ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమివ్వండి

29 Apr, 2021 06:02 IST|Sakshi

గ్రామాల్లో శానిటేషన్, తాగునీటి సరఫరాకు అన్ని చర్యలూ చేపట్టండి

అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష  

సాక్షి, అమరావతి: కరోనా పరిస్థితుల నేపథ్యంలో గ్రామాల్లో ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమివ్వాలని అధికారులను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. అన్ని గ్రామాల్లో శానిటేషన్, రక్షిత మంచినీటి సరఫరాకు అన్ని చర్యలూ తీసుకోవాలని సూచించారు. సర్పంచ్‌లు, వార్డు సభ్యులను కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలని చెప్పారు. తాడేపల్లిలో బుధవారం అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో ఎక్కడా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులను మంత్రి ఆదేశించారు. ఇందుకు అవసరమైన నిధులను కూడా కేటాయించామని చెప్పారు.

రూ.1,486 కోట్ల ఖర్చుతో గ్రామాల్లో 1,944 కిలోమీటర్ల మేర చేపట్టిన రోడ్ల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. వైఎస్సార్‌ జలకళ పథకాన్ని మరింత వేగవంతం చేయాలని సూచించారు. బోర్‌వెల్‌ డ్రిల్లింగ్‌కు రూ.2,340 కోట్లు, పంపుసెట్లకు రూ.1,875 కోట్లు, విద్యుత్‌ పరికరాలకు రూ.1,500 కోట్ల మేర అంచనాలతో ఈ పనులు చేపడుతున్నట్టు తెలిపారు. సమావేశంలో పంచాయతీరాజ్‌ కమిషనర్‌ ఎం.గిరిజాశంకర్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ఎండీ సంపత్‌కుమార్, పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ ఈఎస్‌సీ సుబ్బారెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఎన్‌సీ కృష్ణారెడ్డి, వాటర్‌షెడ్స్‌ డైరెక్టర్‌ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు