కృత్తిమ మేధతో వచ్చేసింది.. పసికందులు ఎందుకు ఏడుస్తున్నారో చెప్పేస్తుంది

4 Feb, 2024 08:23 IST|Sakshi

ఇంకా మాటలు రాని వయసులో కేరింతలు, ఏడుపులు మాత్రమే పసికందుల భాష. పసిపిల్లలు సంతోషంగా ఉన్నప్పుడు బోసినవ్వులొలికిస్తూ కేరింతలు కొడతారు. ఆకలేసినప్పుడు, ఏదైనా బాధ కలిగినప్పుడు ఏడుస్తారు. పసిపిల్లల ఏడుపును అర్థం చేసుకోవడం ఒక్కోసారి కష్టంగా ఉంటుంది. ఆకలితోనే ఏడుస్తున్నారా, మరే కారణం వల్ల ఏడుస్తున్నారా తెలుసుకోవడం అంత సులువు కాదు. గుక్కతిప్పుకోకుండా ఏడ్చే పసిపిల్లలతో తల్లులు నానా తంటాలు పడుతుంటారు.

పసిపిల్లలు ఏడ్చేటప్పుడు ఇకపై అంతగా ఇబ్బంది పడాల్సిన పనిలేదు. ఇదిగో ఈ బుల్లిపరికరం పసికందుల ఏడుపును మనకు బోధపడే భాషలోకి అనువదిస్తుంది. ఇది ఇరవై నాలుగు గంటలూ పసికందులను కంటికి రెప్పలా కనిపెడుతూ ఉంటుంది. వారు ఏడుస్తున్నట్లయితే, ఎందుకు ఏడుస్తున్నారో ఇట్టే తెలియజెబుతుంది. 

అమెరికన్‌ కంపెనీ ‘మాక్సికోసీ’ పిల్లల ఏడుపును అనువదించే ఈ బుల్లిరోబోను ఇటీవల రూపొందించింది. దీనికి అనుబంధంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే బేబీ మానిటర్‌ కూడా ఉంటుంది. పిల్లలు ఏడుస్తున్నట్లయితే, వారు ఆకలికి ఏడుస్తున్నారో, నిద్రవస్తున్నందుకు ఏడుస్తున్నారో, భయం వల్ల ఏడుస్తున్నారో, గందరగోళం వల్ల ఏడుస్తున్నారో ఇది ఇట్టే చెప్పేస్తుంది. దీని ధర 61.99 డాలర్లు (రూ.5,154) మాత్రమే! 

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega