-->

చేతులు కలిపిన అంబానీ– అదానీ 

29 Mar, 2024 03:54 IST|Sakshi

అదానీ పవర్‌ ప్రాజెక్టులో రిలయన్స్‌కు 26 శాతం వాటా 

న్యూఢిల్లీ: బిలియనీర్‌ పారిశ్రామిక దిగ్గజాలు ముకేశ్‌ అంబానీ, గౌతమ్‌ అదానీ తొలిసారి చేతులు కలిపారు. దీనిలో భాగంగా అదానీ పవర్‌కు చెందిన పవర్‌ ప్రాజెక్టులో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) 26 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. అంతేకాకుండా మధ్యప్రదేశ్‌లోని ఈ ప్లాంటుకు చెందిన 500 మెగావాట్ల యూనిట్‌లో ఉత్పత్తయ్యే విద్యుత్‌ను ఆర్‌ఐఎల్‌ సొంత అవసరాలకు వినియోగించుకునేందుకు రెండు సంస్థలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.

వెరసి అదానీ పవర్‌ పూర్తి అనుబంధ సంస్థ మహన్‌ ఎనర్జెన్‌ లిమిటెడ్‌లో 5 కోట్ల ఈక్విటీ షేర్లను ఆర్‌ఐఎల్‌ సొంతం చేసుకోనుంది. రూ. 10 ముఖ విలువకే(రూ. 50 కోట్లు) వీటిని చేజిక్కించుకోవడంతోపాటు.. 500 మెగావాట్ల విద్యుత్‌ను సొంత అవసరాలకు ఆర్‌ఐఎల్‌ వినియోగించుకోనుంది.  సొంత వినియోగ పాలసీలో భాగంగా ఆర్‌ఐఎల్‌ 20 ఏళ్ల దీర్ఘకాలిక విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాన్ని(పీపీఏ) ఎంఈఎల్‌తో కుదుర్చుకున్నట్లు అదానీ పవర్‌ వెల్లడించింది. మొత్తం 2,800 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ సామర్థ్యంతో ఏర్పాటవుతున్న ఎంఈఎల్‌ ప్లాంటులో 600 మెగావాట్ల యూనిట్‌ను సొంత అవసరాల పద్ధతిలో తెరతీయనున్నట్లు వివరించింది.

Election 2024

మరిన్ని వార్తలు