన్‌ అందకపోవడం వల్ల ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. 
– ఎం.హరిజవహర్‌లాల్, విజయనగరం జిల్లా కలెక్టర్‌ 

>
మరిన్ని వార్తలు