-

కార్డులు ఎక్కువైతే చిక్కులేనా..?

27 Nov, 2023 00:47 IST|Sakshi

అవసరాలకు తగిన కార్డే తీసుకోవాలి

కార్డులు ఎన్ని ఉన్నా.. సకాలంలో చెల్లింపులు

వినియోగం 50 శాతం మించకూడదు

చెల్లింపుల్లో వైఫల్యం మంచిది కాదు

నియమాలు, షరతులు తెలిసి ఉండాలి  

ఆరాధన (31) ఐటీ ఉద్యోగి. ప్రయాణాలంటే ఆమెకు ఎంతో ఇష్టం. వీలు చిక్కినప్పుడల్లా ఏదో ఒక పర్యటనకు సిద్ధమైపోతుంది. ఇటీవల ఓ షాపింగ్‌ మాల్‌కు వెళ్లిన సందర్భంలో క్రెడిట్‌ కార్డ్‌ కంపెనీ సేల్స్‌ ఉద్యోగి ఆమెకు ఎదురుపడ్డాడు. మంచి ఫీచర్స్‌తో కూడిన క్రెడిట్‌ కార్డ్‌ అంటూ.. అందులోని ఉపయోగాలు చదివి వినిపించే ప్రయత్నం చేశాడు. నిజానికి క్రెడిట్‌ కార్డ్‌ తీసుకోవాలన్న ఆసక్తి ఆరాధ్యకు ఎంతమాత్రం లేదు. కానీ, ఎలాంటి జాయినింగ్‌ ఫీజు లేదని, దేశీయంగా ప్రీమియం ఎకానమీ విమాన టికెట్ల కొనుగోలుపై మూడు రెట్లు అధికంగా రివార్డు పాయింట్లు ఆఫర్‌ చేస్తుందని చెప్పగా, ఆ పాయింట్‌ ఆమెకు ఎంతో నచి్చంది. దీనికితోడు షాపింగ్‌ చేసిన ప్రతి సందర్భంలో సాధారణ రివార్డ్‌ పాయింట్లు వస్తాయని చెప్పాడు. దీంతో అప్లికేషన్‌పై సంతకం చేసి ఇచ్చేసింది. కార్డు చేతికి వచి్చన ఏడాది తర్వాత కానీ, వాస్తవాలు ఆమెకు తెలియలేదు.

కార్డ్‌ కంపెనీ వార్షిక రుసుము అంటూ రూ.3,000 చార్జ్‌ చేసింది. సేల్స్‌ ఏజెంట్‌ చెప్పినట్టు సదరు క్రెడిట్‌ కార్డ్‌ జీవిత కాలం ఉచితమేమీ కాదని అర్థమైంది. అప్పుడు కార్డ్‌ నిబంధనలు, షరతులు చదివిన తర్వాత కానీ ఆమెకు అర్థం కాలేదు ఆ కార్డ్‌ తన అవసరాలను తీర్చేది కాదని. వార్షిక ఫీజు మినహాయించాలంటే కార్డ్‌ కంపెనీ పెట్టిన లక్ష్యం మేరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని అర్థమైంది. ఆర్థిక సంబంధ నిర్ణయం తీసుకునే ముందు (కొనుగోళ్లు, పెట్టుబడులు) పూర్తి వివరాలు తెలుసుకోకపోతే ఏం జరుగుతుందన్న దానికి ఆరాధ్యకు ఎదురైన అనుభవమే నిదర్శనం. తమ అవసరాలకు అనుకూలమైన క్రెడిట్‌ కార్డ్‌కే పరిమితం కావాలని ఇది సూచిస్తోంది. క్రెడిట్‌ కార్డ్‌తో వచ్చే ప్రయోజనాలు చూసి చాలా మంది ఒకటికి మించిన కార్డులు తీసుకుంటూ ఉంటారు. అసలు ఒకరికి ఎన్ని క్రెడిట్‌ కార్డులు ఉండాలి..? క్రెడిట్‌ కార్డ్‌ తీసుకునే ముందు ఏం చూడాలి? ఒకటికి మించిన కార్డులు ఉంటే ఎలా నడుచుకోవాలి..? ఈ విషయాలపై అవగాహన కల్పించడమే ఈ కథనం ఉద్దేశం.

 
ఏ అవసరం కోసం..?
కొత్తగా క్రెడిట్‌ కార్డ్‌ తీసుకోవాలనుకునే వారు ముందు తమ అవసరాలు ఏంటో తేల్చుకోవాలి. రుణాలకు కొత్త వారు అయి, మంచి క్రెడిట్‌ స్కోరును నిర్మించుకోవాలని అనుకునే వారు తక్కువ ఫీజుతో కూడిన ప్రాథమిక స్థాయి క్రెడిట్‌ కార్డ్‌కు పరిమితం కావాలి. అప్పటికే దెబ్బతిన్న క్రెడిట్‌ స్కోరును బలోపేతం చేసుకోవాలని అనుకుంటే, అప్పుడు సెక్యూర్డ్‌ కార్డ్‌ను తీసుకుని వినియోగించుకోవడం సరైనది. ఒకటికి మించి కార్డులు ఉంటే, అప్పుడు అవి తీర్చలేని అవసరాలతో కూడిన కొత్త కార్డ్‌ను తీసుకోవచ్చు.

కొన్ని కార్డ్‌లు రివార్డ్‌ పాయింట్లు, ఎయిర్‌మైల్స్‌ లేదా క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లు, అన్నీ కలిపి బండిల్‌గా ఇస్తుంటాయి. ఈ రివార్డ్‌లు తమకు ఎంత వరకు ఉపయోగమన్నది ఆలోచించుకోవాలి. తమ అవసరాలకు అనుకూలమంటే తీసుకోవచ్చు. ఎయిర్‌పోర్ట్‌లలో లాంజ్‌ సేవలను ఉచితంగా అందించే కార్డులు కూడా ఉన్నాయి. విదేశీ లావాదేవీలపై ఫీజుల్లేని, సినిమా టికెట్లపై, రెస్టారెంట్‌ చెల్లింపులపై అదనపు డిస్కౌంట్‌లు ఆఫర్‌ చేసే కార్డుల్లో తమకు అనుకూలమైన దానిని ఎంపిక చేసుకోవచ్చు.

వినియోగం ముఖ్యం..
కార్డుతో వినియోగం ఎక్కువగా ఎక్కడ ఉంటుంది? ప్రతి నెలా వినియోగించుకున్నంత మేర పూర్తిగా తిరిగి చెల్లిస్తారా..? లేక బ్యాలన్స్‌ను క్యారీ ఫార్వార్డ్‌ చేస్తారా.? కనీస మొత్తాన్ని చెల్లించి, మిగిలిన బ్యాలన్స్‌ను క్యారీ ఫార్వార్డ్‌ చేసుకునే వారు తక్కువ వడ్డీ రేటును చార్జ్‌ చేసే కార్డును ఎంపిక చేసుకోవాలి. పరిమిత బడ్జెట్‌తో కుటుంబాన్ని నడిపించే వారికి తక్కువ రేటు వసూలు చేసే కార్డ్‌లు అనుకూలం. దీర్ఘకాలంలో వీటితో ఎంతో ఆదా చేసుకోవచ్చు. యూజర్లు కార్డ్‌తో ఎక్కువగా ఎక్కడ ఖర్చు చేస్తున్నారన్నది విశ్లేíÙంచుకోవాలని మై మనీ మంత్ర మార్కెట్‌ ప్లేస్‌ ఎండీ రాజ్‌ ఖోస్లా పేర్కొన్నారు.

కార్డుల మధ్య ప్రయోజనాల్లో వ్యత్యాసం ఉంటుందన్నారు. ‘‘తరచూ ప్రయాణించే వారు ఎయిర్‌మైల్స్‌ లేదా హోటల్‌ పాయింట్లను ఆఫర్‌ చేసే కార్డును ఎంపిక చేసుకోవాలి. కార్డుపై అయ్యే వ్యయాలతో పోలిస్తే ప్రయోజనాలు మెరుగ్గా ఉండాలన్నది మర్చిపోవద్దు. ఒకటికి మించిన ప్రయోజనాలు ఆఫర్‌ చేసే కార్డులకు వార్షిక ఫీజు ఉంటుంది. కనుక ఆయా ప్రయోజనాలను పూర్తి స్థాయిలో వినియోగించుకునేట్టు అయితేనే సదరు కార్డులు తీసుకోవాలి. అప్పుడే వార్షిక ఫీజు చెల్లించడం ప్రయోజనకరంగా అనిపిస్తుంది’’అని రాజ్‌ ఖోస్లా సూచించారు.

ఖర్చులు–ప్రయోజనాలు
కార్డు వార్షిక ఫీజు కంటే వచ్చే ప్రయోజనాలు ఎక్కువగా ఉండాలి. ఏటా ఇంత ఖర్చు చేస్తేనే వార్షిక రుసుము మినహాయింపు అనే షరతు ఉంటే.. మీ వినియోగం అదే స్థాయంలో ఉంటుందా? అన్నది చూసుకోవాలి. కార్డ్‌ను తక్కువగా వినియోగించుకునే వారికి వార్షిక రుసుముతో వచ్చేవి అనుకూలం కాదు. కార్డులు సాధారణంగా వార్షిక రుసుం, యాన్యువల్‌ పర్సంటేజ్‌ రేట్‌ (ఏపీఆర్‌), బ్యాలన్స్‌ ట్రాన్స్‌ఫర్‌ ఫీజు, విదేశీ లావాదేవీల రుసుంతో వస్తాయి. యాన్యువల్‌ పర్సంటేజ్‌ రేట్‌ అంటే.. ప్రతి నెలా కార్డ్‌ బిల్లుపై కొంత మొత్తం చెల్లించి, క్యారీ ఫార్వార్డ్‌ చేసుకునే మిగిలిన బ్యాలన్స్‌పై అమలు చేసే వడ్డీ రేటు.

క్రెడిట్‌ స్కోరు, కార్డు ఏ రకం అన్న దాని ఆధారంగా ఈ వడ్డీ రేటులో మార్పు ఉంటుంది. కనుక ప్రతి నెలా పూర్తి బిల్లు చెల్లించలేని వారికి తక్కువ ఏపీఆర్‌ ఉండే కార్డు అనుకూలంగా ఉంటుంది. నిజానికి ఒక అధ్యయనం ప్రకారం అధిక శాతం మంది కార్డ్‌ కస్టమర్లు తాము పొందే రివార్డులతో పోలిస్తే కార్డు కంపెనీకి చెల్లించే ఫీజులు, వడ్డీయే ఎక్కువగా ఉంటున్నట్టు తెలుస్తోంది. ‘‘కార్డ్‌ సంస్థ ఆఫర్‌ చేస్తున్న ప్రయోజనాలు ఫీజుల కంటే మెరుగ్గా ఉన్నాయా? అన్నది తెలుసుకోవాలి.

తక్కువ రివార్డులు, అధిక వార్షిక ఫీజుతో కూడిన ప్రాథమిక క్రెడిట్‌ కార్డ్‌ ఏమంత ఉపయోగకరం కాకపోవచ్చు. ఎందుకంటే మార్కెట్లో తక్కువ వార్షిక ఫీజుతో లేదా అసలు వార్షిక ఫీజు లేని కార్డులు ఎన్నో ఉన్నాయి’’అని పైసా బజార్‌ క్రెడిట్‌ కార్డుల విభాగం హెడ్‌ రోహిత్‌ చిబ్బార్‌ పేర్కొన్నారు. విదేశీ ప్రయాణాలకు వెళ్లే వారు అంతర్జాతీయ లావాదేవీలకు చార్జ్‌ వసూలు చేయని కార్డులు తీసుకోవడం లాభదాయకమని సూచించారు. అలాగే, రివార్డుల శాతాన్ని కూడా చూడాల్సి ఉంటుంది. అన్ని రకాల కొనుగోళ్లపై ఫ్లాట్‌ 2 శాతం చొప్పున రివార్డులు ఆఫర్‌ చేస్తుంటే, అది మంచి డీల్‌ అవుతుంది.  

ఎన్ని కార్డులు..?
ఒకరికి ఎన్ని కార్డులు ఉండాలన్న దానికి ఎలాంటి నియమం లేదు. కాకపోతే ఎక్కువ కార్డ్‌లు ఉంటే, వాటితో పాటు రిస్‌్కలు కూడా ఉంటాయని మర్చిపోవద్దు.  ‘‘ఒకటికి మించి క్రెడిట్‌ కార్డ్‌లు ఉంటే, విడిగా ఒక్కో దానిని సరైన రీతిలో వినియోగిస్తూ గరిష్ట స్థాయిలో ఆదా చేసుకోవాలి’’ అని చిబ్బార్‌ పేర్కొన్నారు. ప్రతి కార్డ్‌కు ఉండే బిల్లింగ్‌ సైకిల్‌కు అనుగుణంగా వినియోగించుకోవాలని సూచించారు. అప్పుడు నెలవారీ నగదు ప్రవాహాలను తెలివిగా వినియోగించుకోవచ్చన్నారు.

విడిగా ఒక్కో కార్డ్‌లో వినియోగించకుండా మిగిలిపోయిన లిమిట్, అత్యవసర సమయాల్లో అక్కరకు వస్తుంది. ఒకటికి మించిన కార్డులు కలిగిన వారు, సరైన రీతిలో ఉపయోగించుకోకుండా, ఎక్కువగా వాడేస్తే అది రుణ ఊబిలోకి తీసుకెళుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక లిమిట్‌తో ఎక్కువ క్రెడిట్‌ కార్డులు కలిగి ఉండడం, అన్నింటినీ గరిష్ట పరిమితి మేరకు వినియోగిస్తుంటే అది క్రెడిట్‌ స్కోర్‌కు మంచిది కాదు. ఎందుకంటే అది అధిక రిస్క్‌కు దారితీస్తుంది.

సంఖ్యతో సంబంధం లేకుండా తమ అవసరాలకు పక్కాగా నప్పే కార్డ్‌ ఉండాలన్నది ప్రాథమిక నియమం. ఎక్కువగా ప్రయాణించని వారికి ట్రావెల్‌ ప్రయోజనాలతో కూడిన క్రెడిట్‌ కార్డుతో వచ్చేదేమీ ఉండదు. కార్డులు ఎక్కువైతే వార్షికంగా చెల్లించే ఫీజులు, నికరంగా ఒరిగే ప్రయోజనం ఎంతన్న విశ్లేషణ అవసరం. ఎన్ని కార్డులు ఉన్నా, ఎంత వినియోగించుకున్నా, గడువులోపు పూర్తి బిల్లు చెల్లించడం ఎంతో ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే అది రుణ పరపతిపై ప్రభావం చూపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ క్రెడిట్‌ కార్డ్‌ బిల్లు చెల్లింపుల్లో వైఫల్యం లేకుండా చూసుకోవాలి.

