అంబేడ్కర్‌ విగ్రహం ధ్వంసం 

25 Oct, 2021 01:38 IST|Sakshi

భైంసాలో దళిత సంఘాల ఆందోళన

భైంసా/భైంసాటౌన్‌ (ముధోల్‌): రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఓ వ్యక్తి ధ్వంసం చేయడం నిర్మల్‌ జిల్లా భైంసాలో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌ ఎదుట గల అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆదివారం మధ్యాహ్నం ఓ వ్యక్తి ధ్వంసం చేయడంతో విగ్రహం చేయి, కంటిభాగం పాక్షికంగా దెబ్బతింది. విషయం తెలుసుకున్న దళిత సంఘాలు, యువకులు అక్కడికి భారీగా చేరుకుని ఆందోళనకు దిగారు. దుండగుడిని తమకు అప్పగించాలంటూ రాస్తారోకో చేశారు.

వెంటనే అక్కడికి చేరుకున్న భైంసా ఏఎస్పీ కిరణ్‌ఖారె నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, ఆందోళన విరమించాలని సూచించారు. అయినా వినకుండా ఆందోళనకారులు బస్సు లపై రాళ్లు రువ్వడంతో అద్దాలు పగిలిపోయాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసు బలగాలను భారీగా మోహరించి ఆందోళనకారులను అదుపు చేశారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకునేందుకు యత్నించగా, అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఆందోళనకారులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పట్టణంలో మూడు రోజులపాటు 144 సెక్షన్‌ అమలు చేస్తున్నట్లు తహసీల్దార్‌ విశ్వంబర్‌ ప్రకటించారు.  

మరిన్ని వార్తలు