ప్రపంచ దేశాలపై డాలర్‌ పెత్తనం.. అగ్రరాజ్యం అమెరికాకు భారీ షాక్‌!

5 Jan, 2024 09:16 IST|Sakshi

అగ్రరాజ్యం అమెరికాకు భారీ షాక్‌. ఈ ఏడాది ప్రపంచంలో పలు దేశాలు వ్యాపార నిమిత్తం వినియోగించే డాలర్‌ను ఇకపై తాము వినియోగించబోమని, సొంత కరెన్సీతో సంబంధిత లావాదేవీలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని 20 దేశాలు తీర్మానించుకున్నట్లు తెలుస్తోంది. 

అంతర్జాతీయ వాణిజ్యం అంటే మనకు టక్కున గుర్తుకొచ్చేది అమెరికన్‌ డాలర్‌. ప్రపచంలోనే 95 శాతం దేశాలు అమెరికన్‌ డాలర్‌ ఆధారంగా వ్యాపారాన్ని కొనసాగిస్తూ వస్తున్నాయి. అయితే ఇకపై ట్రెండ్‌ మారనుంది. ఇప్పటికే బ్రిక్స్‌ దేశాలు అమెరికా డాలర్‌ వినియోగాన్ని తగ్గించేశాయి. సొంత కరెన్సీని ఆయా వాణిజ్య లావాదేవీలకు ఉపయోగిస్తున్నాయి. 

డాలర్‌ పెత్తనాన్ని 
అయితే తాజాగా మరిన్ని బ్రిక్స్‌లో కూటమైన దేశాలు, ఆసియన్‌ దేశాలు డాలర్‌ పెత్తనాన్ని అంగీకరించడం లేదు. సొంతంగా తమ స్థానిక కరెన్సీని మాత్రమే ఉపయోగించుకునేందుకు సిద్ధమయ్యాయి. అటు బ్రిక్స్‌ కూటమితో పాటు ఆసియన్‌ దేశాలు సైతం డాలర్‌ ఆధిపత్యానికి చెక్‌ పెట్టనున్నాయి.

 

బ్రిక్స్‌ కూటమిలో మరిన్ని దేశాలు
ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు లాంటి అంతర్జాతీయ సంస్థల్లో అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రాతినిధ్యం పెంచేందుకు, గళాన్ని వినిపించేందుకు 2006లో బ్రెజిల్, రష్యా, భారత్, చైనాలకు ‘బ్రిక్’ కూటిమి ఏర్పాటైంది.  2010లో దక్షిణాఫ్రికా చేరాక అది బ్రిక్స్‌గా అవతరించింది.
 
ఆ దేశాలు ఇవే
తాజాగా, మరో 5 దేశాలకు బ్రిక్స్‌ కూటమిలో సభ్యత్వం ఇస్తూ ప్రస్తుతం అధ్యక్షత వహిస్తున్న రష్యా ఒక ప్రకటన విడుదల చేసింది. కొత్తగా ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్‌, సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) వచ్చి చేరాయి. ప్రస్తుతం బ్రిక్స్‌ 10 దేశాల కూటమి అమెరికన్‌ డాలర్‌ వినియోగాన్ని విరమించుకోనున్నాయి. 

బ్రిక్స్‌ దేశాల కూటమి బాటలో ఆసియా దేశాలు
అదే సమయంలో 10 ఆసియన్‌ దేశాలు బ్రూనై, కంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, వియత్నాంలు వ్యాపార లావాదేవీలకు యూఎస్‌ డాలర్‌  సొంత కరెన్సీని వినియోగించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఫలితంగా ఈ ఏడాది అదనంగా మరో 16 దేశాలు ఈ డి-డాలరైజేషన్ మిషన్‌లో చేరతాయని ఆర్ధిక నిపుణులు భావిస్తున్నారు. ఇది బలీయమైన ప్రపంచ ఆర్థిక కూటమిగా బ్రిక్స్ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఆర్ధిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

16వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సులో కీలకం
ఆసియన్‌ సభ్యులతో పాటు పాకిస్తాన్, ఇరాక్, టర్కీ, నైజీరియా, ఈజిప్టుతో సహా ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాల నుండి అనేక దేశాలు బ్రిక్స్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ చేరికలు రాబోయే 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ఈ అంశం కీలక ఎజెండాగా మారనుందని అంచనా. వ్యాపార లావాదేవీల్లో అమెరికన్‌ డాలర్‌ ఆధిపత్యంపై అసంతృప్తి నేపథ్యంలో ప్రపంచంలోని పలు దేశాలు ఈ కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్‌ చేస్తున్నాయి.  

>
మరిన్ని వార్తలు