ప్రభుత్వాస్పత్రిలో ప్రైవేటు దందా

29 Jul, 2020 07:03 IST|Sakshi
ఆసుపత్రి ప్రాంగణంలో కరోనా పరీక్షలకు వచ్చిన వ్యక్తి నుంచి డబ్బు వసూలు చేస్తున్న ప్రైవేటు వ్యక్తి

కరోనా పరీక్షకు రూ.2500

తాడిపత్రి ప్రభుత్వాస్పత్రిలో ప్రైవేట్‌ వ్యక్తుల హల్‌చల్‌

డబ్బులిస్తే త్వరగా పరీక్ష చేయిస్తామంటూ వసూళ్లు

తాడిపత్రి అర్బన్‌: రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్‌ నియంత్రణకు అలుపెరగని కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే  వేల రూపాయల విలువ చేసే కరోనా పరీక్షలను ప్రజలందరికీ దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా చేయిస్తోంది. అయితే కొంతమంది కేటుగాళ్లు కొత్త దందాకు తేరలేపి ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా పరీక్షల నిమిత్తం వచ్చిన వారి నుంచి డబ్బు వసూలు చేస్తూ నిలువునా దోచుకుంటున్నారు. తాడిపత్రి పట్టణ పరిధిలోని ఏరియా ఆసుపత్రిలో రోజూ  కరోనా వైరస్‌ పరీక్షల నిమిత్తం ప్రజల వద్ద నుంచి స్వాబ్‌ నమూనాలను అక్కడి వైద్యులు సేకరిస్తున్నారు. అయితే ఆసుపత్రిలో పెత్తనం చెలాయిస్తున్న కొంతమంది ప్రైవేటు వ్యక్తులు పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి వచ్చిన వారికి మాయ మాటలు చెప్పి వారి వద్ద నుంచి డబ్బు వసూలు చేస్తున్నారు.

మీకు వెంటనే పరీక్షలు చేయిస్తాం..
కరోనా పరీక్షల నిమిత్తం తాడిపత్రి ఏరియా ఆసుపత్రి వచ్చే ప్రజలను ప్రైవేటు వ్యక్తులు కలిసి ‘ఈ రోజు పరీక్షలకు చాలా మంది ఉన్నారు.. ఈ రోజు స్వాబ్‌ నమూనాలను తీసుకోవడం కష్టమే’ అంటూ భయపెడతారు. మాకు తెలిసిన వాళ్లు ఆసుపత్రిలో ఉన్నారు.. రూ.2500 ఇస్తే వెంటనే పరీక్షలు చేయిస్తామంటూ రోగుల వద్ద నుంచి డబ్బు వసూలు చేస్తున్నారు. ఇలాగే మంగళవారం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి కరోనా పరీక్ష నిమిత్తం వచ్చిన ఓ వృద్ధుడికి కరోనా పరీక్ష చేయిస్తామంటూ ఆయన వద్ద నుంచి ఆధార్‌ కార్డు, మొబైల్‌ నంబర్‌లను తీసుకుని మీ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయించాం.. ఇక మీకు పరీక్ష చేస్తారంటూ ఆయన వద్ద నుంచి రూ.2500 ఓ ప్రైవేటు వ్యక్తి తీసుకున్నారు. అయితే ఆ వృద్ధుడి నుంచి స్వాబ్‌ నమూనాను తీసుకోకపోవడంతో ఆయన సదురు ప్రైవేటు వ్యక్తిని ఫోన్‌లో సంప్రదించగా ఈ రోజు కుదరలేదు.. రేపు రండి కచ్చితంగా చేయిస్తామంటూ సమాధానం వచ్చింది. దీంతో చేసేదేమీ ఏమి లేక కరోనా పరీక్షలకు వచ్చిన వృద్ధుడు వెళ్లిపోయారు.(లాక్‌డౌన్‌ కష్టాల్లో రష్యన్‌ యువతి)

అందరికీ ఉచితంగానే చేస్తున్నాం
ప్రభుత్వం అందరికీ కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తోంది. కరోనా పరీక్షలకు సంబంధించి ప్రైవేటు వ్యక్తులు డబ్బులు వసూలు చేస్తున్న విషయం మా దృష్టికి రాలేదు. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజల వద్ద నుంచి డబ్బు వసూలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.– శ్రీనివాసులు రెడ్డి, కోవిడ్‌ వైద్యాధికారి, తాడిపత్రి 

మరిన్ని వార్తలు