రియల్టీ @ లక్ష కోట్ల డాలర్లు

1 Jun, 2021 03:47 IST|Sakshi

2030 నాటికి అంచనా 

కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి మిశ్రా వెల్లడి 

ఇళ్ల ధరల సూచీ ఆవిష్కరణ

న్యూఢిల్లీ: రియల్‌ ఎస్టేట్‌ రంగం 2030 నాటికి 1 లక్ష కోట్ల డాలర్ల స్థాయిని అధిగమిస్తుందని కేంద్ర హౌసింగ్, పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి దుర్గా శంకర్‌ మిశ్రా తెలిపారు. ఉపాధి కల్పనలో 11 శాతం వాటాతో ఎకానమీలో రియల్‌ ఎస్టేట్‌ కీలకమైన రంగంగా ఉంటోందని ఆయన వివరించారు. ‘2019–20లో జీడీపీలో రియల్టీ రంగం వాటా దాదాపు 7 శాతం. సుమారు 200 బిలియన్‌ డాలర్ల మేర వృద్ధికి దోహదపడింది. 2030 నాటికి ఎకానమీ 10 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అందులో సుమారు 10 శాతం వాటా రియల్‌ ఎస్టేట్‌ నుంచి రానుంది. అంటే.. 2030 నాటికి ఈ రంగం 1 లక్ష కోట్ల డాలర్ల స్థాయిని దాటేయవచ్చని అంచనాలు ఉన్నాయి‘ అని మిశ్రా వివరించారు.

ఉపాధి కల్పన విషయంలోనూ రియల్టీ రంగం కీలక పాత్ర పోషిస్తోందని.. 50 కోట్ల ఉద్యోగాల్లో దాదాపు 5.5 కోట్ల ఉద్యోగావకాశాలు కల్పిస్తోందని ఆయన పేర్కొన్నారు. రియల్టీ పోర్టల్‌ హౌసింగ్‌ డాట్‌కామ్, ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ), పరిశ్రమ సమాఖ్య నారెడ్కో కలిసి రూపొందించిన ఇళ్ల ధరల సూచీని వర్చువల్‌గా ప్రారంభించిన సందర్భంగా మిశ్రా ఈ విషయాలు వివరించారు. గత ఏడేళ్లుగా రియల్టీ రంగం గణనీయ మార్పులకు లోనైందని రెరా చట్టం ఇందులో కీలక పాత్ర పోషించిందని ఆయన పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్, నాగాలాండ్‌ మినహా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇది అమలవుతోందన్నారు. 


హైదరాబాద్‌ సహా 8 నగరాల్లో.. 
హౌసింగ్‌డాట్‌కామ్, ఐఎస్‌బీలోని శ్రీని రాజు సెంటర్‌ ఫర్‌ ఐటీ అండ్‌ నెట్‌వర్క్‌డ్‌ ఎకానమీ (ఎస్‌ఆర్‌ఐటీఎన్‌ఈ) రూపొందించిన సూచీ (హెచ్‌పీఐ).. హైదరాబాద్‌ సహా ఎనిమిది ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరల తీరుతెన్నులను తెలుసుకునేందుకు ఉపయోగపడగలదని మిశ్రా తెలిపారు. దీన్ని మరింత పటిష్టంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఏ తరుణంలో కొనుక్కోవచ్చన్న విషయంలో కొనుగోలుదారులు, ఎప్పుడు విక్రయించుకుంటే శ్రేయస్కరమో అటు విక్రేతలు తగు నిర్ణయాలు తీసుకునేందుకు ఇది తోడ్పడగలదని ఐఎస్‌బీ డీన్‌ రాజేంద్ర శ్రీవాస్తవ తెలిపారు. ఆయా నగరాల్లో అమ్ముడైన యూనిట్లు, ధరలకు సంబంధించిన నెలవారీ నివేదికలు ఇందులో ఉంటాయి. రియల్టీ రంగంలో ధోరణులను విధానకర్తలు, ఆర్థికవేత్తలు తెలుసుకునేందుకు కూడా ఈ సూచీ ఉపయోగపడనుంది. హౌసింగ్‌డాట్‌కామ్‌ అనుబంధ సంస్థ ప్రాప్‌టైగర్‌ ఇప్పటికే డిమాండ్,సరఫరా, ధరలు, అమ్ముడు కాకుండా ఉన్న ఇళ్ల డేటాను మూణ్నెల్లకోసారి అందిస్తోంది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు