33 రూపాయలకే కరోనా ట్యాబ్లెట్‌

14 Aug, 2020 09:58 IST|Sakshi

తయారు చేసిన ఎంఎస్‌ఎన్‌ గ్రూప్‌ 

ఒక్కో ట్యాబ్లెట్‌ ధర రూ.33  

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కోవిడ్‌–19 చికిత్సలో వాడే ఫావిపిరావిర్‌ ఔషధాన్ని హైదరాబాద్‌ కంపెనీ ఎంఎస్‌ఎన్‌ గ్రూప్‌ తయారు చేసింది. ఫావిలో పేరుతో 200 ఎంజీ ట్యాబ్లెట్‌ను అత్యంత చౌకగా విక్రయిస్తోంది. ఒక్కో ట్యాబ్లెట్‌ ధరను రూ.33గా కంపెనీ నిర్ణయించింది. యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇంగ్రీడియెంట్, ఫార్ములేషన్‌ను సొంత పరిశోధన, అభివృద్ధి కేంద్రంలో రూపొందించామని ఎంఎస్‌ఎన్‌ గ్రూప్‌ సీఎండీ ఎంఎస్‌ఎన్‌ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. నాణ్యమైన మందులు అందరికీ చవకగా అందుబాటులో ఉండాలని తాము విశ్వసిస్తున్నామని అన్నారు. ఇప్పటికే కంపెనీ కోవిడ్‌–19 చికిత్సలో వాడే ఓసెల్టామివిర్‌ 75 ఎంజీ క్యాప్సూల్స్‌ను ప్రవేశపెట్టింది. (రెమ్‌డెసివిర్ : చౌక మందు లాంచ్)

డిమాండ్‌కు తగ్గట్టుగా...: ఫావిలో 400 ఎంజీ ట్యాబ్లెట్‌ను త్వరలో అందుబాటులోకి తేనున్నట్టు ఎంఎస్‌ఎన్‌ గ్రూప్‌ ఈడీ భరత్‌ రెడ్డి సాక్షి బిజినెస్‌ బ్యూరోకు తెలిపారు. ‘డిమాండ్‌కు తగ్గట్టుగా ఫావిలో సరఫరా చేయగలిగే సామర్థ్యం కంపెనీకి ఉంది. ప్రస్తుతం బొలారం ప్లాంటులో దీనిని తయారు చేస్తున్నాం. డిమాండ్‌ అధికమైతే కొత్తూరు యూనిట్లో కూడా ఉత్పత్తి చేస్తాం’ అని వివరించారు. 2003లో ప్రారంభమైన ఎంఎస్‌ఎన్‌ గ్రూప్‌నకు తెలంగాణలో 11 ఏపీఐ, మూడు ఫార్ములేషన్‌ యూనిట్లున్నాయి. యూఎస్‌లో ఒక ఫార్ములేషన్‌ కేంద్రం ఉంది. 11,000 పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు. 560 డ్రగ్‌ మాస్టర్‌ ఫైల్స్, 370 ఏపీఐలు కంపెనీ ఖాతాలో ఉన్నాయి. (‘బయోఫోర్‌’ నుంచి కొవిడ్‌-19 ఔషధం)

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు