కేంద్రం కొత్త పాలసీ? స్మార్ట్‌ఫోన్‌లలో లైవ్‌ టీవీ.. వ్యతిరేకిస్తున్న కంపెనీలు

11 Nov, 2023 09:40 IST|Sakshi

స్మార్ట్‌ఫోన్‌లలో టెలివిజన్‌ ఛానళ్ల ప్రత్యక్ష ప్రసారాలు జరిగేలా భారత ప్రభుత్వం ప్రత్యేక పాలసీని రూపొందించనున్నట్లు తెలుస్తోంది. అయితే కేంద్రం నిర్ణయాన్ని శాంసంగ్‌, క్వాల్కమ్‌, ఎరిక్సన్‌,నోకియాతో పాటు ఇతర టెక్నాలజీ సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. 

స్మార్ట్‌ ఫోన్‌లలో లైవ్‌టీవీ బ్రాడ్‌ కాస్ట్‌ సర్వీసుల్ని అందించాలంటే ఫోన్‌లలోని హార్డ్‌వేర్‌లని మార్చాలని, అలా మార్చడం వల్ల ఖర్చులు పెరుగుతాయి. ఫలితంగా స్మార్ట్‌ ఫోన్‌ల ధరలు మరో 30 డాలర్లు పెరిగే అవకాశం ఉందని కంపెనీలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయంటూ రాయిటర్స్‌ ఓ నివేదికను విడుదల చేసింది. 

అయితే, కేంద్రం టీవీ ప్రత్యక్ష ప్రసారాల కోసం సెల్యూలర్‌ నెట్‌వర్క్‌తో పనిలేకుండా  డైరెక్ట్‌గా స్మార్ట్‌ ఫోన్‌లలో లైవ్‌ సిగ్నల్స్‌ ఉంటే ఎలా ఉంటుందన్న అంశంపై చర్చలు సంబంధిత నిపుణలతో చర్చలు జరుపుతుంది. ఈ తరహా సేవలు ఉత్తర అమెరికా యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. ఏటీఎస్‌సీ 3.0 టెక్నాలజీ సాయంతో నేరుగా ప్రతీ స్మార్ట్‌ఫోన్‌లో టెలికం కంపెనీల అవసరం లేకుండానే టెలివిజన్‌ ఛానళ్ల ప్రత్యక్ష ప్రసారాలకు వీలుంది. ఇప్పుడు ఇదే పద్దతిని భారత్‌లో ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తున్నది. 
 
ఏటీఎస్‌సీ 3.0కు అనుగుణంగా ప్రస్తుత దేశీయ మార్కెట్‌లోని ఏ స్మార్ట్‌ ఫోన్‌లు అందుబాటులో లేవు. ఒకవేళ కేంద్రం లైవ్‌ టీవీ పాలసీని అమలు చేస్తే తయారీ వ్యవస్థలో భారీ మార్పులు చేయాల్సి వస్తుందని సంస్థలు భావిస్తున్నాయి. ఇది తమకు చాలా నష్టమని మొబైల్‌ ఫోన్‌ తయారీ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరి కంపెనీల ఆందోళనపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. 
 

మరిన్ని వార్తలు