సాక్షి మనీ మంత్ర: బడ్జెట్‌ ర్యాలీ.. భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు

29 Jan, 2024 15:21 IST|Sakshi

దేశీయ ‍స్టాక్‌మార్కెట్లు సోమవారం భారీగా పుంజుకున్నాయి. రానున్న బడ్జెట్‌ నేపథ్యంలో మదుపర్లు మార్కెట్‌లో అధికమొత్తంలో షేర్లను కొనుగోలు చేసినట్లు తెలిసింది. మార్కెట్‌ ముగిసే సమయానికి నిఫ్టీ 387.45 పాయింట్లు పుంజుకుని 21,740.05కు చేరింది. సెన్సెక్స్‌ 1,203.29 పాయింట్లు  లాభపడి 71,903.96 వద్ద ట్రేడింగ్‌ ముగించింది.

మధ్యంతర కేంద్ర బడ్జెట్‌ 2024–25 ప్రభావిత అంశాలు, యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్, బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ ద్రవ్య పాలసీ నిర్ణయాలు ఈ వారం మార్కెట్‌కు అత్యంత కీలకం కానున్నాయని స్టాక్‌ నిపుణులు భావిస్తున్నారు. వాహన విక్రయ డేటా, అదే నెలకు సంబంధించి కొన్ని స్థూల ఆర్థిక గణాంకాలు వెల్లడికానున్నాయి. దేశీయ కార్పొరేట్‌ డిసెంబర్‌ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు తుది దశకు చేరుకున్నాయి.

అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశం మంగళవారం(జనవరి 30న) ప్రారంభమవుతుంది. ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ తీసుకున్న నిర్ణయాలను ఫెడ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ బుధవారం(జనవరి 31)రోజున ప్రకటిస్తారు. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తగ్గుముఖం పట్టినట్లయితే ఈ ఏడాదిలో మూడు దఫాలు వడ్డీరేట్ల కోత ఉంటుందని గతేడాది డిసెంబర్‌లో పాలసీ ప్రకటన సందర్భంగా ఫెడ్‌ సంకేతాలిచ్చింది. ఈ దఫా ఫెడ్‌ కీలకవడ్డీ రేట్లను ప్రస్తుత స్థాయి (5.25 – 5.50 వద్ద) యథాతథంగా కొనసాగవచ్చు. అయితే బాండ్ల కొనుగోలు, ఆర్థిక వ్యవస్థ పనితీరుపై పావెల్‌ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారోనని ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు ఆసక్తి ఎదురుచూస్తున్నాయి. యూఎస్‌ జీడీపీ అంచనాలకు మించి నమోదైన నేపథ్యంలో మార్కెట్‌ వర్గాలు ఫెడ్‌ చైర్మన్‌ పావెల్‌ వ్యాఖ్యలను నిశీతంగా పరిశీలించే వీలుంది.

ఫెడ్‌ పాలసీ తర్వాత దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు అత్యంత ఆస్తకిగా ఎదురుచూసే మరో కీలక ఘట్టం బడ్జెట్‌. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి ఒకటిన మధ్యంతర బడ్జెట్‌ 2024–25 ను ప్రవేశపెట్టనున్నారు. సార్వత్రిక ఎన్నికల వేళ ప్రజాకర్షక బడ్జెట్‌ ఉండొచ్చనేది అత్యధిక వర్గాల అంచనా.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

whatsapp channel

మరిన్ని వార్తలు