Vijayawada: తెప్పోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి

13 Oct, 2021 13:24 IST|Sakshi

ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): దసరా మహోత్సవాల్లో భాగంగా జరిపే తెప్పోత్సవానికి ఈ నెల 14వ తేదీన ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తామని ఆలయ ఇంజినీరింగ్‌ అధికారులు తెలిపారు. ట్రయల్‌ రన్‌పై దేవస్థానం ఈఈ భాస్కర్‌ మంగళవారం ఇంజినీరింగ్‌ అధికారులతో సమావేశమయ్యారు. హంస వాహనం ఇప్పటికే సిద్ధమవగా, వాహనంపై చేయాల్సిన ఏర్పాట్లు, ఇతర అంశాలపై చర్చించారు.

తెప్పోత్సవానికి అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయని, ఇరిగేషన్, ఆర్‌ అండ్‌ బీ శాఖల నుంచి అనుమతులు రావాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. కృష్ణానదీలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో తెప్పోత్సవంపై జిల్లా అధికారులు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ నెల 15వ తేదీ నాటికి నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టని నేపథ్యంలో ఎటువంటి ఏర్పాట్లు చేయాలనే అంశంపై చర్చించారు.    

దుర్గమ్మ ఆదాయం రూ.18.08 లక్షలు 
వన్‌టౌన్‌ (విజయవాడ పశ్చిమ): దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఆరో రోజు మంగళవారం అమ్మవారికి రూ.18.08 లక్షల ఆదాయం లభించిందని ఆలయ అధికారులు తెలిపారు. మూలానక్షత్రం పర్వదినాన్ని పురస్కరించుకొని అమ్మవారిని భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. సాయంత్రం వరకూ వివిధ సేవా టిక్కెట్లు, ప్రసాదాల టికెట్ల విక్రయం ద్వారా ఈ ఆదాయం సమకూరిందని అధికారులు పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు