సరఫరా చేయమంటే స్వాహా చేశారు.. రూ.1.35 కోట్లు గల్లంతు

21 Dec, 2021 08:30 IST|Sakshi

అమెజాన్‌ ద్వారా అనందిత్‌ సంస్థ కార్యకలాపాలు

తమ వస్తువులు అమేజ్‌ సొల్యూషన్స్‌ ద్వారా సరఫరా

సెప్టెంబర్‌ నుంచి కొన్నింటిని స్వాహా చేస్తున్న పలువురు

రూ.1.35 కోట్ల విలువైన 4262 బాక్సులు గల్లంతు

కేసు నమోదు చేసిన నగర నేర పరిశోధన విభాగం  

సాక్షి, హైదరాబాద్‌: అమెజాన్‌ గోదాములకు చేర్చాల్సిన తమ సరుకును అమేజ్‌ సొల్యూషన్స్‌ సంస్థ కాజేసిందంటూ సికింద్రాబాద్‌కు చెందిన ఆనందిత్‌ సంస్థ నగర నేర పరిశోధన విభాగంలో (సీసీఎస్‌) ఫిర్యాదు చేసింది. ఈ మేరకు రెండు సంస్థలతో పాటు ఏడుగురిపై కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. సికింద్రాబాద్‌లోని సీటీసీ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఆనందిత్‌ ఇన్ఫోటెక్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ కంప్యూటర్‌ విడి భాగాలు, ఉపకరణాల వ్యాపారం చేస్తుంటుంది. ఆన్‌లైన్‌ ద్వారానూ వ్యాపారం చేస్తున్న ఈ సంస్థకు అమెజాన్‌లో ‘ఏ1 ప్రైస్‌ ఏ1 ప్రొడక్ట్‌’ అనే డిస్‌ప్లే నేమ్‌ ఉంది. కస్టమర్ల డిమాండ్‌కు తగ్గట్టు ఆనందిత్‌ సంస్థ తమ ఉత్పత్తులను వివిధ ప్రాంతాల్లో ఉన్న అమెజాన్‌ గోదాములకు చేరుస్తుంటుంది.

అక్కడ నుంచి ఈ సరుకు ఆర్డర్‌ ప్రకారం అమేజాన్‌ ద్వారా వినియోగదారులకు డెలివరీ అవుతుంది. తమ ఉత్పత్తులను నిర్ణీత ప్రమాణాలు, పరిమాణంతో ఉండే బాక్సుల్లో ప్యాక్‌ చేసే ఆనందిత్‌ సంస్థ వాటిపై షిప్‌మెంట్‌ లేబుల్‌ను అతికిస్తుంది. వీటిని ఈ సంస్థ నుంచి అమెజాన్‌ గోదాములకు చేర్చే బాధ్యతలను ఢిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే అమేజ్‌ సొల్యూషన్స్‌ చేపడుతోంది. ఈ సంస్థకు చెందిన ఉద్యోగులు ఆనందిత్‌ సంస్థ నుంచి ఆయా బాక్సులను సేకరించి భద్రంగా అమెజాన్‌ గోదాములకు చేరుస్తుంటారు. అమేజ్‌ సంస్థకు నగరానికి సంబంధించి ఉప్పల్‌లోని హెచ్‌ఎండీఏ లేఔట్‌లో ఉన్న గోదాము ద్వారా ఈ రవాణా జరుగుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌ మొదలు అమెజాన్‌ సంస్థ నుంచి ఆనందిత్‌కు ఈ–మెయిల్స్‌ రూపంలో వరుస ఫిర్యాదులు వస్తున్నాయి. ఆర్డర్‌ ప్రకారం సరుకు రావట్లేదని, వచ్చిన వాటిలోనూ కొంత తక్కువ ఉంటోదని దాని సారాంశం.

మూడు నెలల పాటు వరుస ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఆనందిత్‌ సంస్థ లోతుగా ఆరా తీసింది. ఈ నేపథ్యంలోనే ఈ కాలంలో మొత్తం రూ.1.35 కోట్ల విలువైన 4262 బాక్సులు, సరుకు గల్లంతైనట్లు గుర్తించారు. అమేజ్‌ సొల్యూషన్స్‌ డైరెక్టర్‌ రోహిత్‌ అగర్వాల్‌ కనుసన్నల్లోనే ఇదంతా జరిగినట్లు అనుమానించారు. అక్కడ పని చేసే అనిల్, మనోజ్, కృష్ణ, శరణ్, కిరణ్‌ తదితరుల సాయంతో ఈ సరుకు మాయమవుతోందని, అదంతా ఎస్‌బీ కంప్యూటర్స్, ఆర్వెక్స్‌ ఇన్ఫోటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లతో పాటు అలీ మొబైల్స్‌కు చెందిన అలీలకు చేరుతున్నట్లు అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ మేరకు సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో ఆయా వ్యక్తులు, సంస్థలపై కేసు నమోదు చేశారు. దీన్ని సీ డివిజన్‌ సబ్‌–ఇన్‌స్పెక్టర్‌ మహ్మద్‌ మక్సూద్‌ అలీ నేతృత్వంలోని బృందం దర్యాప్తు చేస్తోంది.     

మరిన్ని వార్తలు