కార్డును సమీక్షించుకోవాలి..
క్రెడిట్‌ కార్డ్‌ తీసుకునే సమయంలో చెప్పిన ప్రయోజనాలు ఎప్పటికీ కొనసాగుతాయని అనుకోవద్దు. కార్డ్‌ సంస్థ ఎప్పుడైనా అందులోని ప్రయోజనాల్లో మార్పులు చేయవచ్చు. ఈ విషయాలను ఈ మెయిల్‌ రూపంలో తెలియజేస్తాయి. కార్డ్‌ కంపెనీల నుంచి వచ్చే మెయిల్స్‌ను చాలా మంది పెద్దగా పట్టించుకోరు. దీనివల్ల ప్రయోజనాలు కోల్పోవాల్సి వస్తుంది. అందుకని ఏడాదిలో రెండు సార్లు అయినా, క్రెడిట్‌ కార్డు నియమ, నిబంధనలు, ప్రయోజనాలను సమీక్షించుకోవాలి. రివార్డ్‌ పాయింట్లను కూడా రెడీమ్‌ చేసుకోవాలి. లేదంటే అవి కాలం చెల్లిపోయే ప్రమాదం ఉంటుంది. మారిన నియమ, నిబంధనల ప్రకారం ఇక మీదట సంబంధిత క్రెడిట్‌ కార్డ్‌ ప్రయోజనకరం కాదని గుర్తిస్తే, దాన్ని రద్దు చేసుకోవడం మంచిది. క్రెడిట్‌ కార్డ్‌ను రద్దు చేసుకుంటే, అది తాత్కాలికంగా క్రెడిట్‌ స్కోర్‌ను దెబ్బతీస్తుందని గుర్తు పెట్టుకోవాలి.  

అనుకూలతలు
► ఒకటికి మించి క్రెడిట్‌ కార్డ్‌లు ఉంటే, అప్పుడు ఒక్కో కార్డు వారీ వినియోగించుకునే పరిమితి 50 శాతం మించకుండా చూసుకోవచ్చు. ఇది క్రెడిట్‌ స్కోర్‌కు అనుకూలం.
►ఒకటికి మించి క్రెడిట్‌ కార్డులు వాడుతూ, అన్ని బిల్లులను గడువులోపు చెల్లించేట్టు అయితే క్రెడిట్‌ స్కోర్‌ పెరిగేందుకు దారితీస్తుంది. దీనివల్ల భవిష్యత్తులో రుణాలు వేగంగా, ఆకర్షణీయమైన రేటుకు లభిస్తాయి.
►క్రెడిట్‌ కార్డ్‌ సంస్థలు ట్రాక్‌ రికార్డ్‌ మెరుగ్గా ఉన్న వారికి అదనపు లిమిట్‌ ఆఫర్‌ చేస్తుంటాయి. అత్యవసరాల్లో ఈ అదనపు పరిమితి ఉపయోగపడుతుంది. మరిన్ని రివార్డ్‌లు, క్యాష్‌బ్యాక్‌లు అందుకోవచ్చు.

ప్రతికూలతలు
►ఒకటే కార్డ్‌ ఉంటే వినియోగ నిష్పత్తి (కార్డ్‌ యుటిలైజేషన్‌ రేషియో) గరిష్ట స్థాయిలో ఉంటుంది.   
►ఒకటికి మించి కార్డులు ఉంటే ప్రతీ కార్డ్‌ బిల్లును పరిశీలిస్తూ, గడువులోపు వాటి బిల్లులు చేయడం కొంత అదనపు శ్రమతో కూడినది. కార్డ్‌లు ఎక్కువై, సకాలంలో చెల్లింపులు చేయడంలో విఫలమైతే అది స్కోర్‌ను దెబ్బతీస్తుంది.  
►ఒకటికి మించి కార్డ్‌లు ఉంటే, క్రమశిక్షణతో, వివేకంగా వినియోగించుకోకపోతే అది రుణ ఊబిలో చిక్కుకునేందుకు కారణమవుతుంది.  
►అవసరం లేకుండా ఎక్కువ కార్డులు నిర్వహిస్తుంటే, వాటికి చెల్లించే ఫీజుల రూపంలో నష్టపోవాల్సి వస్తుంది.

మరిన్ని వార్తలు