కొత్తప్లాన్‌తో భారత్‌లోకి టెస్లా.. ప్రయత్నం ఫలిస్తుందా..?

15 Feb, 2024 11:48 IST|Sakshi

భారతప్రధాని నరేంద్రమోదీ ఇటీవల రూఫ్‌టాప్‌ సోలార్‌ స్కీమ్‌ ప్రకటించిన తర్వాత ఈ రంగంలోని కంపెనీల షేర్లు పెరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి బడ్జెట్‌లో కూడా దాదాపు రూ.10వేలకోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీనివల్ల పేద కుటుంబాలకు ఏటా రూ.18 వేల వరకు లబ్ధి చేకూరుతుందని చెబుతున్నారు. తాజాగా అమెరికాలోని ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా ఇంక్ దేశంలో రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్స్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి స్థానిక భాగస్వామి కోసం చూస్తున్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలుస్తుంది.

ఎలోన్ మస్క్ ఆధ్వర్యంలోని టెస్లా కంపెనీ తన భవిష్యత్తు ప్రణాళిక గురించి ఇప్పటికే ప్రభుత్వానికి తెలియజేసినట్లు లైవ్ మింట్ నివేదిక పేర్కొంది. సబ్సిడీ, ఇతర గ్రాంట్లలో రాయితీ ఇవ్వాలని కంపెనీ ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిసింది. ఎలక్ట్రిక్ కార్ వ్యాపారం కాకుండా, టెస్లా సౌర విద్యుత్ ఉత్పత్తి, కరెంట్‌ స్టోరేజ్‌ చేసే గృహ విద్యుత్ ఉత్పత్తులను కూడా తయారు చేస్తోంది. 

టెస్లా తయారు చేసే ఉత్పత్తుల్లో ‘సోలార్ రూఫ్’ కూడా ఒకటి. దీనిలో పైకప్పును ఫొటోవోల్టాయిక్ టైల్స్‌తో భర్తీ చేస్తారు. దీన్ని పవర్‌వాల్‌ అని పిలుస్తారు. ఇది సోలార్ ప్యానెల్, బ్యాటరీ పవర్ స్టోరేజ్ యూనిట్‌గా వ్యవహరిస్తుంది. అమెరికాలో కంపెనీకి చెందిన సోలార్ వ్యాపారం కొంత మందగించిన తరుణంలో టెస్లా భారతదేశంలో తన కార్యకలాపాలు ప్రారంభించాలని చూస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. అమెరికాలో టెస్లా విద్యుత్‌ వ్యాపారం ఏడాది క్రితం 100 మెగావాట్ల నుంచి డిసెంబర్ త్రైమాసికానికి 59శాతం తగ్గి 41 మెగావాట్లకు చేరుకుంది.

మరోవైపు, దేశీయంగా ఇప్పటికే టాటా పవర్ సోలార్, అదానీ సోలార్, సెర్వోటెక్ పవర్ సిస్టమ్స్..వంటి దేశీయ కంపెనీలు రూఫ్ టాప్ సోలార్ విభాగంలో పనిచేస్తున్నాయి. గత ఐదేళ్లలో భారతదేశ సోలార్ రూఫ్‌టాప్ సామర్థ్యం 47శాతం చొప్పున పెరిగిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. డిసెంబర్ నాటికి దేశం మొత్తం రూఫ్ టాప్ సోలార్ సామర్థ్యం 11.1 గిగావాట్లుగా ఉంది. ఇటీవల కేంద్రం ప్రకటించిన ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పథకం ద్వారా దేశంలోని కోటి ఇళ్లలో రూఫ్‌టాప్ సోలార్ ఎనర్జీ ప్యానెళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు.

ఇదీ చదవండి: గగనతల రారాజు ‘జిర్కాన్‌’.. ఎన్నో ప్రత్యేకతలు

ఇదిలా ఉండగా, ఇప్పటికే టెస్లా కార్ల తయారీ యూనిట్‌ను భారత్‌లో స్థాపించాలని కంపెనీ అన్నివిధాలా ప్రయత్నిస్తోంది. కానీ అందుకు సంస్థ కోరేలా భారీ రాయితీలు, పన్ను మినహాయింపులు ప్రభుత్వం ఇవ్వడానికి సుముఖంగా లేదు. దాంతో జాప్యం జరుతున్నట్లు తెలిసింది. తాజాగా సోలార్‌ రూఫ్‌టాప్‌ల ఏర్పాటుకు భారత్‌లో ప్రవేశించడానికి కొత్త ప్రయత్నం చేస్తోంది.

whatsapp channel

మరిన్ని వార్తలు