-->

తల్లి మృతి.. పది పరీక్షలకు హాజరైన తనయుడు

28 Mar, 2024 01:30 IST|Sakshi
తండ్రితో కలసి పరీక్ష రాసేందకు వచ్చిన యోగేంద్ర

పెదకూరపాడు: కన్నతల్లి పేగు బంధం ఒక వైపు..పది పబ్లిక్‌ పరీక్షలు మరోవైపు.. ఆ విద్యార్థికి అగ్ని పరీక్ష పెట్టాయి. పదహారేళ్ల పాటు కంటికి రెప్పలా కని పెంచిన తల్లి మృతి చెందినా.. పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకుని.. అమ్మ మాటలను గుర్తు చేసుకొని తండ్రితో కలసి తల్లి కోర్కెను తీర్చేందుకు పరీక్ష రాసేందుకు వచ్చాడు ఆ విద్యార్థి. వివరాలు ఇలా ఉన్నాయి. పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం బలుసుపాడు గ్రామానికి చెందిన కడియాల ఆదినారాయణ, పావనిలకు వెంటక యోగేంద్ర, పూజిత సంతానం. ఆదినారాయణ న్యూడిల్స్‌ అమ్ముకుంటూ జీవనం సాగిస్తారు. గత వారం రోజులుగా తల్లి పావని జ్వరంతో బాధ పడుతుంది. ఈ క్రమంలో ఆదివారం పావనికి జ్వరం తీవ్రం కావడంతో సత్తెనపల్లి ప్రైవేట్‌ వైద్యశాలకు తరలించారు.వైద్యులు ఆమెకు డెంగ్యూ లక్షణాలతో పాటు కామెర్లు కూడా సోకినట్లు గుర్తించి మెరుగైన చికిత్స కోసం గుంటూరు తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మంగళవారం మృతి చెందింది. ఈ క్రమంలో కుమారుడు వెంటక యోగేంద్ర మండలంలోని 75త్యాళ్ళూరు గ్రామంలో జెడ్పీ పాఠశాల నందు పదో తరగతి పరీక్షలు రాస్తున్నాడు. తల్లి పావని మృతివార్త తెలుసుకొని తల్లఢిల్లాడు. తన తల్లి ఆశయం కోసం ఆమె మృతదేహాం ఒక వైపు ఉన్నా తండ్రి ఆదినారాయణతో కలసి పరీక్ష రాసేందుకు వచ్చాడు. ఈ విషాద గాథ పలువురిని కంట తడి పెట్టించింది.

భార్య మృతదేహం ఇంటి వద్దే ఉన్నా తనయుడిని పరీక్షకు తీసుకువెళ్లిన తండ్రి బలుసుపాడులో విషాద ఘటన

Election 2024

మరిన్ని వార్తలు