చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలకు ఢిల్లీ హైకోర్టు భారీ షాక్!

24 Feb, 2024 09:59 IST|Sakshi

భారత్ లో చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలకు భారీ షాక్ తగిలింది. రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సంస్థ ఇంటర్‌డిజిటల్‌కు పెండింగ్‌లో ఉన్న మొత్తం రాయల్టీలను మూడు నెలల్లో చెల్లించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. లేని పక్షంలో సదరు చైనా సంస్థల ఫోన్ అమ్మకుండా కోర్టును ఆశ్రయించొచ్చుని తెలిపింది. 

ఫిబ్రవరి 21న జారీ చేసిన ఢిల్లీ హైకోర్ట్ ఉత్తర్వుల్లో.. ఒప్పో ఇంటర్‌డిజిటల్‌కు సంబంధిత మొత్తాన్ని చెల్లించాలి. లేదంటే కోర్టు ఆదేశాల్ని భేఖాతరు చేసినందుకు భారత్లో ఒప్పోతో పాటు ఇతర చైనా ఫోన్ లు అమ్మకాలు జరగకుండా  ఇంటర్ డిజిటల్ కోర్టులో ఇంజక్షన్ ఆర్డర్ కోసం నమోదు చేసుకునేందుకు అర్హత ఉందని సూచించింది.   

స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఇంటర్ డిజిటల్ సంస్థకు ఎంత మొత్తంలో చెల్లించాల్సి ఉందనే అంశంపై స్పష్టతలేదు. అయితే ఆమొత్తాన్ని, అందుకు అయ్యే వడ్డీని బ్యాంక్ అకౌంట్ లలో జమచేయాలని, ఈ కేసు విచారణను 2024 చివరి నాటికి పూర్తి చేయాలని కూడా స్పష్టం చేసింది.   

కేసు దేనికి సంబంధించింది?
తమ హ్యాండ్‌సెట్‌లలో సెల్యులార్ టెక్నాలజీ (3జీ, 4జీ,5జీ), వీడియో కోడింగ్ టెక్నాలజీ వినియోగంపై ఒప్పో,రియల్ మీ, వన్ ప్లస్ బ్రాండ్‌లకు వ్యతిరేకంగా ఇంటర్ డిజిటల్ కోర్టును ఆశ్రయించింది. కోర్టు తీర్పు ప్రకారం.. ఇంటర్‌డిజిటల్ తన సాంకేతికతను ఉపయోగించడం కోసం న్యాయమైన, సహేతుకమైన, వివక్షత లేని (FRAND)నిబంధనలపై లైసెన్స్ ఒప్పందం కోసం ఒప్పో గ్రూప్‌తో కొన్ని సంవత్సరాలుగా చర్చలు జరుపుతోంది. చర్చలు విఫలం కావడంతో డిసెంబర్ 2021లో యూకే, జర్మనీ, భారత్ తో పాటు ఇతర దేశాల్లో స్మార్ట్ ఫోన్ కంపెనీలకు వ్యతిరేకంగా వాజ్యం దాఖలు చేసింది. ఆ కేసుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు తాజాగా తన తీర్పును వెలువరించింది. 

ఒప్పో వర్సెస్ నోకియా 
జూలై 2023లో ఢిల్లీ హైకోర్టు ద్విసభ్య బెంచ్ మొబైల్ ఫోన్ తయారీదారు ఒప్పో తన ఫోన్‌లలో నోకియా సాంకేతికతను అవసరమైన అనుమతి లేకుండా ఉపయోగించినందుకు, నాలుగు వారాల్లోగా దాని భారతదేశ విక్రయాలలో 23 శాతం డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఢిల్లీ హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టు సైతం సమర్ధించింది. కోర్టు తీర్పుతో దిగివచ్చిన ఒప్పో.. నోకియాకు చెల్లించింది. ఆపై సాంకేతిక వినియోగం విషయంలో ఇరు సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి.

whatsapp channel

మరిన్ని వార్తలు