-->

ప్రచారానికి ముందస్తు అనుమతి తప్పనిసరి

28 Mar, 2024 01:45 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌

బాపట్ల: రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఇంటింటా ప్రచారానికి ముందస్తు అనుమతులు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా స్పష్టం చేశారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో బుధవారం స్థానిక కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున కమిషన్‌ మార్గదర్శకాలు తప్పనిసరిగా అనుసరించాల్సి ఉందని తెలిపారు. అభ్యర్థులు తమ ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్‌ను రిటర్నింగ్‌ అధికారికి సమర్పించాలని చెప్పారు. జిల్లావ్యాప్తంగా ప్రచారాలు చేయాలంటే జిల్లా ఎన్నికల అధికారి వద్ద దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ప్రచారానికి సంబంధించిన వాహనాలు, హెలికాఫ్టర్‌ అనుమతులు, ఎయిర్‌ బెలూన్స్‌కు జిల్లా ఎన్నికల అధికారి అనుమతిస్తారని, నేరుగా లేదా ఆన్‌లైన్‌లో సువిధ యాప్‌ పోర్టల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. నియోజకవర్గస్థాయిలో ప్రచారాలు, వాటి అనుమతుల కోసం సంబంధిత ఆర్వోలకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. స్టార్‌ లీడర్లుగా గుర్తింపు పొందిన ప్రముఖ నాయకుల ప్రచారానికి రాష్ట్రస్థాయి ఎన్నికల అధికారి వద్ద అనుమతి పొందాలన్నారు. మే 11 తేదీ వరకు మాత్రమే ప్రచారాలకు అనుమతి ఉంటుందన్నారు. నిబంధనలు సక్రమంగా పాటించడం లేదనే ఫిర్యాదులు అందుతున్నాయని, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కలెక్టర్‌ హెచ్చరించారు. ఓటర్ల జాబితాలో సవరణలకు గడువు ముగిసిందని తెలిపారు. ఫామ్‌–7 ఫామ్‌–8లో (సవరణ) తొలగింపులపై దరఖాస్తుల విచారణ ప్రక్రియ ముగిసిందన్నారు. ఇకనుంచి కేవలం ఫామ్‌–6, ఫామ్‌–8లో షిఫ్టింగ్‌ ఆఫ్‌ రెసిడెన్సీ కింద ఏప్రిల్‌ 15వ తేదీలోగా నమోదైన దరఖాస్తులను మాత్రమే విచారిస్తామని వివరించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్‌. సత్తిబాబు, సీపీఓ శ్రీనివాసరావు, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు సీతారామయ్య, వైఎస్సార్‌ సీపీ నాయకులు ఐ.మాల్యాద్రి, భాజపా నాయకులు కె.వి.రామకృష్ణ, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు డి.రవి, టీడీపీ నాయకులు షేక్‌ మహమ్మద్‌ గౌస్‌ పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా

Election 2024

మరిన్ని వార్తలు