ప్రసవాల్లో తిరుపతి బోధనాస్పత్రి టాప్‌

31 Jan, 2024 06:09 IST|Sakshi

ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు డీఎంఈ ఆస్పత్రుల్లో 83,493 ప్రసవాలు

అత్యధికంగా తిరుపతిలో  9,952 ప్రసవాలు 

లక్ష్య ఛేదనలో రాజమండ్రి జీజీహెచ్‌ ముందంజ

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని బోధనాస్పత్రుల ప్రసూతి సేవల్లో తిరుపతి మెటర్నిటీ ఆస్పత్రి మొదటి స్థానంలో నిలిచింది. గతేడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు అన్ని బోధనాస్పత్రుల్లో 83,493 ప్రసవాలు జరగ్గా.. అత్యధికంగా తిరుపతిలో 9,952 ప్రసవాలు చేశారు. 7,426 ప్రసవాలతో విజయవాడ జీజీహెచ్‌ రెండో స్థానంలో, 7,424 ప్రసవాలతో కర్నూలు జీజీహెచ్‌ మూడో స్థానంలో ఉన్నాయి. బోధనాస్పత్రుల్లో రోగుల సేవలను మరింత మెరుగుపరచడంతో పాటు ఎక్కువ మందికి సేవలందించేలా ప్రతి ఆస్పత్రికి లక్ష్యాలను నిర్దేశిస్తున్నారు.

ఇందులో భాగంగా ఆస్పత్రుల్లోని మెటర్నిటీ వార్డుల్లో పడకల సామర్థ్యం ఆధారంగా నిర్వహించాల్సిన ప్రసవాలపై లక్ష్యాలను నిర్దేశించారు. 2023–24వ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బోధనాస్పత్రుల్లో 1.08 లక్షల ప్రసవాలు నిర్వహించాలని లక్ష్యం పెట్టుకోగా.. ఇప్పటివరకు 77.3 శాతం ప్రసవాలు చేశారు. రాజమండ్రి జీజీహెచ్‌లో 2,063 ప్రసవాలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించగా.. 3,227 ప్రసవాలను నిర్వహించి లక్ష్య ఛేదనలో రాష్ట్రంలోనే ముందంజలో నిలిచింది. అలాగే 4,125 ప్రసవాలకు గాను 5,523 ప్రసవాలు నిర్వహించి లక్ష్య ఛేదనలో కడప జీజీహెచ్‌ రెండో స్థానంలో, 2,063కు గాను 2,683 ప్రసవాలతో మచిలీపట్నం జీజీహెచ్‌ మూడో స్థానంలో నిలిచాయి.   

మహిళలకు అండగా ప్రభుత్వం 
మాత, శిశు ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం.. మారుమూల గ్రామాల్లో ప్రసవ వేదనతో ఉన్న గర్భిణులను 108 అంబులెన్స్‌లలో సకాలంలో బోధనాస్పత్రులకు తరలిస్తోంది. విశ్రాంత సమయానికి రూ.5 వేలు చొప్పున ఆరోగ్య ఆసరా అందిస్తోంది. అంతేకాకుండా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన తల్లీ, బిడ్డలను.. వైఎస్సార్‌ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాల్లో క్షేమంగా స్వగ్రామాలకు చేరుస్తోంది.

whatsapp channel

మరిన్ని వార్తలు