రైలుకింద పడి ప్రేమికుల ఆత్మహత్య

21 Nov, 2023 12:51 IST|Sakshi

గూడూరు రూరల్‌ (తిరుపతి జిల్లా): విజయవాడలోని కోచింగ్‌ సెంటర్లో కుదిరిన స్నేహం విడదీయరాని బంధంగా ఏర్పడింది. పెద్దలు ఎక్కడ తమను కలుసుకోకుండా చేస్తారో అన్న భయంతో ఆ జంట గూడూరుకు సమీపంలో ఆదివారం రాత్రి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన సంచలనం కలిగించింది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా శ్రీరుక్మిణీపురానికి చెందిన అన్నంగి పావని (19) హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చేసింది. చిల్లకూరు మండలంలోని ఓ హోటల్‌లో పని చేసేందుకు సొంత ఊరి నుంచి తల్లిదండ్రుల అనుమతి తీసుకుని రెండు రోజుల క్రితం వచ్చింది.

ఇక్కడ నుంచి తనకు గతంలో విజయవాడలోని కోచింగ్‌ సెంటర్‌లో చదుకుని ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా, సగిపాడు గ్రామానికి చెందిన దండే రాకేష్‌(23)ను గూడూరుకు రావాలని ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చింది. దీంతో ఆదివారం గూడూరు వచ్చి ఇద్దరు కలుసుకుని చాలా సేపు భావి జీవితానికి సంబంధించిన విషయాలను మాట్లాడుతుకున్నారు. అనంతరం ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ పెద్దలకు ఇష్టం లేకపోతే ఇద్దరు ఎవరికి వారు దూరం కావాల్సి వస్తుందని భావించిన వారు ఒకరిని విడిచి ఒకరు ఉండలేక గూడూరు రైల్వే స్టేషన్‌ నుంచి సుమారు మూడు కి.మీ దూరంలో ఉన్న గాంధీనగర్‌ ప్రాంతం వరకు ట్రాక్‌పై నడిచి వెళ్ళి అక్కడ రైలు పట్టాలపై పడుకున్నారు.

వారిపై నుంచి గూడ్స్‌ ట్రైన్‌ వెళ్లడంతో తలలు తెగి వారు అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. చిన్న వయస్సులో ప్రేమించుకున్న ప్రేమికులు పుట్టిన ఊరు నుంచి దూరంగా వచ్చి ఆత్మహత్య చేసుకోవడం గూడూరు డివిజన్‌లో సంచలనం సృషించింది. యువతీ యువకుల మృతదేహాలను గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచార ఇచ్చారు. వారు సోమవారం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుల తల్లిదండ్రులు ఆసుపత్రి వద్ద రోదించడం చూసిన వారు కన్నీటి పర్యంతం అయ్యారు.

మరిన్ని వార్తలు