ఉద్యోగుల‌పై అతి నిఘా పెట్టిన కంపెనీ.. భారీ ఫైన్‌తో తిక్క‌కుదిరింది!

25 Jan, 2024 15:31 IST|Sakshi

ఉద్యోగుల‌పై అతి నిఘా పెట్టిన ఈ-కామ‌ర్స్ దిగ్గ‌జం అమెజాన్‌కు ఫ్రాన్స్ గోప్య‌తా ర‌క్ష‌ణ సంస్థ భారీ జ‌రిమానా విధించింది. త‌మ వేర్‌హౌస్‌లో  ప‌నిచేస్తున్న ఉద్యోగుల‌ పనితీరు, కార్యాచరణను పర్యవేక్షించడానికి అత్యంత అనుచిత వ్యవస్థను  ఉపయోగించినందుకు అమెజాన్‌పై  35 మిలియన్ డాల‌ర్ల (రూ.290 కోట్లు) జరిమానా విధించింది. 

అమెజాన్ ఉపయోగిస్తున్న మానిటరింగ్ సిస్టమ్ ఫ్రాన్స్ లాజిస్టిక్ విభాగంలోని మేనేజర్‌లను ఉద్యోగులను చాలా దగ్గరగా పర్యవేక్షించడానికి అనుమతించిందని, ఇది యూరోపియన్ యూనియన్ నిర్దేశించిన గోప్యతా ప్రమాణాలను ఉల్లంఘించిందని ఫ్రెంచ్ డేటా ప్రొటెక్షన్ అథారిటీ (CNIL) తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.

"స్టౌ మెషిన్ గన్" అని పిలిచే స్కానర్‌ల‌తో ఉద్యోగులను పర్యవేక్షిస్తోంది.  ఉద్యోగులు ఈ స్కానర్ల ద్వారా పార్సిళ్ల‌ను స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఈ క్ర‌మంలో  పార్సిళ్ల‌ను చాలా త్వరగా అంటే 1.25 సెకన్ల కంటే త‌క్కువ స‌మ‌యం చేస్తే వారి ప‌నితీరులో లోపంగా కంపెనీ గుర్తిస్తోంది. ఈ పర్యవేక్షణ పద్ధతి ఉద్యోగి ఉత్పాదకతను, పని అంతరాయాలను కొలవడానికి ఉపయోగిస్తున్నార‌ని సీఎన్ఐఎల్ ఆరోపిస్తోంది. అటువంటి వ్యవస్థను సెటప్ చేయడం యూరోపియ‌న్ యూనియ‌న్ గోప్యతా నియమాల ప్ర‌కారం చట్టవిరుద్ధమ‌ని సీఎన్ఐఎల్ వాదిస్తోంది.

అయితే ఈ వాదనలను అమెజాన్ తోసిపుచ్చింది.  సీఎన్ఐఎల్ చేసిన ఆరోపణలతో తాము తీవ్రంగా విభేదిస్తున్నామని, అప్పీల్ ఫైల్ చేసే హక్కు త‌మ‌కు ఉంద‌ని తెలిపింది. "వేర్‌హౌస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లు పరిశ్రమ ప్రమాణాలు, కార్యకలాపాల భద్రత, నాణ్యత సామర్థ్యాన్ని నిర్ధారించడానికి, సమయానికి,  కస్టమర్ అంచనాలకు అనుగుణంగా ప్యాకేజీల నిల్వ, ప్రాసెసింగ్‌ను ట్రాక్ చేయడానికి అవసరమైనవి" అని అమెజాన్ తన ప్రకటనలో వివ‌రించింది.

whatsapp channel

మరిన్ని వార్తలు