బీఆర్‌ఎస్‌కు షాక్‌.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీపై కేసు నమోదు

23 Sep, 2023 09:40 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నార్సింగ్‌లో అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఓ స్థలంపై కన్నేశారు. అక్రమంగా భూమిని కబ్జా చేసే ప్లాన్‌ చేశారు. ఈ నేపథ్యంలో బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో వారిపై నార్సింగిలో కేసు నమోదు అయ్యింది. ఈ ఘటన రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. 

కోకాపేట ల్యాండ్స్‌..
వివరాల ప్రకారం.. నార్సింగిలో భూవివాదంలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, కొల్లాపూర్‌ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డిలపై కేసు నమోదు చేశారు పోలీసులు. కోకాపేటలోని సర్వే నంబరు 85లో 2 ఎకరాల 30 గుంటల భూమిపై పెట్టుబడిదారులు, డెవలపర్‌ మధ్య వివాదం నెలకొంది. దీన్ని పరిష్కరించుకోకుండా డెవలపర్‌ నిర్మించిన తాత్కాలిక గుడిసెల్లో నివాసముంటున్న కూలీలను ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో పాటు వారి అనుచరులు ఖాళీ చేయించారని డెవలపర్‌ ప్రతినిధి గుండు శ్రవణ్‌ గురువారం రాత్రి ఫిర్యాదు చేయగా.. అదేరోజు పోలీసులు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు. కోకాపేటలోని సర్వేనంబరు 85లోని స్థలాన్ని గోల్డ్ ఫిష్ అడోబ్ సంస్థ కొద్ది నెలల నుంచి అభివృద్ధి చేస్తోంది. 

అక్రమంగా తరలింపు..
అయితే, గోల్డ్‌ఫిష్‌ సంస్థతో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామ్‌రెడ్డికి కొన్ని నెలలుగా వివాదం కొనసాగుతున్నట్టు గోల్డ్‌ ఫిష్‌ అడోబ్‌ సంస్థ ప్రతినిధి గుండు శ్రవణ్‌ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గురువారం ఉదయం ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో కలిసి దాదాపు 60 మందికిపైగా కోకాపేటలోని స్థలానికి వచ్చారు. గుడిసెల్లో నివాసముంటున్న కూలీలను ఖాళీ చేయాలంటూ దౌర్జన్యం చేశారు. ఎమ్మెల్సీ అనుచరులు కూలీల తట్టా, బుట్టా బయటకు విసిరేయడమే కాకుండా గర్భిణులపై దురుసుగా ప్రవర్తించారు. ఈ లోపు సమాచారం అందుకున్న నేను అక్కడికి వెళ్లగా.. నాపైనా దాడి చేశారు.  

డీసీఎం వాహనాలను తీసుకువచ్చి కూలీలను బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించారు. కాంటినెంటల్‌ ఆసుపత్రి వద్ద కూలీలను వదిలేసి మరోసారి అక్కడికి వెళితే అంతేనంటూ హెచ్చరించి వెళ్లిపోయారు అని తెలిపారు. దీంతో, తాము పోలీసులను ఆశ్రయించినట్టు స్పష్టం చేశారు. ఈ ఘటనలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామ్‌రెడ్డి, కొల్లాపూర్‌ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డిలతో పాటుగా మరో ఆరుగురిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. 

ఇది కూడా చదవండి: మాజీ మంత్రి హరీశ్వర్‌ రెడ్డి కన్నుమూత.. సీఎం కేసీఆర్‌ సంతాపం

మరిన్ని వార్తలు